ఈనెల 14వ తేదీన జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ అనంతరం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన గ్రాఫిక్ పోస్ట్ ఇది. సీఎన్ఎన్-ఐబీఎన్, ఇండియాటుడే, టైమ్స్ నౌ, ఎన్డీటీవీ వంటి జాతీయ ఛానెళ్లు నిర్వహించినట్లు పేర్కొన్న సర్వేలో చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు ఆధిక్యత ఉన్నట్లు ఈ ఇమేజ్ వెల్లడిస్తోంది. వాస్తవ పరిస్థితుల్లో ఆయా సంస్థలు సర్వే నిర్వహించాయా? లేదా? అనేది అసలు ప్రశ్న కానే కాదు. కానీ నిన్న ప్రారంభమైన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల ట్రెండ్ కూడా ఇదే అంశానికి చేరువలో ఉందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు వెల్లడైన ఫలితాల్లో తీన్మార్ మల్లన్న కైవసం చేసుకున్న ఓట్ల సంఖ్య రాజకీయ పరిశీలకులను నివ్వెరపరిచిందనే చెప్పాలి. స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన తీన్మార్ మల్లన్న టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డికి సమీప ప్రత్యర్థిగా నిలవడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది.

వరంగల్, ఖమ్మం, నల్లగొండ స్థానానికి తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు మొదటి రౌండ్ ఫలితాల నుంచి కూడా తీన్మార్ మల్లన్నగా ప్రాచుర్యం పొందిన చింతపండు నవీన్ ‘పల్లా’కు చేరువలోనే కొనసాగుతున్నారు. తొలిరౌండ్ లో మొత్తం 56,003 ఓట్లను లెక్కించగా, అందులో 3,151 ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. మిగతా ఓట్లలో 16,130 ఓట్లను సాధించి టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి మొదటి స్థానంలో నిలవగా, 12,046 ఓట్లతో స్వతంత్ర అభ్యర్థి తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. 9,080 ఓట్లతో టీజేఎస్ అభ్యర్థి ప్రొఫెసర్ కోదండరామ్, 6,615 ఓట్లతో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, 4,354 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రాములు నాయక్, 1,123 ఓట్లతో రాణీ రుద్రమ, 1,077 ఓట్లతో చెరుకు సుధాకర్, 1,008 ఓట్లతో సీపీఐ అభ్యర్థి విజయసారథిరెడ్డిలు నిలిచారు. అదేవిధంగా రెండో రౌండ్ లోనూ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి 15,857, లభించగా, తీన్మార్ మల్లన్నకు 12,070 , కోదండరామ్ కు 9,448, ప్రేమేందర్ రెడ్డికి 6,669, రాములు నాయక్ కు 3,244 ఓట్ల చొప్పున లభించాయి. మూడో రౌండ్ ఫలితాల్లో పల్లా రాజేశ్వర్ రెడ్డికి 15,558 ఓట్లు, తీన్మార్ మల్లన్నకు 11,742 ఓట్లు, కోదండరాంకు11,039 ఓట్లు, బీజేపీ ప్రేమేందర్ రెడ్డికి 5,320 ఓట్లు, కాంగ్రెస్ రాములు నాయక్ కు 4,333 ఓట్లు లభించగా, 3,092 ఓట్లు చెల్లనివిగా తేల్చారు. మొత్తం మూడు రౌండ్లలో కలిపి పల్లా రాజేశ్వర్ రెడ్డి 47,545 ఓట్లు, తీన్మార్ మల్లన్న 35, 858 ఓట్లు, కోదండరాం 29, 567 ఓట్లను కైవసం చేసుకున్నారు. మొత్తంగా తన సమీప ప్రత్యర్థి తీన్మార్ మల్లన్నపై పల్లా రాజేశ్వర్ రెడ్డి 11,687 ఓట్ల ఆధికత్యను కలిగి ఉన్నారు.

ఆయా ఫలితాల సరళిని పరిశీలించినపుడు ‘పల్లా’ తొలి ప్రాధాన్యత ఓటు ద్వారా గెలుపొందే అవకాశాలపై ఆశలు సన్నగిల్లుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తమ అంచనా ప్రకారం మొదటి ప్రాధాన్యత ఓటు ద్వాారానే పల్లా విజయం సాధించాలని, లేని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు అనివార్యమైతే, పరిణామాలు ఎటు దారితీస్తాయనే అంశంపై టీఆర్ఎస్ శ్రేణులు భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కించాల్సి వస్తే, మూడో స్థానంలో గల కోదండరాం స్థితి తీన్మార్ మల్లన్నకు ఉపకరిస్తుందంటున్నారు. ఇదే జరిగితే అంతిమ ఫలితం అంచనాపై రకరకాల వాదనలు వినిపిస్తుండడమే అసలు విశేషం. మొత్తంగా అంచనాలకు విరుద్ధంగా దూసుకువచ్చి అధికార పార్టీ అభ్యర్థి ‘పల్లా’కు సమీప ప్రత్యర్థిగా నిలిచిన తీన్మార్ మల్లన్నకు లభించే రెండో ప్రాధాన్యత ఓట్లపై గులాబీ శ్రేణులు గుబులు చెందుతున్నట్లు తెలుస్తోంది. యువ పట్టభద్రులు తీన్మార్ మల్లన్న పట్ల ఆకర్షితులు కావడమే ఇందుకు ప్రధాన కారణంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Comments are closed.

Exit mobile version