ఇలాంటి వార్తలు చూసినప్పుడు అనేక భావోద్వేగాలు కలుగుతాయి. ‘మట్టిలో మాణిక్యాలు’గా అభివర్ణిస్తుంటాం, కానీ ఆ మాణిక్యాల కోసం మనం ఏమీ చేయం. అవకాశాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులోకి తేవాలని ప్రసంగాలు దంచడమే కానీ కార్యరూపంలో పెట్టం. ఇది మన ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర ఫలితం.
స్కూళ్ళు లేని ఊళ్ళు ఎన్ని ఉన్నాయో చూడలేం. స్కూళ్ళు ఉన్నా బడికిరాని ఉపాధ్యాయులెందరో లెక్కబెట్టలేం. బడికి వచ్చినా చిత్తశుద్ధితో పాఠాలు చెప్పలేని ఉపాధ్యాయులెందరో చూడలేం. అన్నిటికీ కళ్ళు మూసేసుకుని, మనకేది అనుకూలమో, అవసరమో, ఆనందకరమో వాటిని మాత్రమే చూస్తూ ఇలాంటి ఊళ్ళను, ఆ ఊళ్ళల్లో ఉండే బడులను విస్మరించేస్తుంటాం.
అవసరం, అవకాశం వచ్చినప్పుడు మాత్రం వాళ్ళను, వీళ్ళను తిట్టేసుకుంటూ బ్రతికేస్తాం. అంతేకాని ఓ క్షణం ఆలోచిస్తే ఈ మట్టిలో ఎన్ని మాణిక్యాలు దొరుకుతాయో ప్రయత్నం చేయం.
అష్టకష్టాలు పడి, ఎన్నో ప్రయత్నాలు చేసి ఎంతో పేదరికంలో ఉండి, ఏదో అదృష్టం కలిసొచ్చి ఉపాధ్యాయ ఉద్యోగం వస్తే గతం మర్చిపోవడం, తమలాంటి పేదపిల్లలను చదివిద్దాం అనే ఆలోచన, విజ్ఞత, స్పృహ కోల్పోతున్న ఉపాధ్యాయులను ఎంతమందిని చూడడం లేదు!
తీసుకుంటున్న జీతానికి న్యాయం చేయాలనీ, మనలాంటి కష్టాలు ఈ పిల్లలకు మెరుగైన జీవితం అందించాలనే ఆలోచన లేకపోవడం దురదృష్టకరమే కాదు, బాధ్యతారాహిత్యం కూడా. సిగ్గుతో వాళ్ళు తలవంచుకోవాలో లేక ఇలాంటి ఉపాధ్యాయులను భరిస్తున్నందుకు సమాజం సిగ్గుపడాలో తెలియదు.
అయినా, ఉపాధ్యాయ వృత్తిని బాధ్యతగా స్వీకరించి ఇలా మట్టిలో మాణిక్యాలను తయారు చేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం శిరస్సు వంచి నమస్కరించాల్సిందే. మీలాంటి వాళ్ళే ఈ సమాజానికి అవసరం.
జీతంకోసం మాత్రమే ఉపాధ్యాయ వృత్తి కాదు అనే స్పృహ లేని, అలాంటి స్పృహ లేని ఉపాధ్యాయులందరికీ ఇలాంటి సంఘటనలు కనువిప్పు కావాలని కోరుకుంటున్నాను.
అలాగే పాలకులు కూడా ప్రణాళికల రూపకల్పనలో గ్రామీణ ప్రాంతాల ప్రజలపై దృష్టి పెడితే మంచిది. మనకు పట్టణాలకంటే పల్లెలే ఎక్కువ. మనకు ధనవంతులకంటే పేద ప్రజలే ఎక్కువ.
నాలుగు లేన్ల రోడ్లున్న నగరాలకంటే రోడ్డే లేని ఊళ్ళెక్కువ. విద్యుత్ కాంతుల నగరాల కంటే వీధి లైట్లు లేని గ్రామాలెక్కువ.
స్కూల్లో కంప్యూటర్ స్రీన్ కంటే బ్లాక్ బోర్డు కూడా లేని బడులెక్కువ. పాఠాలు చెప్పే ఉపాధ్యాయులకంటే జీతాలు తీసుకునే ఉపాధ్యాయులే ఎక్కువ.
ప్రజలకు ఇచ్చే సంక్షేమం కంటే, లంచాలు, నల్లధనమే ఎక్కువ. పేదలకిచ్చే వరాల కంటే ధనవంతులకిచ్చే రాయితీలే ఎక్కువ.
అవకాశాలు కల్పించండి. వనరులు పెంచండి … పెంచిన వనరులు పంచండి. మన గ్రామాల్లో జనాభా ఎక్కువ. ఆ ఎక్కువ జనాభాపై దృష్టి పెట్టండి. అన్నీ మాణిక్యాలే దొరుకుతాయి.
-దారా గోపి @fb