అధికార పార్టీ నేతల, పోలీసుల కుమ్ముక్కు ‘బంధం’పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఛత్తీస్ గఢ్ కు చెందిన ఐపీఎస్ అధికారి గుర్జీందర్ సింగ్ పాల్ సస్పెన్షన్, ఏసీబీ కేసు, రాజద్రోహం వంటి అభియోగాలపై దాఖలైన కేసుల విచారణ సందర్భంగా దేశ అత్యున్నత న్యాయ స్థానం మౌఖికంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం విశేషం.
అధికారంలో గల రాజకీయ నేతలు, పోలీసులు కుమ్ముక్కు కావడం దేశంలో కొత్త విధానంగా మారిందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అధికారంలో గల పార్టీతో సన్నిహితంగా మెలగడం, డబ్బులు గుంజుకునే పోలీసు అధికారులు ప్రభుత్వం మారినప్పుడు మూల్యం చెల్లించక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని పేర్కొంది.
ఈ కేసులో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, ప్రతి కేసులో ఇటువంటి అధికారులు రక్షణ పొందలేరని, సర్కార్ తో సన్నిహితంగా ఉన్నారు కాబట్టి డబ్బును గుంజుకోగలిగారని, కానీ ఏదో ఒకరోజు దీన్ని వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఇటువంటి అధికారులను ఎందుకు రక్షించాలని కూడా ఆయన ప్రశ్నించారు.
అధికార పార్టీ పక్షాన వ్యవహరించినపుడు అంతా సవ్యంగానే సాగిపోతుందని, పార్టీ మారినపుడు అదే అధికారిపై కేసులు నమోదవుతాయని, కుమ్ముక్కయ్యే పద్ధతి మారాలని జస్టిస్ ఎన్వీ రమణ హితవు చెప్పారు. పార్టీలతో అంటకాగే అధికారులకు జైలుకు వెళ్లాల్సిందేనని కూడా సీజేఐ వ్యాఖ్యానించారు.