టీఆర్ఎస్ పార్టీ నుంచి నిష్క్రమించిన మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లాలోనూ కనిపిస్తోంది. ఈటెల వెంట బీజేపీలో చేరేందుకు ఖమ్మం జిల్లాకు చెందిన ప్రముఖ నాయకుడితోపాటు ముదిరాజ్ సంఘానికి చెందిన ముఖ్యుడొకరు ఢిల్లీ కి వెళ్లారు. ఈ పరిణామం ఖమ్మం జిల్లా రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసిన ఈటెల రాజేందర్ తన అనుయాయ, అనుచరగణంతో బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే దాదాపు 220 మందితో ప్రత్యేక విమానంలో ఈటెల రాజేందర్ ఈ ఉదయం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈటెల వెంట మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, జెడ్పీమాజీ చైర్మెన్ తుల ఉమ, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి వంటి ప్రముఖులు కూడా ఉన్నారు. ఈటెల రాజేందర్ ప్రభావం ఉమ్మడి కరీంనగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వరకే ఉంటుందని నిఘా వర్గాలు కొంతమేరకు అంచనా వేశాయి.

అయితే ఈ అంచనాలకు అందని విధంగా ఖమ్మం జిల్లాలోనూ ‘ఈటెల’ ప్రభావం కనిపిస్తుండడం గమనార్హం. టీజేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం అనుచరగణంలో ముఖ్యుడు, ఖమ్మం జిల్లా టీజేఎస్ అధ్యక్షుడు డాక్టర్ శీలం పాపాారావు బీజేపీలో చేరేందుకు ఈటెల వెంట పయనమయ్యారు. ఇందులో భాగంగానే ఈ ఉదయం ఈటెల రాజేందర్ ఏర్పాటు చేసిన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి బయలుదేరారు. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో డాక్టర్ శీలం పాపారావు తనదైన శైలిలో ప్రత్యేకతను ఆపాదించుకున్నారు ఆదినుంచీ ప్రొఫెసర్ కోదండరాం వెంటే ఉన్న డాక్టర్ పాపారావు తాజా రాజకీయ నిర్ణయం సంచలనానికి దారి తీసినట్లు పరిశీలకులు చర్చించుకుంటున్నారు. ఇటీవలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రొఫెసర్ కోదండరాం సాధించిన గణనీయమైన ఓట్లలో డాక్టర్ పాపారావు కృషి తీవ్రంగా ఉన్నట్లు టీజేఎస్ వర్గాలే చెబుతుంటాయి. వైద్యవర్గాల్లోనేగాక, వివిధ సామాజిక వర్గాల్లో డాక్టర్ పాపారావుకు మంచి పేరుంది. ప్రొఫెసర్ కోదండరాంను విడిచి డాక్టర్ పాపారావు ఈటెల రాజేందర్ వెంట బీజేపీలో చేరేందుకు వెళ్లిన ఘటన అనూహ్యంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా ఖమ్మం జిల్లా ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు జానకిరాములు కూడా బీజేపీలో చేరేందుకు ఈటెల వెంట ఢిల్లీకి వెళ్లారు.

Comments are closed.

Exit mobile version