‘శకునం చెప్పే బల్లి కుడితో పడినట్లు…’ అనే సామెత తెలిసిందే. తనదైన శైలి వార్తలతో ఎనలేని పాపులారిటీని సముపార్జించుకున్న తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ తీవ్ర చిక్కుల్లో ఇరుక్కున్నారా? ఇదీ తాజా సందేహం. తీన్మార్ మల్లన్న వార్తల శైలి, వివాదాస్పద అంశాలు, కేసుల నమోదు వంటి విషయాల ప్రస్తావన కానే కాదిది. తీన్మార్ మల్లన్న ఎడిటర్ గా ప్రచురిస్తున్న ‘శనార్తి తెలంగాణా’ డిజిటల్ ఎడిషన్ లేదా ఈ-పేపర్ ను బేసిక్ ఫార్ములాను మర్చిపోయి ఆయన ప్రచురిస్తున్నారా? ఇదే జరిగితే మల్లన్నపై భారీ ఎత్తున క్రిమినల్ కేసులు నమోదయ్యే అవకాశాలు లేకపోలేదు. అసలు విషయంలోకి వెడితే…

వార్తా పత్రికల ప్రచురణకు సంబంధించి పీఆర్ పీ (ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్) యాక్టు ప్రకారం నిబంధనలు ఉన్నాయి. ఏదేని దిన, వార, పక్ష, మాస, త్రైమాసిక వంటి పత్రికల ప్రచురణకు ‘టైటిట్’ రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఇందుకు దరఖాస్తు, దరఖాస్తుదారుని చరిత్ర గురించి పోలీసు వెరిఫికేషన్, ఆర్డీవో అనుమతి తదితర ప్రక్రియ ఉంటుంది. ఈ ప్రక్రియ తర్వాత ఆర్ఎన్ఐ (రిజిస్ట్రార్ ఆఫ్ న్యూస్ పేపర్స్ ఫర్ ఇండియా) టైటిల్ కు అనుమతి ఇస్తూ తొలుత టీఆర్ (టెంపరరీ రిజిస్ట్రేషన్) నెంబర్ ను కేటాయిస్తుంది. ఆ తర్వాత నిబంధనల ప్రకారం పూర్తి స్థాయి ఆర్ఎన్ఐ నెంబర్ ను కేటాయిస్తుంది.

ఇటువంటి ప్రక్రియలో కనీసం టీఆర్ ఆర్ఎన్ఐ నెంబర్ లేకుండా ఎటువంటి ప్రచురణ జరపరాదని పీఆర్ బీ యాక్టు 1867 చెబుతోంది. దీని ప్రకారం ప్రచురణకర్తలు తాము ప్రచురించే ఏ పత్రికలోనైనా ఎక్కడో ఓచోట ‘ఇంప్రింట్’గా పూర్తి వివరాలు నిత్యం ప్రచురించాల్సి ఉంటుంది. పబ్లిషర్, ఇంటి, ఫోన్ నెంబర్లు సహా దాని ప్రచురణ స్థలం, ఎడిటర్ వంటి వివరాలు పొందుపరుస్తూ ‘ఇంప్రింట్’లో ప్రచురించాల్సి ఉంటుంది. ఈ విషయంలో ప్రచురణకర్తలు భిన్నరకాలుగా వ్యవహరిస్తుంటారు. కొందరు లోపలి పేజీల్లో, మరికొందరు బ్యాక్ పేజీలో చివరన ప్రచురిస్తుంటారు. ఇంకొందరు కేవలం ఆర్ఎన్ఐ నెంబర్ ను ఫస్ట్ పేజీలోనే ప్రచురిస్తుంటారు. ప్రింట్ పత్రికలకైనా, డిజిటల్ ఎడిషన్లుగా వ్యవహరిస్తున్న ఈ-పేపర్ ప్రచురణకైనా ఈ విధానం తప్పనిసరిగా ఆర్ఎన్ఐ నిష్ణాతులు స్పష్టం చేస్తున్నారు.

అయితే తీన్మార్ మల్లన్న ఎడిటర్ గా ప్రచురితమవుతున్న ‘శనార్తి తెలంగాణా’ పత్రికలో ఇటువంటి వివరాలేవీ లేకపోవడం గమనార్హం. నాలుగు పేజీలతో, కాంప్లిమెంటరీ కాపీ పేరుతో తొమ్మిది నెలలుగా, ఇప్పటి వరకు 271 సంచికలుగా ప్రచురితమైన ఈ పత్రికలో ఆర్ఎన్ఐ నెంబర్ గాని, ప్రింటర్, పబ్లిషర్ వివరాలుగాని ‘ఇంప్రింట్’గా ఎక్కడా కనిపించకపోవడం చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో ‘శనార్తి తెలంగాణా’ అనే టైటిల్ ఆర్ఎన్ఐ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ అయ్యిందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ రిజిస్ట్రేషన్ జరిగి ఉంటే, ఆర్ఎన్ఐ నెంబర్ ఉంటే దాని వివరాలు ప్రచురించకుండా రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటి? అనే ప్రశ్న కూడా ఉద్భవిస్తోంది.

అయితే మరో వ్యక్తి పేరు మీద ‘శనార్తి తెలంగాణా’ టైటిల్ ఉందని, అతని నుంచే తీన్మార్ మల్లన్న దీన్ని టేకోవర్ చేశారని వాడుకలో గల ప్రచారం ధ్రువపడాల్సి ఉంది. ఒకవేళ ఇతరుల నుంచి టైటిల్ ను టేకోవర్ చేసినప్పటికీ, టైటిల్ ఎవరి పేరు మీద ఉన్నా, ఓనర్ వివరాలతో ‘ఇంప్రింట్’లో ప్రచురించాలనే బేసిక్ ఫార్ములాను మల్లన్న మర్చిపోయారా? ఉద్ధేశపూర్వకంగానే వివరాలు ప్రచురించకుండా ఉన్నారా? అనేవి కూడా ప్రశ్నలే. ఆర్ఎన్ఐ నెంబర్ లేకుండా పత్రిక ప్రచురించడం కూడా నేరమేనని పీఆర్ బీ యాక్టు 1867 చెబుతోంది. ఈ పరిణామాల్లో ‘శనార్తి తెలంగాణా’ ఎడిటర్ గా తనదైన శైలి వార్తలు ప్రచురిస్తున్న తీన్మార్ మల్లన్న తీవ్ర చిక్కుల్లో పడినట్లుగానే జర్నలిస్టు సర్కిళ్లు భావిస్తున్నాయి.

Comments are closed.

Exit mobile version