తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పేరుతోనే శుభాలను మోసుకొస్తున్న ‘శుభకృత్’నామ సంవత్సరం, ప్రజలకు అన్ని రంగాల్లో శుభాలను చేకూర్చనున్నదని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వ కృషి, దైవకృపతో పుష్కలమైన నీరు, పచ్చని పంటపొలాలతో తెలంగాణ అలరారుతున్నదని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

తెలంగాణ ప్రజలకు ఉగాది నుండే నూతన సంవత్సరం ఆరంభమౌతుందని, తమ వ్యవసాయ పనులను రైతన్నలు ఉగాది నుండే ప్రారంభించుకుంటారని సీఎం అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాగునీరు, వ్యవసాయ రంగాలకు అత్యధికంగా ప్రోత్సాహాన్ని అందిస్తున్నదని తెలిపారు. రైతన్నల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రభుత్వం, దేశంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాత్రమేనని అన్నారు. వ్యవసాయ రంగంలో తెలంగాణ అనతి కాలంలోనే దేశం గర్వించేలా కనీవినీ ఎరుగని అభివృద్ధిని సాధించిందని అన్నారు.

వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం ద్వారా అనుబంధ వృత్తులు బలపడి తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైందన్నారు. వ్యవసాయం బాగుంటెనే సర్వ జనులు సంతోషంగా ఉంటారనే సూక్తిని తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్నదన్నారు. కరోనా వంటి కష్టకాలంలోనూ తెలంగాణ వ్యవసాయ రంగం దేశ జిడిపికి దోహదపడడంలో ముందున్నదన్నారు. తెలంగాణ ఉత్పత్తి సేవా రంగాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవ్వడంలో.. వ్యవసాయ రంగం పరోక్ష పాత్రను పోశిస్తున్నదని సీఎం అన్నారు.

అనతి కాలంలోనే అన్ని రంగాలను పటిష్టపరుచుకున్నామనీ, ‘శుభకృత్ నామ సంవత్సరంలో తెలంగాణ మరింత గొప్పగా అభివృద్ధి సాధించనున్నదని అన్నారు. అభివృద్ధిలో దేశానికి తెలంగాణ దిక్సూచిగా మారిందని సీఎం కేసీఆర్ తెలిపారు.

Comments are closed.

Exit mobile version