కృష్ణా న‌దీ యాజ‌మాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పరిశీలన బృందంలో సీడ‌బ్ల్యూసీ స‌భ్యుడు దేవేందర్ రావు ఉండడంపై ఏపీ ప్రభుత్వం అభ్యంత‌రం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తెలంగాణా ప్రభుత్వం స్పందిస్తూ నిరసన వ్యక్తం చేసింది.

గ‌తంలో సీడ‌బ్ల్యూసీ స‌భ్యుల‌పై తాము అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని తెలంగాణ ఈఎన్‌సీ ప్రస్తావించింది. రాష్ట్ర ప్రాజెక్టుల ప‌రిశీల‌న బృందంలో కె. శ్రీనివాస్ ఉన్నారని, గ‌తంలో కె. శ్రీనివాస్‌పై తాము అభ్యంత‌రం చెప్ప‌లేద‌ని గుర్తు చేసింది. సీడ‌బ్ల్యూసీ అధికారికి ప్రాంతాల‌ను ఆపాదించ‌డం అనైతికమని ఈఎన్‌సీ వ్యాఖ్యానించింది. ఎన్జీటీ ఆదేశాల‌ను ఆల‌స్యం చేయ‌డ‌మే ఏపీ ఉద్దేశంగా కనిపిస్తోందని తెలంగాణ ఈఎన్‌సీ అభిప్రాయ‌ప‌డింది.

ఎన్జీటీ ఆదేశాల మేర‌కు రాయ‌ల‌సీమ ప‌నుల‌ను కేఆర్ఎంబీ ప‌రిశీలించాలని, రాయ‌ల‌సీమ ప‌నుల ప‌రిశీల‌న‌పై ఈ నెల 9వ తేదీ లోపు నివేదిక ఇవ్వాల‌ని తెలంగాణ ఈఎన్‌సీ కోరింది. కాగా ఈ నెల 9న నిర్వ‌హించ‌నున్న కృష్ణా, గోదావ‌రి బోర్డు స‌మావేశానికి హాజ‌రు కావ‌డం లేద‌ని తెలంగాణ ఈఎన్సీ ముర‌ళీధ‌ర్ స్ప‌ష్టం చేశారు. కృష్ణా జ‌లాల వివాదం కేసు సుప్రీంకోర్టు, ఎన్జీటీలో విచార‌ణ ఉన్నందున తాము ఈ సమావేశానికి రాలేమ‌ని పేర్కొన్నారు. బోర్డు స‌మావేశానికి మ‌రో తేదీ ఖ‌రారు చేయాల‌ని ఈఎన్సీ కోరింది.

Comments are closed.

Exit mobile version