‘‘పంది మాంసం తిన్నావనుకో… పంది ఆలోచనలే వస్తాయి. మనిషి ఆలోచనలు రావు. మేక మాంసం తింటే అదే బుద్ధి పుడుతుంది. అలా ఒకటి పోతుంటే దాని వెనకబడి పోవడమే వస్తుంది. సొంత బుర్ర పనిచేయదు. కోడిగుడ్డు తింటే కోడి బుద్ధే వస్తుంది. ఈ పెంట మీద… ఆ పెంట మీద ఏరుకుతినడమే వస్తుంది’’ త్రిదండి చినజీయర్ స్వామి తన ప్రవచనాల సందర్భంగా చేసిన వివాదాస్పద వ్యాఖ్యల్లో ఇవీ కొన్ని. ఇప్పుడీ వ్యాఖ్యలను మేడారం సమ్మక్క, సారలమ్మ దేవతల భక్తులు ఆయనకు గుర్తు చేస్తున్నారు. ఇంతకీ చిన్న జీయర్ స్వామి తన ఉదరపోషణకు రోజువారీ తీసుకుంటున్న ఆహారమేమిటని సమ్మక్క భక్తులు సూటిగానే నిలదీస్తూ ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే…?

కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన మేడారం వనదేవదతలపై చిన్న జీయర్ నోరుపారేసుకోవడమే ఇందుకు కారణంగా ప్రస్తావిస్తున్నారు. సమ్మక్క, సారలమ్మ దేవతల గురించి చిన్న జీయర్ గతంలో చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చి తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. పెద్ద వివాదానికి దారి తీసే సూచనలు కనిపిస్తున్నాయి. చిన జీయర్ వ్యాఖ్యలపై తెలంగాణా వ్యాప్తంగా సమ్మక్క భక్తులు భగ్గుమంటున్నారు. ఇంతకీ సమ్మక్క, సారలమ్మ దేవతలపై చిన జీయర్ నోరు పారేసుకుని ఏం మాట్లాడారంటే…?

‘అసలు సారక్క, సమ్మక్క ఎవరు? పోనీ… దేవతలా? బ్రహ్మలోకం నుంచి దిగొచ్చినవారా? ఏమిటీ చరిత్ర? అదేదో ఒక అడవి దేవత. ఏదో గ్రామ దేవత. చదువుకున్నవాళ్లు… పెద్ద పెద్ద వ్యాపారస్తులు, ఆ పేర్లతో బ్యాంకులు పెట్టేశారు. దట్ బికేమ్ ఏ బిజినెస్ నౌ (అది ఇప్పుడో వ్యాపారమై పోయంది)’’ ఇవీ చిన జీయర్ నోటి నుంచి వెలువడిన వ్యాఖ్యలు. జీయర్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో సమ్మక్క భక్తులే కాదు, నెటిజన్లు సైతం జీయర్ నోటి దూలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు జీయర్ ను బండబూతులతో చెడుగుడు ఆడుకుంటున్నారు.

ఇదిలా ఉంటే జీయర్ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా సమ్మక్క భక్తులు మండిపడుతున్నారు. ఆదివాసీ సంఘాలు నిరసనకు దిగాయి. ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో గిరిజనులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మేడారంలో పూజారుల సంఘం నాయకులు జీయర్ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసి దహనం చేశారు. జీయర్ పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల చట్టం కింద కేసు నమోదు చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకు సంబంధించి దుమ్మగూడెం ఆదివాసీ సంక్షేమ పరిషత్ నాయకులు ఫిర్యాదు కూడా చేశారు. వనదేవతలకు, ఆదివాసీలకు జీయర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇంకోవైపు జీయర్ నోటి దురద తీరుపై వివిధ రాజకీయ పక్ష నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీపీఐ సీనియర్ నేత నారాయణ, బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ తదితరులు జీయర్ వైఖరిని తూర్పారబట్టారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క జీయర్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఉచిత దర్శనం కల్పించే మేడారంలో వ్యాపారం జరుగుతోందా? రూ. 150 టికెట్ పెట్టి సమాతామూర్తిని దర్శనం చేసుకోవాలనే నిబంధన వ్యాపారమా? ఆంధ్రా చిన్న జీయర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సీతక్క ట్విట్టర్ ద్వారా జీయర్ తీరును ప్రశ్నించారు. ఆయా ట్వీట్ ను దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version