రాష్ట్రంలోని ఐదు చోట్ల ‘తెలంగాణా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (టిమ్స్) ఆసుపత్రులను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కొత్తగా ఏర్పాటు చేయబోయే ఆయా 5 సూపర్ స్పెషాలిటీ దవాఖానాల సత్వర నిర్మాణానికై చర్యలు తీసుకోవాలని, త్వరలోనే శంకుస్థాపన చేయాలని రాష్ట్ర మంత్రివర్గం ఆదేశించింది. వరంగల్, హైదరాబాద్ చెస్ట్ హాస్పిటల్ ప్రాంగణం, గచ్చిబౌలి టిమ్స్, ఎల్బీనగర్ గడ్డి అన్నారం, అల్వాల్ ప్రాంతాల్లో ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పటల్స్ నిర్మాణం చేపట్టాలని కేబినెట్ ఆదేశించింది. పటాన్ చెరువులో కార్మికులు ఇతర ప్రజల అవసరాల కోసం కొత్తగా ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ ను కూడా కేబినెట్ మంజూరు చేసింది. ఇకనుంచి అన్ని సూపర్ స్పెషాలిటీ దవాఖానాలకు ‘తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’ (TIMS) గా నామకరణం చేసి, అన్నిరకాల సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను ఒక్క చోటనే అందించే ‘సమీకృత వైద్య కళాశాలలు’గా తీర్చిదిద్దాలని, సత్వరమే వైద్యసేవలను ప్రారంభించాలని కేబినెట్ ఆదేశించింది.

ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో ఆదివారం కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని అనాథలు, అనాథ శరణాలయాల స్థితిగతులు, సమస్యలు, అవగాహన విధాన రూపకల్పన కోసం, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేశారు. సబ్ కమిటీలో సభ్యులుగా మంత్రులు, హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ఇంద్రకరణ్ రెడ్డి, జగదీశ్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, కేటీఆర్ ఉంటారు.

కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి, అనాథలైన పిల్లల సమగ్ర సమాచారం అన్ని జిల్లాల కలెక్టర్ల నుంచి తెప్పించాలని వైద్యశాఖ కార్యదర్శిని కేబినెట్ ఆదేశించింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా పరిస్థితిపై కేబినెట్ చర్చించింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా పరిస్థితులు, వాక్సినేషన్, దవాఖానాల్లో ముందస్తు ఏర్పాట్లు, మౌలిక వసతులపై కేబినెట్ సమగ్రంగా చర్చించింది. వైద్యాధికారులు రాష్ట్రంలోని వివిధ జిల్లాల ప్రాథమిక వైద్య కేంద్రాల స్థాయి నుంచి కేబినెట్ కు సవివరంగా సమాచారం అందించారు. రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండడంపై కూడా కేబినెట్ లో చర్చ జరిగింది. ఈ జిల్లాల్లో కరోనా వ్యాప్తి నిరోధానికి, నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు, ఆక్సిజన్, మందులు, బెడ్స్, ఔషదాల లభ్యతపై కేబినెట్ విస్తృతంగా చర్చించింది. అన్ని జిల్లాల్లో విస్తృతంగా కరోనా పరీక్షలు నిర్వహించి, వ్యాక్సినేషన్ ను వేగవంతం చేయాలని, అన్నిరకాల మందులు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని వైద్యాధికారులను కేబినెట్ ఆదేశించింది.

రాష్ట్రంలో నూతనంగా మంజూరు చేసిన 7 మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించేందుకు తీసుకోవాల్సిన చర్యలు, అందుకోసం అవసరమైన మౌలిక వసతుల కల్పన పై కేబినెట్ లో చర్చ జరిగింది. మెడికల్ కాలేజీల ప్రారంభానికి కావలసిన నిర్మాణాలను సత్వరమే చేపట్టాలని, వసతులను ఏర్పాటు చేయాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీలను వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించడానికి సమకూర్చుకోవాల్సిన బెడ్లు, తదితర మౌలిక వసతులు సహా, కాలేజీలు, హాస్టళ్ల నిర్మాణానికై తీసుకోవాల్సిన చర్యల గురించి కేబినెట్ చర్చించింది.

రాష్ట్రంలో, భవిష్యత్తులో అనుమతించబోయే మెడికల్ కాలేజీల కొరకు స్థలాన్వేషణ, తదితర సౌకర్యాల రూపకల్పనకు సంబంధించి ముందస్తు చర్యలను ఇప్పటినుంచే ప్రారంభించాలని వైద్యాధికారులను కేబినెట్ ఆదేశించింది. అవసరమున్న జిల్లాల్లో వచ్చే ఏడాదికి మెడికల్ కాలేజీల ఏర్పాట్ల కోసం చర్యలు ప్రారంభించాలని అందుకు సంబంధించిన ప్రణాళికలు సిద్దం చేయాలని కేబినెట్ ఆదేశించింది.

కేంద్రం ప్రవేశపెట్టిన EWS (ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్) రిజర్వేషన్ కోటాకు, విద్యా ఉద్యోగ అవకాశాలలో రూ. 8 లక్షల లోపు ఆదాయం ఉన్న అభ్యర్థులు అర్హులని కేబినెట్ తీర్మానించింది. EWS కోటా కింద రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఉద్యోగ నియామకాల్లో గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఇవ్వాలని నిర్ణయించింది.

Comments are closed.

Exit mobile version