తెలంగాణా వ్యాప్తంగా 30 లక్షల మందిని కరోనా సూపర్ స్ప్రైడర్లుగా ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ ఈనెల 28వ తేదీ నుంచి వ్యాక్సిన్లు వేయాలని కూడా సర్కార్ నిర్ణయించింది. ఈమేరకు తెలంగాణా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే ముందుగా జీహెచ్ఎంసీ ప‌రిధిలోని ఆటో డ్రైవ‌ర్లు, బ‌స్సు డ్రైవ‌ర్లు, హోట‌ల్స్, సెలూన్ల సిబ్బంది, కూర‌గాయ‌ల వ్యాపారులు, కిరాణా దుకాణ‌దారులు, హ‌మాలీల‌కు వ్యాక్సిన్లు వేయాల‌ని నిర్ణ‌యించారు.

కోవిడ్ వ్యాక్సినేష‌న్‌పై మంత్రి హ‌రీష్ రావు అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన స‌మావేశంలో సూప‌ర్ స్ప్రైడ‌ర్ల‌కు టీకాలు వేసే విష‌యంపై స‌మావేశంలో చ‌ర్చించారు. సూప‌ర్ స్ప్రైడ‌ర్ల గుర్తింపు, అవ‌స‌ర‌మైన ఏర్పాట్ల‌పై చ‌ర్చించారు. తాత్కాలిక స‌చివాల‌యమైన బీఆర్‌కే భ‌వ‌న్‌లో జ‌రిగిన ఈ స‌మావేశానికి సీఎస్ సోమేశ్ కుమార్, వైద్యారోగ్య‌, కుటుంబ సంక్షేమ సెక్ర‌ట‌రీ రిజ్వి, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్, సీడీఎంఏ స‌త్య‌నారాయ‌ణ‌, ట్రాన్స్‌పోర్టు క‌మిష‌న‌ర్ ఎంఆర్ఎం రావు, ప‌బ్లిక్ హెల్త్ డైరెక్ట‌ర్ శ్రీనివాస్ రావుతో పాటు ఇత‌ర అధికారులు హాజ‌ర‌య్యారు.

ఎల్పీజీ సిలిండ‌ర్లు స‌ర‌ఫ‌రా చేసే వారు, రేష‌న్ దుకాణాల డీల‌ర్లు, పెట్రోల్ పంప్ వ‌ర్క‌ర్లు, ఆటో, క్యాబ్ డ్రైవ‌ర్లు, రైతు బ‌జార్ల‌లో ఉండే వ‌ర్త‌కులు, కూర‌గాయ‌లు, పండ్లు, పూలు అమ్ముకునే వారు, నాన్ వెజ్ మార్కెట్లు, కిరాణా దుకాణాల వారికి, మ‌ద్యం దుకాణాల వారిని సూపర్ స్ప్రైడర్లుగా గుర్తిస్తూ వీరందరికీ టీకా కోసం ప్ర‌త్యేక డ్రైవ్ చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించారు. వైరస్‌ను వ్యాపింపజేసే అవకాశమున్న సూపర్‌ స్ప్రెడర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని నిర్వహించాలని, ఇందుకు సంబంధించిన విధివిధానాలను రూపొందించాలని మంత్రి హరీశ్‌రావు, వైద్యారోగ్యశాఖ అధికారులను సీఎం కేసీఆర్‌ ఆదేశించిన సంగతి తెలిసిందే.

Comments are closed.

Exit mobile version