కొందరు అంతే. తమకు మాత్రమే తెలుసనుకుంటారు. తాము చెప్పిందే వేదమని ప్రవచిస్తుంటారు. ప్రపంచంలో తమ మేధావితనం ముందు అందరూ దిగదుడుపేనని స్వీయ అంచనా వేసుకుంటుంటారు. ఎవరినైనా నిందిస్తారు. జరిగేది, ఒరిగేది ఏముందిలే అని నిట్టూరుస్తారు. జరిగాక తాము ఈ ముచ్చట ముందే చెప్పామని ప్లేట్ ఫిరాయిస్తారు. సుప్రీం కోర్టు గతంలో చేసిన అనేక విచారణల వల్ల ఒరిగిందేమిటనేగా? జస్టిస్ సిర్పుకర్ కమిషన్ ఏర్పాటు నేపథ్యంలో కొందరు జర్నలిస్టుల తాజా వాదన? ఏం జరుగుతుందో, జరగదో అనే విషయాలను తేల్చడానికి జర్నలిస్టులేమీ తీర్పరులు కాదు. ఉన్నది ఉన్నట్లు నివేదించడమే జర్నలిస్టు విధి. ఇంకాస్త అర్థమయ్యేట్టు లోతుగా విశ్లేషించడం కూడా జర్నలిస్టు బాధ్యతల్లో ఓ భాగం. కానీ మోకాలికీ, బోడిగుండుకీ ముడి వేయడం జర్నలిస్టు బాధ్యత అనిపించుకోదు. దేశంలోనే అత్యున్నత ధర్మాసనం ఓ ఎన్కౌంటర్ ఘటనపై తీసుకున్న అసాధారణ నిర్ణయాన్ని కూడా ఆక్షేపించే తరహాలో గల కొందరి రోతల…, సారీ, రాతల గురించి వదిలేసి అసలు విషయంలోకి వద్దాం.

దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనలో నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరముందని సుప్రీంకోర్టు గురువారం ముగ్గురు నిష్ణాతులతో కమిషన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ వీఎస్ సిర్పుర్కర్ నేతృత్వంలో ముంబయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాష్, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా సుప్రీంకోర్టు కమిషన్ ను నియమించింది.

ఇదిగో దేశ అత్యున్నత న్యాయస్థానం తీసుకున్న ఈ నిర్ణయంపై కొందరు అపర మేధావులు అప్పుడే నిట్టూర్పులు విడుస్తున్నారు. అప్పుడేం జరిగింది? ఇప్పుడేం జరుగుతుంది? అంటూ తమ కలాల పైత్యాన్ని వండి వార్చేస్తున్నారు. కానీ ఈ కమిషన్ ఏర్పాటు అంశంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంలోని అర్థం, పరమార్థం ఇటువంటి పర్వర్టెడ్ కలాలకు సరిగ్గా బోధపడినట్లు లేదు. మెజిస్టీరియల్ విచారణకు, న్యాయ విచారణకు, రాష్ట్ర ప్రభుత్వాలు నియమించే న్యాయ విచారణ కమిషన్లకు, సుప్రీంకోర్టు నేరుగా నియమించిన కమిషన్లకు వ్యత్యాసం వీళ్ల మస్తిష్కానికి ఎక్కుతున్నట్లు కనిపించడం లేదు. దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ గురించి కాస్త లోతుగా పరిశీలిద్దాం.

> ఇది రాష్ట్ర ప్రభుత్వమో, కేంద్ర ప్రభుత్వమో నియమించిన కమిషన్ కాదు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసే కమిషన్ల విచారణకు పరిధి ఉంటుంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు నియమించిన కమిషన్ కు ఎటువంటి పరిధులూ లేవు.

> జస్టిస్ సిర్పుర్కర్ కమిషన్ ఎక్కడికైనా వెళ్లవచ్చు. ఎవరినైనా ప్రశ్నించవచ్చు. దేన్నయినా పరిశీలించవచ్చు. హత్యాచారానికి గురైన దిశ కేసును కూడా మొదటి నుంచీ తవ్వి ,విచారణ చేయవచ్చు. పోలీసులు నమోదు చేసిన కేసు పూర్వాపరాల్లోని లొసుగులను కూడా కనిపెట్టవచ్చు.

> దేశంలో జరిగిన ఏ ఎన్కౌంటర్ ఘటనలోనూ ఇప్పటి వరకు సుప్రీంకోర్టు నేరుగా కమిషన్ ను నియమించలేదు. రాష్ట్ర ప్రభుత్వాల అభ్యర్థన మేరకు విచారణలో నిష్ణాతులైన అనేక మంది న్యాయమూర్తులు వివిధ కమిషన్ల బాధ్యతలను నిర్వహించారు.

> తొలిసారి ఓ ఎన్కౌంటర్ ఘటనలో సుప్రీంకోర్టు నేరుగా విచారణ కమిషన్ ను ఏర్పాటు చేయడం దేశ న్యాయవ్యవస్థలోనే ప్రథమం. ఇతర కేసుల్లో సుప్రీంకోర్టు తీసుకున్న దర్యాప్తు బాధ్యతలను ఎన్కౌంటర్ ఘటనలతో ముడిపెట్టే అవకాశమే లేదు.

> ఇప్పటి వరకు న్యాయ విచారణ కమిషన్ల ఏర్పాటులో సాధారణంగా విశ్రాంత న్యాయమూర్తులు, సిట్టింగ్ జడ్జిలు మాత్రమే బాధ్యతలు నిర్వహించారు.

> దిశ కేసులో సుప్రీం కోర్టు ఏర్పాటు చేసిన సిర్పుర్కర్ కమిషన్ లో తొలిసారి ఓ మాజీ పోలీసు అధికారిని సభ్యునిగా నియమించడం గమనించదగ్గ విషయం. ఇప్పటి వరకు ఏ న్యాయ విచారణ కమిషన్ లో కూడా మాజీ లేదా సర్వీసులో గల పోలీసు అధికారి నియామకం జరగలేదు.

> అంటే దిశ ఎన్కౌంటర్లో నియమించిన కమిషన్ లో సుప్రీంకోర్టు సమతుల్యతను పాటించినట్లు స్పష్టమవుతోంది. హత్యాచారానికి గురైన బాధితురాలు మహిళ కాబట్టి జస్టిస్ రేఖా శర్మను సభ్యురాలిగా నియమించారని న్యాయ కోవిదులు చెబుతున్నారు.

> అదేవిధంగా సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ ను ఈ కమిషన్ లో సభ్యునిగా నియమించడంపైనా లోతైన భావం ఉందనేది కొందరు పోలీసు అధికారుల అంచనా. రాజీవ్ గాంధీ హత్య కేసును దర్యాప్తు చేసిన కార్తికేయన్ ను ఈ కమిషన్ లో సభ్యునిగా నియమిచడాన్ని గమనించదగ్గ అంశంగా వారు పేర్కొంటున్నారు.

> మొత్తంగా కమిషన్ లో నియమించిన నిష్ణాతులైన న్యాయమూర్తులను, పోలీసు అధికారిని నియమించిన తీరు స్పష్టం చేస్తున్నదేమిటంటే… దిశ నిందితుల ఎన్కౌంటర్ ఘటనపై కూలంకష విచారణ, నిజాల పరిశీలన.

> సాధారణంగా ఇటువంటి కమిషన్ల ఏర్పాటు ద్వారా సంబంధిత ఘటనలపై విచారణ (ఎంక్వయిరీ) మాత్రమే జరుగుతుంది. కానీ దిశ నిందితుల ఎన్కౌంటర్లో ప్రస్తుతం దర్యాప్తు (ఇన్వెస్టిగేషన్) కూడా జరుగుతుంది. సీబీఐ మాజీ డైరెక్టరైన కార్తికేయన్ వంటి నిష్ణాతుడైన పోలీసు అధికారి నియామకం చెబుతున్న అసలు విషయం ఇదే.

> ఇక ఏం జరుగుతుంది? అనే నిట్టూర్పునకూ చరిత్రలో అనేక సమాధానాలు ఉన్నాయి. ఎప్పటిదో పాత చరిత్ర ఎందుకు? తాజాగా ఛత్తీస్ గఢ్ లోని సర్కేగూడ ఎన్కౌంటర్లో 17 మంది ఆదివాసీలను నక్సలైట్ల పేరుతో కాల్చి చంపారనే నిజాన్ని నిగ్గు తేల్చింది జస్టిస్ అగర్వాల్ కమిషనే. ఈ కమిషన్ ను సుప్రీంకోర్టు నియమించలేదు. బీజేపీకి చెందిన సీఎం రమణ్ సింగ్ నాయకత్వంలోని ప్రభుత్వమే ఈ న్యాయ విచారణ కమిషన్ ను నియమించింది.

> ఓ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అగర్వాల్ కమిషన్ ఆదివాసీల కాల్చివేత నిజాన్ని బహిర్గం చేసినపుడు, నేరుగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిషన్ చేసే విచారణతోపాటు దర్యాప్తు ఎన్ని మలుపులకు దారి తీస్తుందో, ఎటువంటి నిజాలను వెల్లడిస్తుందో వెటకారపు కలాలకు తెలియకపోయినా, వాటి అనుభవాలను చవి చూసిన పోలీసు అధికారులకు మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది.

> మళ్లీ, మళ్లీ గుర్తుంచుకోవలసిన విషయమేమిటంటే, ప్రస్తుతం సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిర్పుర్కర్ కమిషన్ చేయబోయేది విచారణ మాత్రమే కాదు, దర్యాప్తు కూడా. న్యాయ విచారణ కమిషన్ లో కార్తికేయన్ వంటి మాజీ పోలీసు అధికారిని సభ్యునిగా నియమించడం ఇదే అంశాన్ని వెల్లడిస్తోంది.

> కమిషన్ ఆప్ ఎంక్వయిరీస్ చట్టం 1952 ప్రకారం ఇటువంటి కమిషన్ లో నిష్ణాతులైన ఎవరినైనా నియమించవచ్చు. కానీ అనేక కమిషన్లలో ఇప్పటి వరకు న్యాయ నిష్ణాతులను మాత్రమే నియమించిన చరిత్ర ఉంది. పోలీసు అధికారులను నియమించిన దాఖలాలు లేవు.

> చివరగా…జలగం వెంగళరావు హయాంలో గిరాయిపల్లి ఘటన ఎమర్జెన్సీ దురాగతాల్లో ఒకటిగా చెబుతుంటారు. కానీ ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వమే న్యాయ విచారణ కమిషన్ ను ఏర్పాటు చేసినట్లు గుర్తు. కాకపోతే అది జస్టిస్ విమద్ లాల్ కమిషనా? లేక జస్టిస్ భార్గవ కమిషనా? అనే విషయాన్ని వెటకారపు కలాలు తెలుసుకోవలసిన అవసరముంది.

Comments are closed.

Exit mobile version