ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావును తాజా వివాదం చుట్టుముట్టింది. మెజిస్టీరియల్ పవర్స్ గల ఓ తహశీల్దార్ కుర్చీలో ఎమ్మెల్యే కూర్చోవడంపై రెవెన్యూ వర్గాలు వేలెత్తి చూపుతున్నాయి. అంతేకాదు తహశీల్దార్ తన ఆఫీసులో లేని సమయంలో అక్కడికి వచ్చి, అతని కుర్చీలో కూర్చుని భీష్మించడం ద్వారా అతన్ని స్థానభ్రంశం చేయించి భీతావహానికి గురిచేస్తే ఇక తాము ఎలా విధులు నిర్వహించాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రెవెన్యూ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈమేరకు జిల్లాలోని తహశీల్దార్లు కలెక్టర్ అనుదీప్ ను కలిసి తమ వాదన వినిపించినట్లు తెలుస్తున్న ఘటన తీవ్ర సంచలనం కలిగిస్తోంది. మణుగూరు తహశీల్దార్ కార్యాలయం వేదికగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు తాజా వివాదంగా మారడం విశేషం. పూర్తి వివరాల్లోకి వెడితే…

మణుగూరు తహశీల్దార్ ఆఫీసులో గురువారం నాటకీయ పరిణామాల మధ్య ఎమ్మార్వో చంద్రశేఖర్ రెడ్డి కలెక్టరేట్ కు అటాచ్ అయిన సంగతి తెలిసిందే. తాను ఫోన్ చేసిన సమయంలో తహశీల్దార్ ఫోన్ స్విచ్చాఫ్ వచ్చిందని, తాను ఫోన్ చేసిన సమయంలో అధికారులు తన ఫోన్ ఎత్తకపోతే పబ్లిక్ లో తన వ్యాల్యూ ఏమతది? అని పినపాక ఎమ్మెల్యే కాంతారావు వాపోయిన ఘటన చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలోనే పినపాక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ రేగా కాంతారావు మణుగూరు తహశీల్ ఆఫీసుకు వెళ్లి, తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి కుర్చీలో కూర్చుని హల్ చల్ చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన విషయం విదితమే. తహశీల్దార్ ను బదిలీ చేసే వరకు తాను కదిలేది లేదని ఎమ్మెల్యే రేగా భీష్మించడంతో తీవ్ర ఒత్తిడి మధ్య కలెక్టర్ అనుదీప్ అనివార్యంగా స్పందించక తప్పలేదు. ఇందులో భాగంగానే మణుగూరు తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిని కలెక్టరేట్ కు అటాచ్ చేశారు. అయితే తన ఫోన్ స్విచ్చాఫ్ కు దారి తీసిన పరిణామాలను తెలుసుకోకుండా ఎమ్మెల్యే ఆగ్రహంతో తమ ఆఫీసుకు వచ్చి ఇష్టారీతిన మాట్లాడి తనను తీవ్ర మనస్తాపానికి గురి చేశారని తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి మీడియాతో వాపోయారు.

మణుగూరు తహశీల్దార్ కుర్చీలో ఎమ్మెల్యే రేగా కాంతారావు కూర్చున్న దృశ్యం (ఫైల్ ఫొటో)

ఈ ఘటనను రెవెన్యూ అధికార వర్గాలు తీవ్రంగా అక్షేపిస్తున్నాయి. అసలు తహశీల్దార్ కుర్చీలో కూర్చునే అధికారం ఎమ్మెల్యేకు ఎక్కడిదని ప్రశ్నిస్తున్నాయి. మెజిస్టీరియల్ అధికారాలు గల తహశీల్దార్ కుర్చీలో కూర్చునే అధికారం ఇదే శాఖకు చెందిన ఉన్నతాధికారులకు తప్ప మరే ఇతర శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులకు కూడా లేదని గుర్తు చేస్తున్నాయి. ప్రభుత్వ విప్ హోదాలో గల ఎమ్మెల్యేకు ఈ విషయం తెలియదా? అని కూడా రెవెన్యూ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే….

తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డిపై తీసుకున్న చర్య విషయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన పలువురు తహశీల్దార్లు, రెవెన్యూ అధికారులు కలెక్టర్ అనుదీప్ ను శుక్రవారం కలిసి తమ వాదన వినిపించినట్లు ఆలస్యంగా అందిన సమాచారం. ఈరోజు మణుగూరులో జరిగిన ఘటన రేపు మరో నియోజకవర్గంలో కూడా జరగవచ్చని, ఎమ్మెల్యేలు, లేదా ఇతర ప్రజాప్రతినిధులు తహశీల్దార్ కార్యాలయాల్లోకి చొరబడి మెజిస్టీరియల్ పవర్స్ గల అధికారుల కుర్చీల్లో కూర్చుని హల్ చల్ చేయడం ద్వారా స్థానభ్రంశానికి గురిచేస్తే తాము విధులు ఎలా నిర్వహించాలని వాపోయినట్లు సమాచారం. మణుగూరు తహశీల్దార్ ఘటనలో చోటు చేసుకున్న పరిణామాలపై తీవ్ర భీతావహానికి గురైన పలువురు తహశీల్దార్లకు కలెక్టర్ అనుదీప్ నచ్చజెప్పినట్లు తెలిసింది. ఎవరూ భయాందోళనకు గురి కావద్దని కలెక్టర్ సముదాయించినట్లు తెలిసింది. మొత్తంగా మణుగూరు తహశీల్దార్ కుర్చీలో కూర్చుని హల్ చల్ చేసిన ఉదంతం తీవ్ర వివాదంగా మారడం ఎమ్మెల్యే కాంతారావుకు సరికొత్త వివాదంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

ఫైల్ ఫొటో: తహశీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పక్కన కూర్చోగా, అతని కుర్చీలో ఎమ్మెల్యే రేగా కాంతారావు కూర్చున్న దృశ్యం

Comments are closed.

Exit mobile version