తెలంగాణా సీఎం కేసీఆర్ ఎర్రవల్లిలోని తన ఫాంహౌజ్ లో మంత్రులతో అత్యవసరంగా భేటీ అయ్యారు. పాలనాపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ భేటీలో మంత్రులతో పాటు సీఎస్ సోమేశ్ కుమార్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. నియామకాలు, వ్యవసాయం, ఇతర అంశాలపై కేసీఆర్ మంత్రులతో చర్చిస్తున్నారు.
ఇటీవలే అసెంబ్లీ సమావేశాల్లో ఉద్యోగ నోటిఫికేషన్ల గురించి ప్రకటించిన కేసీఆర్ ఏ శాఖలో ఎన్ని ఖాళీలున్నాయి? నోటిఫికేషన్‌కు ఎంత సమయం పడుతుంది? పరీక్షా తేదీలు వంటి కీలక విషయాల గురించి ఆ శాఖల మంత్రులు, అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. మరోవైపు జీవో 111 రద్దు గురించి కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం.
ఇటీవల స్వల్ప అస్వస్థతకు గురైన ముఖ్యమంత్రి కేసీఆర్‌ను వారం రోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. డాక్టర్ల సలహా మేరకు వారం పాటు పూర్తి విశ్రాంతి తీసుకున్న కేసీఆర్.. తిరిగి అధికారిక కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ మంత్రులతో ఎర్రవల్లిలోని ఫాంహౌస్‌లోనే సమావేశమయ్యారు.
కాగా ఎన్నడూలేని విధంగా తన ఫాం హౌజ్ లో సీఎం మంత్రులతో అత్యవసరంగా సమావేశం కావడంపై రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. మంత్రివర్గ విస్తరణ జరుగుతుందా? లేక ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో ఏదేని కీలక నిర్ణయం తీసుకుంటారా? తన తనయుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు పట్టాభిషేకం విషయంలో ఏదేని కీలక నిర్ణయం తీసుకుంటారా? వంటి అనేక ప్రశ్నలకు సంబంధించి భిన్న రకాల ఊహాగానాలతో చర్చ జరుగుతుండడం గమనార్హం.