అధికారులు నిర్భీతిగా తమ బాధ్యతలను నిర్వర్తించాలని , ఎవరో వత్తిడి చేస్తున్నరనే మాట వినపడకూడదని తెలంగాణా సీఎం కేసీఆర్ అన్నారు. ‘మీ పని మీరు సమర్థవంతంగా చేయండి. మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు.మీ వెంట సీఎం కేసీఆర్ వున్నడనే ధైర్యంతో పనిచేయండి..’ అని అధికారులకు సీఎం స్పష్టం చేశారు. పల్లెప్రగతి, పట్టణ పురోగతి తదితర అంశాలపై కేసీఆర్ జిల్లా అదనపు కలెక్టర్లతో, డీపీవోలతో ఆదివారం ప్రగతి భవన్ లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం అనేక అంశాలపై మాట్లాడుతూ..,

‘అసాధ్యమనేది ఏదీ వుండదు. గట్టిగా తలుచుకోవాలె. మనకు పల్లెలు పట్టణాల అభివృద్ధిని మించిన మరో పనిలేదు. అవసరమైతే మీరు పల్లెల్లో పర్యటనలు చేపట్టాలె. రాత్రిళ్లు బస చేసి పొద్దున లేచి జనంలో తిరుగాలె. అప్పుడు మాత్రమే మనకు క్షేత్రస్థాయి కష్టాలు అర్థమైతయి.వాటికి పరిష్కారాలను మీరు కనుగొనగలుగుతరు. మీరు గ్రామాల్లో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడానికి నూతన వాహనాలను ఇప్పటికే సిద్ధం చేసి ఉంచాం. పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలకోసం నెల నెలా క్రమం తప్పకుండా ప్రభుత్వం నిధులను విడుదల చేస్తున్నది. పంచాయితీరాజ్ వ్యవస్థలో ఒక్క పోస్టు కూడా గంటపాటుకూడా ఖాళీ లేకుండా నూటికి నూరు శాతం ఖాళీలను పూర్తిచేసుకున్నం. ఆర్ధిక వనరులున్నయి, ఉద్యోగ వ్యవస్థ ఉన్నది, ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండగా నిలుస్తున్నది. ఇంకేంగావాలె ? ఏ ప్రభుత్వమైనా ఇంతకన్నా ఎక్కువగా ఏం చేయగలుగుతుంది ? కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రభుత్వ చర్యలకు గురికావద్దు’ అని మరోమారు సీఎం స్పష్టం చేశారు. పర్సనల్ అప్రేజల్ రిపోర్టును (పీఏఆర్) తయారు చేయడం ద్వారా కలెక్టర్ల పనితీరును రికార్డు చేస్తామన్నారు. గ్రామాల్లో గ్రామ పంచాయితీ కార్యదర్శి పోస్టు వొక్క గంట కూడా ఖాళీ వుండకూడదని ఎక్కడ అవసరముందో అక్కడ తక్షణమే నింపుకునే అధికారాన్ని కలెక్టర్లకు ఇచ్చిన విషయాన్ని సీఎం గుర్తుచేశారు. ఎంపీవోలకు వోరియెంటేషన్ కోసం క్లాసులు నిర్వహించాలని సూచించారు.

నిరంతరం డీపీవోలు, డీఎల్పీవోలు, ఎంపీడీవో లతో సమావేశాలు నిర్వహించాలని, అలసత్వం వదిలి నిత్యం గ్రామాభివృద్ధిమీదనే దృష్టి కేంద్రీకరించాలన్నారు. ‘సేవ్ ద పీపుల్… సేవ్ ద విలేజెస్… సేవ్ యువర్ సెల్ప్… అని అదనపు కలెక్టర్లు డీపీవోలకు హితబోధ చేశారు. పనితీరు సరిగా లేనప్పుడు షోకాజ్ నోటీసులు పంపడమే కాదు, తర్వాత వాటి మీద తాత్సారం చేయకుండా చర్యలు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. అన్ని అవకాశాలు కల్పించి అన్ని రకాలుగా ప్రోత్సహించినా కూడా నిర్దేశించిన బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించకోపోవడం నేరమని సీఎం అధికారులను ఉద్దేశించి స్పష్టం చేశారు. ‘నేల విడిచి సాము చేయడం అనేది మనకు అలవాటయ్యింది. మన పక్కన్నే చేయవలసినంత పని వున్నది. అది వొదిలి ఎక్కన్నో ఏదో చేయాలనుకోవడం సరికాదు. ఆరునెల్ల పాటు కష్టపడండి. గ్రామాలు,పట్టణాలు ఎందుకు అభివృద్ది కావో చూద్దాం. మీరు అనుకున్న పనిని యజ్ఞంలా భావించి నిర్వహిస్తే ఫలితాలు తప్పకుండా సాధించగలం’ అని సీఎం అన్నారు. ‘‘ నేను కూడా ఒక జిల్లాను దత్తత తీసుకుంట. అదనపు కలెక్టరు నేను కలిసి పనిచేస్తం. అభివృద్ధి ఎందుకు జరగదో చేసి చూపిస్తం.’’ అని కేసీఆర్ అన్నారు.

Comments are closed.

Exit mobile version