‘‘మన డాక్టర్లు అలసిపోవద్దు. బయట నుంచి మనకు డాక్టర్లు రారు. ఉన్న డాక్టర్లను కాపాడుకోవాలి. ఇందుకోసం ఆరోగ్యశాఖ మంత్రి, కార్యదర్శి వారికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేస్తున్నరు.’’ కరోనా వైరస్ వ్యాప్తి, సర్కారు తీసుకుంటున్న చర్యల గురించి వివరిస్తూ ఈనెల 24వ తేదీన తెలంగాణా సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి.

‘‘ముప్పు ఉన్నా ముందుండి పనిచేస్తున్నడాక్టర్లు, ఇతర వైద్య సిబ్బంది గురించి ఆలోచించండి. ఈ మహమ్మారి నుంచి ఒక్కో జీవితాన్ని కాపాడడానికి రేయింబవళ్లు అసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్య సిబ్బంది గురించి ఆలోచించండి. ఇతరుల కోసం పనిచేస్తున్న వారికోసం ప్రార్థించండి.’’ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజలను కాపాడేందుకు శ్రమిస్తున్న వైద్య సిబ్బంది గురించి దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈనెల 24న ప్రజలకు చేసిన వినతికి సంబంధించిన సారాంశమిది.

ఇప్పుడీ ఇద్దరు ముఖ్య నేతల హితవు వ్యాఖ్యల ప్రస్తావన దేనికంటే… తెలంగాణాలోని ఖమ్మం నగరంలో ఓ మహిళా డాక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో ఓ పోలీసు అధికారిని రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. సదరు మహిళా డాక్టర్, పోలీసు అధికారి మధ్య జరిగినట్లు పేర్కొన్న ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం, ప్రభుత్వం తీవ్రంగా స్పందించి ఆయా పోలీసు అధికారిని అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం చకచకా జరిగిపోయాయి.

కరోనా వైరస్ కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న గట్టి చర్యల నేపథ్యంలో వైద్య సిబ్బందికి చిన్న ఇబ్బంది కలిగినా క్షమించే ప్రసక్తే లేదనే సంకేతాన్ని ఇస్తూ దేశ ప్రధాని మోదీ, తెలంగాణా సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేసీఆర్ సార్ సర్కార్ తీసుకునే చర్యలకు విఘాతం కలిగే విధంగా మై హోం రామేశ్వరరావుకు చెందిన టీవీ9 మీడియా సంస్థ వార్తా కథనాలు ప్రసారం చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది.

మొన్నా మధ్య పోలీసులపై ప్రచురించిన ఓ వార్తా కథనం అంశంలో ‘ఈనాడు’ పత్రిక తీరుపై రాష్ట్ర హోం మంత్రి మహమూద్ ఆలీ నుంచి పలు కమిషనరేట్లకు చెందిన పోలీస్ కమిషనర్లు మీడియా మీట్లు పెట్టి ఖండ ఖండాలుగా ఖండించిన సంగతి తెలిసిందే. ఈ ఖండన తీవ్రతకు బెంబేలెత్తిన ఈనాడు పత్రిక తన ప్రస్థానంలో ఎన్నడూలేని విధంగా మొదటి పేజీలోనే ‘కించ పరిచే ఉద్దేశం లేదు’ శీర్షికన మరో వార్తను ప్రచురించిన విషయమూ విదితమే.

కానీ కేసీఆర్ సర్కారుకు ఉపకరిస్తుందనే ప్రధాన లక్ష్యంతోనే మైహోం రామేశ్వరరావు కొనుగోలు చేసినట్లు ప్రాచుర్యం గల టీవీ9లోనే సర్కారు తీసుకున్న చర్యకు వ్యతిరేకంగా ఓ వార్తా కథనం ప్రసారం కావడం జర్నలిస్టు సర్కిళ్లలోనేకాదు, పోలీసు వర్గాల్లోనూ తీవ్ర చర్చకు దారి తీసింది. కేవలం ఓ అధికారిపై చర్య తీసుకున్న కారణంగా ఖమ్మం నగరంలో పోలీసు యంత్రాంగమే పనిచేయడం లేదన్నట్లు, ఇక్కడ పోలీస్ కమిషనర్, డీసీపీలు, ఏసీపీలతోపాటు మిగతా పోలీసు యంత్రాంగం ఎవరూ పనిచేయడం లేదన్నట్లు, వారి ఆత్మస్థయిర్యం పూర్తిగా దెబ్బ తిందని పేర్కొంటూ వార్తా కథనం ప్రసారం కావడం గమనార్హం.

టీవీ9లో ప్రసారమైన ఈ వార్తా కథనం అంతకు ముందుగానే చంద్రబాబు భజన సంస్థగా ప్రాచుర్యం పొందిన మరో టీవీలో ప్రసారం కావడం అసలు విశేషం. ఈ నేపథ్యంలో ఇది పక్కా ప్లాంటెడ్ న్యూస్ స్టోరీగా భావిస్తే మాత్రం అందుకు బాధ్యులెవరన్నదే అసలు ప్రశ్న. ఎందుకంటే కేసీఆర్ సర్కార్ తీసుకునే ప్రజాప్రయోజన చర్యలపై ప్రజల్లో సానుకూల ధృక్పథం కలిగే విధంగా వార్తా కథనాలు ప్రసారం చేయాల్సిన బాధ్యత టీవీ9కు ఉందనేది అధికార పార్టీ వర్గాల వాదన. ఇందుకు విరుద్ధంగా జరిగే ప్రతి చర్యా మైహోం రామేశ్వరరావు లక్ష్యానికి విఘాతంగానే ఆ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఈ వార్తా కథనానికి సపోర్ట్ చేసే విధంగా, ప్రభుత్వం తీసుకున్న చర్య వల్ల తమ ఆత్మ స్థయిర్యం దెబ్బ తిందని చెప్పే ఏ ఒక్క పోలీసు అధికారి లేదా కనీసం సాధారణ కానిస్టేబుల్ వాయిస్ లేకపోవడమే మొత్తం వార్తా కథనంలో గమనించాల్సిన అంశం.

Comments are closed.

Exit mobile version