తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ ముఖ్య సభలో మాజీ మంత్రి, టీఆర్ఎస్ నాయకుడు తుమ్మల నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీని స్థాపించి 40 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హైదరాబాద్ లో సోమవారం జరిగిన ‘నేను – తెలుగుదేశం’ పుస్తకావిష్కరణ సభకు తుమ్మల నాగేశ్వర్ రావుకు ఆహ్వానం అందింది. ఈమేరకు తుమ్మల ఈ పుస్తకావిష్కరణ సభలో పలు ఆసక్తికర, సంచలన వ్యాఖ్యలు చేయడం విశేషం.

తనలాంటి సామాన్యులకు రాజకీయ అవకాశాలు కల్పించిన ఎన్టీ రామారావు మహాపురుషుడు, యుగపురుషుడు, కలియుగ దైవమని తుమ్మల కొనియాడారు. ఎన్టీఆర్ అంశాన్ని ప్రస్తావించకుండా తెలుగుదేశాన్ని, 40 వసంతాల రాజకీయ చరిత్రను, రాష్ట్ర, దేశ రాజకీయాలను వేరుగా చూడలేమన్నారు. ఎన్టీ రామారావు ఇచ్చిన స్ఫూర్తి, అవకాశాల వల్లే తనలాంటి సామాన్యులు అసెంబ్లీలో, పార్లమెంటులో ఉండే ఛాన్స్ లభించిందని, ఇందుకు చంద్రబాబు ప్రోత్సాహమే కారణమన్నారు.

‘నేను – తెలుగుదేశం పుస్తకావిష్కరణ సభలో తుమ్మల, చంద్రబాబుల అభివాదం

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తాను తెలిసో, తెలియకో రాజ్యసభ అభ్యర్థి ఎంపిక అంశంలో తన అభిప్రాయం చెప్పానని గుర్తు చేశారు. అప్పటి కేబినెట్ లో గల తనను, మండవ వెంకటేశ్వరరావును చంద్రబాబు పిలిచి అభిప్రాయం అడిగారని, బాబుగారు ఇద్దరి పేర్లను రాజ్యసభకు ప్రస్తావించారని, అందులో ఒక పేరు కంభంపాటి రామ్మోహన్ కాగా, మరో పేరు ప్రస్తుత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణదిగా తుమ్మల గుర్తు చేశారు. రమణ గారు లీగల్ సైడ్ ఉన్నారు కాబట్టి, ఆయనకు మనం ఏదైనా అవకాశం ఇవ్వొచ్చు, పార్టీ కార్యకర్తగా ఉన్నాడు కాబట్టి, పార్టీవోడికి ఇచ్చినట్లు ఉంటుందని, రామ్మోహన్ కు ఇవ్వాలని తాను ప్రతిపాదించినట్లు చెప్పారు.

అయితే రేపు మళ్లీ నీతో మాట్లాడుతానని చంద్రబాబు చెప్పారని, దానివల్ల ఈనాడు ఒక తెలుగు ప్రముఖున్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేసేటువంటి నిర్ణయం ముఖ్యమంత్రిగారి వల్లనే రమణగారికి దక్కిందన్నారు. సామాన్య కార్యకర్తగా ఉన్న కంభంపాటి రామ్మోహన్ జాతీయ రాజకీయాల్లో ప్రముఖునిగా ఉండే అవకాశం లభించిందని గుర్తు చేశారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీతో గల అనుబంధాన్ని, అనుభవాలను తుమ్మల గుర్తు చేసుకుని ప్రసంగించిన తీరు చర్చనీయాంశంగా మారింది. తుమ్మల ఇంకా ఏమన్నారో దిగువన గల వీడియో లింక్ లో వీక్షించవచ్చు.

Comments are closed.

Exit mobile version