పొలాసలో, ములకనూరులో విత్తనాల పంటలు తీస్తారు. కేసీఆర్ ఏ విత్తనాల పంట వేసినా ఓట్ల పంట తీస్తారు. ఓట్లు పండే విత్తనాలే వేస్తారు. చేపల పెంపకం, గొర్రెల పెంపకం, రైతు బంధు, దళిత బంధు, మిషన్ భగీరథ, కాళేశ్వరం, డబల్ బెడ్రూం, ఆసరా పథకం … ఏది తీసుకున్నా ఇబ్బడి ముబ్బడి ఓట్ల పంట తీయడమే. ఫాం హౌజ్ లో ఈ ప్రయోగాలు తెచ్చి విత్తనాలు చల్లుతాడు. వీటితో రెండున్నర కోట్ల ఓట్ల పంట తీస్తున్నాడు.

పేరుగొప్ప ఊరు దిబ్బ అని సామెత, నుడికారం. పేరు గొప్ప ఊరు దిబ్బ, పైన పటారం లోన లొటారం వంటి పథకాలెన్నో కేసీఆర్ మదిలో ఉన్నాయి. కేసిఆర్ ను 2005 నంచి దగ్గరగా గమనించి అనేక నిర్వచనాలిచ్చిన. అందులో ఫుల్ టైం థింకర్-పార్ట్ టైం వర్కర్ అనేది ఒకటి.

అందరికీ వెయ్యి చదరపు అడుగుల డబుల్ బెడ్ రూం, అందరికీ కేజీ టు పీజీ ఉచిత రెసిడెన్షియల్ విద్య, ఉచిత వైద్యం. విద్యావంతులకు చక్కని ఉద్యోగం. ప్రతి ఇంటికి మంచి నీటి నల్లా. ప్రతి ఎకరానికి పంట నీరు. ప్రతి ఇంటికి కరెంటు… బీసీ ముఖ్య మంత్రి, దళిత ముఖ్యమంత్రి. ఫెడరల్ ఫ్రంటుతో కేంద్రంలో జాతీయ ప్రభుత్వం … ఇలా ఎన్నో కలలు కన్నాం.

కలలు కనడం ఉద్యమ కారుల సహజ లక్షణం. కలలు కనడం వారి హక్కు. కానీ ప్రభుత్వంలోకి వచ్చాక వాటిని సాకారం చేయడం కర్తవ్యం. వాటి అమలు నినాదాలిచ్చినంత తేలిక కాదు. నిరంతర జాగరూకత, ఫాలో అప్ ఆక్షన్, క్షేత్ర పర్యటనలతో ఆచరణ అమలు తీరు ఫలితాల తీరు పరిశీలించడం పరీక్షించడం అవసరం. కేసీఆర్ లో అది లోపించింది. ఓట్ల కోసం తప్ప ప్రజలను కలవడం కోసం సభలు పెట్టలేదు. ప్రగతి భవన్, ఫాం హౌజు గేట్లు తీయలేదు. ఇసొంటి ముఖ్య మంత్రిని నేను ఎక్కడ సూడలేదు. అధికారిక కలలు కనుకుంటూ నిద్ర తీస్తుంటాడు.

అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఫుల్ టైం వర్కర్ గా పని విధానం మలుపు తిరగాలి. వాజపేయి ఓ మాటన్నాడు. నలభయి ఏళ్లు మాటలు చెప్పడానికి అలవాటు పడ్డ నాలిక. ప్రతి పక్షంగా ఆ పని చేశాను. అధికారంలోకి వచ్చాక చెప్పాల్సింది మాటలు కాదు. చేసి చూపడం అని అర్థమైంది అన్నాడు. అప్పటినుంచి వాజపేయి మాటలు చెప్పడం మానేశాడు. కాని నరేంద్ర మోడీ, కేసీఆర్ అధికారంలోకి వచ్చినా మాటలు చెప్తూ బతికేస్తున్నారు. ఆ మాటకు వస్తే నాలాంటి వాళ్లు, అధికారంలో లేని వాళ్లు, మాటలు చెప్తూ బతికేస్తుంటారు. వీరినే ముద్దుగా మేధావులు, తత్వవేత్తలు, జర్నలిస్టులు, అడ్వకేట్లు , పెద్ద మనుషులు , సలహా దారులు , రాజ గురువులు అని పిలుస్తుంటారు.

ఏ పథకానికైనానమంచి పేరు పెట్టడంలో కేసీఆర్ దిట్ట. ఒక ప్రసంగాన్ని ఒక చిన్న నినాదంలో ఇమడ్చడంలో కేసీఆర్ నేర్పరి. పాటల ట్యూన్, పాటలలోని పదాలు, భావాలు ఎలా ఉండాలో నిర్దేశించగల నిపుణుడు. ప్రజల నాడికనుకూలంగా ఉపన్యాసం ఎలా మొదలు పెట్టి, ఎలా ముగించాలో తెలిసిన చమత్కారి కేసీఆర్.
ఆయనొక థింక్ ట్యాంక్. దానికి నాగార్జున సాగర్ కున్నట్టు గేట్లుంటాయి. వరద ఎక్కువస్తే ఎన్ని టియంసీలు అవసరమో అంత ఉంచుకొని మిగతావి గేట్లు తీసి వదిలేస్తాడు. అవసరమైనపుడుకాళేశ్వరం ప్రాజెక్టులా వదిలేసిన నీటిని తిరిగి ఎత్తిపోతల పథకంతో నింపుతాడు.

అబ్దుల్ కలామ్ చెప్పినట్టు అద్భుతమైన , ఉన్నతమైన, ఉదాత్తమైన కలలు కంటాడు. డ్రీమ్స్ క్రేజీ గల కలల పిచ్చి. తెలంగాణ ఏర్పడాలని ఒక కల. తెచ్చిన పేరంతా తనకే దక్కాలని కల. తానే ముఖ్యమంత్రి కావాలని కల. తన కొడుకు, కూతురు, మనవడు ముఖ్యమంత్రి కావాలని, వీలైతే ముని మనవడు అమెరికా అధ్యక్షుడు కావాలని కల. వయసు తరుముకొస్తున్నది. ఆరోగ్యం హెచ్చరిస్తున్నది. తన జీవిత కాలంలో కనీసం ఎనిమిది నెలలైనా ప్రధాన మంత్రి కావాలని కల. తన చేతుల మీదుగా ఒక్కసారైనా తాను కల గనే ఫెడరల్ ప్రభుత్వంలో ప్రధాన మంత్రిగా కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను ప్రవేశ పెట్టాలని కల. తన వెలమ కులం, మర్వాడీ గుజరాతీ యూదుల వలె ప్రపంచానికి విస్తరించాలని కల. గంగా యమున ఆది నదుల డెబ్బయి వేల టీయంసీల నీరు ప్రజలకు , పొలాలకు, తనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ లా నిధులు వచ్చి పడాలని కల. తన శత జయంతి నాటికి గాంధీ అంబేద్కర్ .పీవీ, కేసీఆర్ అనాలని కల. సామాజిక ఉద్యమకారుల కలల వంటివే ఇవి.

నా క్కూడా కొన్ని కలలున్నాయి. కొన్ని కలలు ఎండి పోయాయి. దున్నేవారికే భూమి అని కల గన్నాను. సమ సమాజం, సోషలిజం నా జీవిత కాలంలో చూడాలని కల గన్నాను. దేశీయ వనరులతో సకల సంపదలు సృషించాలని, ప్రతి కుటుంబం సిరి సంపద, భోగ, భాగ్య, ఆరోగ్యాలతో తుల తూగాలని కలలు కన్నాను. రోజులు గడిచిన కొద్దీ కలలు దగ్గరయ్యే బదులు దూరమవుతూ వచ్చాయి. ఆ మధ్య ప్రధాన మంత్రి కావాలని కలలు కనక పోలేదు. బ్రయాన్ ట్రేసీ లక్ష్యాలు పుస్తకంలో సాధ్యమయ్యే వాస్తవిక కలలే కనాలని చెప్పడంతో చాలా కలలు వదిలేసాను. కలలు కనడం మానేసినంత పనైపోయినా అపుడపుడు అందమైన కలలు వస్తూనే ఉంటాయి. పేదలను సంపన్నులను చేయడం ఎలా అనే కల అందులో ఒకటి.

కేసీఆర్ కూడా ఇలాంటి కలలు కొన్ని స్వప్నించాడు. దళితులను సంపన్నులను చేయాలని మేం కన్న కలలే దళిత బంధు పేరుతో ముందుకు వచ్చింది. దేశ ప్రజల తల దిమ్మ దిరిగి పోయింది. అయితే ముందుకు తెచ్చిన సందర్భమే అనుమానాలు పెంచింది. అమలు కాని డబల్ బెడ్రూం, అమలు కాని ఇంటింటికి మంచినీటి నల్లా, అమలుకాని కేజీ టు పీజీ విద్య, అమలు కాని ఉచిత వైద్యం, అమలు కాని ప్రతి ఎకరానికి పంటనీరు, అమలు కాని ఉన్నత విద్య, ఉద్యోగాలు… అన్నీ అసంపూర్ణాలే. దళిత బంధు కూడా ఓట్ల కోసం పాలు పిండే ముందు తౌడు నీళ్లు పెట్టినట్టు తెచ్చిండు కేసీఆర్. సందర్భం కూడా కొడుకును చంపి పది లక్షలు పరిహారం ఇస్తున్న తీసుకో అన్నట్టు ఈటల రాజేందర్ ను రాజకీయంగా బొంద పెట్టాలని హుజురాబాద్ లో మొదలు వెట్టిండు. కేసీఆర్ వలనే తెలంగాణ వచ్చిందని చెప్పినట్టు ఈటలన్న వల్లనే ఈ పథకాలచ్చినై ప్రజలు సంతోష పడుతున్నరు. ఈటల రాజేందర్ సల్లగ బతకాలె. ఈటల తోటి ఉంటే ఇట్ల ఇంకెన్ని పథకాలు వస్తయో ఆశతో ఎదిరి చూస్తున్నరు. తెలంగాణ ఏర్పాటు కేసీఆర్ ఖాతాలో పడ్డట్టు ఇటీవలివన్నీ ఈటల విజయాల ఖాతాలో జమయితున్నయి.

ఎందుకోగానీ కేసీఆర్ పలకరించడం మానేసాక కేసీఆర్ కనే అద్భుత కలలన్ని ఓట్ల పంట, నిధుల సేకరణ కోసమే అనిపించడం మొదలైంది. ఆదర్శాల కంటి పొరలు తొలగి పోయాయి. తెరతీస్తే తెర వెనక బాగోతాలు వేరు. తెర ముందు చూపేది వేరు అని అర్థమైంది. ఓట్ల పంటలతో దీర్ఘకాలిక జాతీయాభివృద్ది దృష్టి లోపం పెరుగుతున్నది. ఎంతైనా కేసీఆర్ అదృష్టవంతుడు. తెలంగాణా సాధకుడుగా పేరు కొట్టేసిండు. అందరి పేరు ఒక్కడే తన ఖాతాలో వేసుకునుడు అందరితోని అయితదా..? ముఖ్యమంత్రి కూడ అయిండు. బోనస్ గా కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు , అక్కలు, బావలు, సడ్డకులు అందరు పైకి వచ్చిన్రు. సడ్డకుల పిలగాన్లు కూడ పైకి వచ్చిన్రు. అందరు మంచిగ సంపాయించుకున్నరు. ఎక్కడ చూసినా వెలమలనే పెట్టుకున్నడు. గింత అదృష్టం అందరికి వస్తె మంచిగుండు అని నా ఇప్పటి కల.

దళిత బంధు, పది లక్షల ఆలోచన ఎస్సీ సబ్ ప్లాన్, కాంపోనెంట్ ఫండ్సుతో నడుస్తది. అయితే ఈ ఆలోచన ఇంతవరకు ఎవరికి రాలే. ఇంత కన్న మంచి ఆలోచనలు, ప్రజలకు అందే ఆలోచనలు రాజకీయ నాయకులు, మేధావులు చేయ గలరా? అలాంటి వాటితో ముందుకు రావాలి. జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకు కోచ్ లుంటారు. వారు అనేక మంది ఆటలను గమనించి మెళకువలు నేర్పుతారు. కోచ్ లేని ఆట గెలవడం కష్టం. అందువల్ల కేసీఆర్ ఆడే ఆట మెలకువలను నేర్పే కోచ్ లు నేటి అవసరం. కమ్మ, వెలమ, రాజులు, రెడ్లు, వైశ్య, మార్వాడీ, గుజరాతీ, యూదు జనులులా ఆర్థికంగా, రాజకీయంగా తాము జనాభా తక్కువైనా ఎదుగే క్రమాన్ని అధ్యయనం చేసి ఆట గెలిచే విధంగా కోచ్ లు ఎదగడం.

అపుడే మన జీవిత కాలంలోనే బీసీ ఎస్సీ ముఖ్య మంత్రులను, అన్ని రంగాల్లో ఎదుగుగలను చూడాలి అని ఒకనాడు కేసీఆర్ అనుకున్న కలను, ఇపుడా కలను కంటున్న నాలాంటి వారి కలను సాకారం చేయడానికి ఈటలను గెలిపించుకొని ఎత్తులకు పై ఎత్తులలో తొలి ఆటలో విజయం సాధించి నిరూపించుకోవలసి ఉంది. అందుకని పేరు గొప్ప ఊరు దిబ్బగా మారుతున్న ప్రతి పథకాన్ని సంపూర్ణంగా ఫలవంతం చేసే చైతన్యం పెంచుకొని ప్రజలను మేల్కొలుపడం అవసరం. పన్నాగాల్లో, కేసీఆర్ ను మించి ఎదగడమే బహుజనుల కర్తవ్యం. అలా తెలుసుకొని తమకు ఓట్లు పండే విత్తనాలు చల్లి పంట కోసుకునే నేర్పు సాధించడం అవసరం. అపుడు ప్రశాంత్ కిషోర్లు , కేసీఆర్ లు ఓడిపోతారు.

– బి.ఎస్. రాములు
సామాజిక తత్వవేత్త

Comments are closed.

Exit mobile version