ప్రభుత్వ విప్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అటవీ శాఖ అధికారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అటవీ అధికారులతో ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధం కావలసిందిగా ఆయన పిలుపునివ్వడం సంచలనం కలిగిస్తోంది. తన పేరున గల ఫేస్ బుక్ పేజీలో కాంతారావు అటవీ శాఖ అధికారులపై వివిధ వ్యాఖ్యలతో కూడిన పోస్టులు పెట్టారు. అయితే ఈ ఫేస్ బుక్ పేజీని తానే స్వయంగా నిర్వహిస్తున్నారా? లేక తన సోషల్ మీడియా కార్యకర్తలు నిర్వహిస్తున్నారా? అనే ప్రశ్నలపై స్పష్టత లేదు.

పోడు భూముల జోలికొస్తే ఇక ఊరుకునేది లేదని, పోడు భూముల విషయంలో ఫారెస్ట్ అధికారుల తీరు మారడం లేదని, యుద్ధానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. గ్రామాలకు ఫారెస్ట్ అధికారులను రానీయవద్దని, వస్తే నిర్బంధించాలని, ఇక చూస్తే మన బతుకులు ఆగమవుతాయని రేగా కాంతారావు అన్నారు.

‘హైదరాబాద్ నుంచి రాగానే ఫారెస్ట్ అధికారులతో ప్రత్యక్ష యుద్ధం. ప్రజలతో కలిసి ప్రజలకోసం, పార్టీ కార్యకర్తలు, నాయకులు సిద్ధం కండి’ అని ఆయన పిలుపునిచ్చారు. ఫారెస్ట్ అధికారులతో అమీతుమీ తేల్చుకుందామని, లేకపోతే మన జీవితాలు రోడ్లపై అడుక్కుని తినుడేనని కూడా కాంతారావు వ్యాఖ్యానించారు. ఫారెస్ట్ అధికారులతో పోరాటానికి సర్పంచ్ లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలందరూ ఐక్యతగా బాధ్యత తీసుకుని ప్రజలను సిద్ధం చేయాలన్నారు.

కాగా ఈనెల 11వ తేదీన మణుగూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోడు భూములను అటవీ అధికారులు ఆక్రమించుకుంటే కలెక్టరేట్ కు తాళాలు వేస్తామని కూడా ప్రకటించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ప్రభుత్వ విప్ హోదాలో కాంతారావు ప్రభుత్వ శాఖపై మీడియా, సోషల్ మీడియా ద్వారా చేస్తున్న ఆయా వివాదాస్పద వ్యాఖ్యలు సహజంగానే చర్చకు దారి తీస్తున్నాయి.

Comments are closed.

Exit mobile version