‘పిల్లిని కూడా నాలుగు గోడల మధ్య బంధించి కొడితే తిరగబడి ‘బొండిక్కాయ’ (గొంతు) కొరికి చంపేస్తుంది’ అంటుంటారు. తన ప్రాణానికి ముప్పు ఏర్పడిన అనివార్య పరిస్థితుల్లో పిల్లి సైతం పులిలాంటి ‘పంజా’నే విసురుతుందనేది సామెత నిర్వచనం. ఇటువంటి అనూహ్య పరిస్థితుల్లో ఎంతటి బలవంతుడైనా తోక ముడవాల్సిందే. కానీ ఈ ఘటనలో బాధితురాలు పిల్లి కానే కాదు. పులి స్వభావాన్ని పుణికిపుచ్చుకున్న సాహస బాలిక. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు ఆమె చర్యపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
పై ఫొటోలో మీరు చూస్తున్న ఈ బాలిక పేరు ఖమర్ గుల్. వయస్సు సుమారు 14-16 సంవత్సరాలు మాత్రమే. తుపాకీ ధరించిన ఖమర్ గుల్ తీవ్రవాది కాదు, ఉగ్రవాది అంతకన్నా కాదు. ప్రభుత్వ సైన్యంలో పాలు పంచుకుంటున్న దాఖలాలు కూడా లేవు. కానీ ఆమె భద్రతను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం ప్రస్తుతం భుజాన వేసుకుంది. ప్రభుత్వ మిలట్రీ బలగాలు, ఆఫ్ఘనిస్తాన్ సర్కార్ అనుకూల మిలిటెంట్లు ఖమర్ గుల్ ప్రాణరక్షణ కోసం పహరా కాస్తున్నాయి. ఆమెను అత్యంత సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఇంతకీ ఈ బాలిక చేసిన ఘనకార్యమేంటి? అందుకు దారి తీసిన పరిస్థితులేమిటి అంటే…?
ఖమర్ గుల్ తండ్రి ఆఫ్షన్ సర్కారుకు గట్టి మద్ధతుదారుడు. రాక్షసత్వానికి ప్రతీకగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన తాలిబన్ ఉగ్రవాదులు ఊర్కుంటారా మరి? ఖమర్ గుల్ తండ్రిని చంపేందుకు అర్థరాత్రి దాటాక సుమారు ఒంటిగంట సమయంలో రానేవచ్చారు. ఖమర్ గుల్ తల్లి తాలిబన్ ఉగ్రవాదుల రాకను పసిగట్టింది. ఇంటిలోనికి రాకుండా అడ్డుకుంది. కానీ తాలిబన్ టెర్రరిస్టులు ఖమర్ గుల్ తల్లిని కాల్చి చంపి ఇంట్లోకి చొరబడ్డారు. ఆ తర్వాత ఖమర్ తండ్రిని కూడా పొట్టన బెట్టుకున్నారు.
కళ్లముందే కన్న తల్లిదండ్రులను దారుణంగా కాల్చి చంపిన తాలిబన్ల రాక్షస చర్యను ఖమర్ గుల్ తట్టుకోలేకపోయింది. తానేమీ నిస్సహాయురాలుగా, నిశ్ఛేష్టురాలిగా ఉండిపోలేదు. కన్నీళ్లు కార్చలేదు. తన ప్రాణాలను కాపాడుకునేందుకు ఉగ్రవాదుల ముందు మోకరిల్లలేదు. తాలిబన్లతో తాడో, పేడో తేల్చుకునేందుకే సంసిద్దురాలైంది. ధైర్యం చేసింది. ఇంట్లో ఉన్న ఏకే-47 ఆయుధాన్ని చేబూనింది. ట్రిగ్గర్ నొక్కి కాల్పుల వర్షం కురిపించింది. అనూహ్య ఘటనను అంచనా వేయలేని తాలిబన్లలో ముగ్గురు అక్కడికక్కడే నేలకూలారు. ఖమర్ గుల్ ను చంపేందుకు మిగతా తాలిబన్లు విఫలయత్నం చేశారు. దాదాపు గంటసేపు టెర్రరిస్టులతో ఖమర్ గుల్ భీకరంగా తలపడ్డారు. ఆమె తుపాకీ గుళ్ల ధాటికి తట్టుకోలేక అనేక మంది టెర్రరిస్టులు తీవ్రంగా గాయపడ్డారు.
ఇదే దశలో గ్రామస్తులు, సర్కారు అనుకూల మిలిటెంట్లు ఘటనా స్థలికి చేరుకుని ఖమర్ గుల్ కు అండగా నిలబడ్డారు. తాలిబన్లపై తుపాకీ కాల్పులు ప్రారంభించారు. దిక్కుతోచని తాలిబన్ రాక్షస మూకలు కుయ్యో…మొర్రో అంటూ ప్రాణాలను దక్కించుకునే దిశగా తోకముడిచాయి. సంఘటనపై తాలిబన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘని స్పందించారు. ఖమర్ గుల్ సాహసాన్ని ప్రశంసిస్తూ ఆమెకు రక్షణ కల్పించారు. ఆఫ్ఘనిస్తాన్ లోని సెంట్రల్ గర్ ప్రావిన్సన్ ప్రాంతంలోని ఓ గ్రామంలో ఇటీవల జరిగిన ఈ సంఘటన అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రపంచ మీడియాతోపాటు నెటిజన్లు సైతం ఖమర్ గుల్ సాహస చర్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.