ఒక కేసీఆర్…భిన్న ప్రకటనలు. చెప్పేదానికి, చేసేదానికి అనేకసార్లు పొంతన ఉండదు. ఆర్టీసీ సమ్మె విషయంలోనూ కేసీఆర్ అనుసరించిన వైఖరి ఇదే అంశాన్ని స్పష్టం చేస్తోంది. తెలంగాణా సాధించే అంశంలో రాజకీయ ప్రత్యర్థులనే కాదు, తాజాగా ఆర్టీసీ ఉద్యోగులకు తన దారిలో పయనింపజేయడంలో కేసీఆర్ వ్యూహం సూపర్ సక్సెస్. ముగిసిన అర్టీసీ సమ్మె నేపథ్యంలో డిపోకు ఐదుగురు ఉద్యోగుల చొప్పున 485 మందితో కలసి భోజనం. ఇక ఆర్టీసీకి సంబంధించి సర్వ భారం సర్కారుదేననే భరోసా. వరాల వర్షం. ఆర్టీసీ ఉద్యోగులు ఫుల్ హ్యాపీ. ఆర్టీసీ విషయంలో కేసీఆర్ లో ఎందుకీ అనూహ్య మార్పు? రాజకీయ వర్గాల్లోనే కాదు, ఆర్టీసీ ఉద్యోగుల్లోనూ ఒకటే చర్చ. ఈ మార్పు ఎందుకో తెలుసుకునే ముందు ఆర్టీసీ సమ్మె కాలంలో వేర్వేరు సందర్భాల్లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఓసారి మననం చేసుకుంటూ చదవండి.

‘ఆర్టీసీ సమ్మె ముగియడం కాదు, ఆర్టీసీనే ముగుస్తున్నది. యస్…దిస్ ఈజ్ ఫ్యాక్ట్. ఆర్టీసీ కార్మికులది పిచ్చి పంథా. దురహంకార పద్ధతి. ఆర్టీసీ పని ముగిసింది. ఇట్స్ గాన్ కేస్.

‘ఆర్టీసీ కార్మికులు కూడా మా బిడ్డలే. వారి పొట్ట కొట్టే ఉద్ధేశం మాకు లేదు. మరో అవకాశం ఇస్తున్నా…బేషరతుగా మూడు రోజుల్లోగా విధుల్లో చేరండి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అవకాశమే లేదు. తెలంగాణాలోని 5,100 రూట్లలో ప్రయివేట్ బస్సులకు పర్మిట్లు ఇస్తున్నాం.’

ప్రస్తుతం ఆర్టీసీలో మొత్తం 10,400 బస్సులు ఉండగా, వాటిలో 8,300 బస్సులు ఆర్టీసీ బస్సులు, 2,100 అద్దె బస్సులు ఉన్నాయి  ఆర్టీసీ బస్సుల్లో 2,300 మూలకు పడ్డాయి. మరికొన్ని వందల బస్సులు కూడా మూలకు పడే దశకు చేరుకున్నాయి.

’ఆర్టీసీ సమ్మె చట్ట విరుద్ధం. సచ్చిపోయిన కార్మికుల విషయంలో యూనియన్లు బాధ్యత వహించాలి. ఇంగితం, అర్థం లేకుండా, అహంకార పూరితంగా సమ్మెకు వెళ్లారు.’

‘ఆర్టీసీ దివాళా తీసిందని ఎవరు చెప్పిండ్లు? నేను చెప్పలేదు. ఆర్టీసీ, ప్రయివేట్ సంస్థలు ఐదు వేల చొప్పున బస్సులు నడుపుతయ్’

‘మంచి ప్రభుత్వం కాబట్టి ఇంకో అవకాశం ఇస్తున్నం. ఇది అక్రమ సమ్మె అని లేబర్ డిపార్ట్ మెంట్ ప్రకటిస్తే పరిస్థితి వేరుగా ఉంటది. ఉద్యోగితో సంబంధమే ఉండదు. జీహెచ్ఎంసీ రూపాయి ఇవ్వాల్సిన అవసరం లేదు. ఏమైతది…? మధ్యప్రదేశ్ లాగ అయితది. ఆర్టీసీ రహిత రాష్ట్రంగా తెలంగాణ అయితది.’ నవంబర్ 5వ తేదీలోపు విధుల్లోకి రాకపోతే, మిగతా 5 వేల రూట్లు కూడా ప్రయివేట్ కు అప్పగిస్తాం.

ఇది రూ. 47 కోట్ల చెల్లింపులతో తీరే సమస్య కాదు. గత ఆగస్టు నాటికి ఆర్టీసీ నష్టాల మొత్తం రూ. 5,269.25 కోట్లకు చేరింది. హైకోర్టు సూచనలను పాటిస్తే రూ. 2,209.00 కోట్ల మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. (హైకోర్టులో సమర్పించిన ఆపిడవిట్ సారాంశం)

ఆర్టీసీ ఉద్యోగులతో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నిర్ణయాలు ఇవీ :
1. ఆర్టీసీలో కండక్టర్లు, డ్రైవర్లను కార్మికులు అని పిలిచే పద్ధతికి స్వస్తి. అందరినీ ఉద్యోగులు అనే పిలవాలి. యాజమాన్యం, ఉద్యోగులు వేర్వేరు కారు. అందరూ ఒకటే, ఒకటే కుటుంబం లాగా వ్యవహరించాలి.
2. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన సెప్టెంబర్ నెల జీతాన్ని సోమవారం (డిసెంబర్ 2న) చెల్లిస్తాం.
3. ఉద్యోగులు సమ్మె చేసిన 55 రోజులకు కూడా వేతనం చెల్లిస్తాం.
4. ఉద్యోగులు ఇంక్రిమెంట్ యధావిధిగా ఇస్తాం.
5. సమ్మె కాలంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లో ఉద్యోగం ఇవ్వాలి. ప్రతీ కుటుంబానికి ప్రభుత్వం తరుఫున రెండు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లిస్తాం.
6. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి బడ్జెట్లో ఆర్టీసీకి వెయ్యి కోట్లు కేటాయిస్తాం.
7. ఆర్టీసీ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 58 నుంచి 60 సంవత్సరాలకు పెంచుతాం.
8. ఆర్టీసీ ఉద్యోగులకు సంపూర్ణ ఉద్యోగ భద్రత ఉంటుంది.
9. సంపూర్ణ టికెట్ బాధ్యత ప్రయాణీకుడిపైనే ఉంటుంది. ఆ కారణంతో కండక్టర్లపై చర్యలు తీసుకోము.
10. కలర్ బ్లైండ్ నెస్ ఉన్న వారిని వేరే విధుల్లో చేర్చుకోవాలి తప్ప, ఉద్యోగం నుంచి తొలగించవద్దు.
11. మహిళా ఉద్యోగులకు నైట్ డ్యూటీలు వేయవద్దు. రాత్రి 8 గంటలకు వారు డ్యూటీ దిగేలా ఏర్పాట్లు చేయాలి
12. ప్రతీ డిపోలో కేవలం 20 రోజుల్లో మహిళల కోసం ప్రత్యేక టాయిలెట్లు, డ్రెస్ చేంజ్ రూమ్స్, లంచ్ రూమ్స్ ఏర్పాటు చేయాలి.
13. మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులతో పాటు, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా మూడు నెలల పాటు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేస్తాం.
14. మహిళా ఉద్యోగుల ఖాకీ డ్రెస్ తొలగిస్తాం. వారికి ఇష్టమైన రంగులో యూనిఫామ్ వేసుకునే వెసులుబాటు కల్పిస్తాం. పురుష ఉద్యోగులు కూడా ఖాకీ డ్రస్సు వద్దంటే వారికీ వేరే రంగు యూనిఫామ్ వేసుకునే అవకాశం కల్పిస్తాం.
15. మహిళా ఉద్యోగుల సమస్యలు పరిష్కరించడానికి తగు సూచనలు చేయడం కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తాం.
16. రెండేళ్ల పాటు ఆర్టీసీలో గుర్తింపు యూనియన్ ఎన్నికలు నిర్వహించేది లేదు.
17. ప్రతీ డిపోలో ఇద్దరు చొప్పున కార్మికులు సభ్యులుగా కార్మిక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తాం.
18. ఉద్యోగుల తల్లిదండ్రులకు కూడా వర్తించేలా ఆర్టీసీలో హెల్త్ సర్వీసులు అందించాలి. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా అవసరమైతే ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్య సేవలు అందుకునేలా చర్యలు తీసుకోవాలి.
19. ప్రతీ డిస్పెన్సరీలో ఉద్యోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేయాలి. మందుల కోసం బయటకు తిప్పవద్దు.
20. ఆర్టీసీ ఉద్యోగుల తల్లిదండ్రులకు ఉచిత బస్సు పాసులు అందించాలి.
21. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకు ఫీజు రీ ఎంబర్స్ మెంటు సౌకర్యం వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది.
22. ఉద్యోగుల పిఎఫ్ బకాయిలను, సిసిఎస్ కు చెల్లించాల్సిన డబ్బులను చెల్లిస్తాం.
23. డిపోల్లో కావాల్సిన స్పేర్ పార్ట్స్ ను సంపూర్ణంగా అందుబాటులో ఉంచుతాం.
24. ఆర్టీసీలో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులను వెంటనే పర్మినెంట్ చేస్తాం.
25. ఆర్టీసీ కార్మికుల గృహ నిర్మాణ పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తుంది.
26. ఆర్టీసీలో పార్సిల్ సర్వీసులను ప్రారంభించాలి. ఆర్టీసీకి నేనే బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తా.

అంతేకాదు…ఆర్టీసీలో ఏ ఒక్క ఉద్యోగినీ తీసేయకుండా ఉద్యోగ భద్రత కల్పిస్తామని, ఒక్క రూట్లో కూడా ప్రయివేట్ బస్సుకు అనుమతి ఇవ్వబోమని ప్రకటించారు.

ఆర్టీసీ సమ్మెకు సంబంధించి కేసీఆర్ వ్యవహరించిన ఆయా తీరుపై భిన్నాభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ సమ్మె విషయంలో అనుసరించిన వైఖరి వల్ల పార్టీకి తీవ్ర నష్టం జరిగినట్లు నిఘా వర్గాల నుంచి నివేదికలు వెళ్లాయని, అందువల్లే నష్టనివారణ చర్యలు ప్రారంభించారనే వాదనలు వినిపిస్తున్నాయి. అంతేగాక మున్సిపల్ ఎన్నికలు ముందున్నాయని, ఆర్టీసీ సమ్మె పరిణామాలు తీవ్ర నష్టం కలిగించే అవకాశం లేకపోలేదని నిఘా వర్గాల నివేదికల సారాంశంగా పలువురు పేర్కొంటున్నారు. పొంచి ఉన్న ఉపద్రవాన్ని పసిగట్టడం వల్లే ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో కేసీఆర్ లో మార్పునకు అసలు కారణంగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఇదే దశలో తాను పైచేయి సాధించి కార్మికుల చేత చప్పట్లు కొట్టించుకోవడమే కేసీఆర్ రాజకీయ చతురతగా పలువురు అభివర్ణిస్తున్నారు. విషయాన్ని దారి మళ్లించి, అందరినీ తన దారిలోకి తెచ్చుకోవడమే కేసీర్ స్మార్ట్ వ్యూహంగా పేర్కొంటున్నారు.

Comments are closed.

Exit mobile version