అబ్బే… దక్షిణ కొరియా పాలకులకే కాదు, అక్కడి ప్రజలకు కూడా అస్సలు ధైర్యం లేనట్టుంది. లేకపోతే ఏమిటీ…? రెండు రోజుల్లో ఆఫ్టరాల్ ఓ 600+ కరోనా పాజిటివ్ కేసులు నమోదైనంత మాత్రాన దేశవ్యాప్తంగా మరోసారి లాక్ డౌన్ విధించేందుకు ఆ దేశపు పాలకులకు సిద్ధం కావడమేంటి? ప్రాణాలపై మరీ తీపి చర్య కాకపోతే?
దక్షిణ కొరియాలో ఇప్పటి వరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 17,002 కాగా, 309 మంది మృతి చెందారు. వైరస్ బారిన పడిన మరో 14,169 మంది కరోనాను జయించారు. గత ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి వరకు అక్కడ మూడంకెల సంఖ్యలో కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
కరోనా నియంత్రణకు అక్కడి సర్కార్ గట్టి చర్యలు తీసుకున్న కారణంగా ఏప్రిల్ లో కేసులు గణనీయ స్థాయిలో తగ్గుముఖం పట్టాయి. మే నెలలో కొన్ని రోజులపాటు కేసులే లేవు. ఈ కారణంగా లాక్ డౌన్ నిబంధనలను, ఆంక్షలను రద్దు చేశారు. కానీ ఈనెల 13వ తేదీ నుంచి దక్షిణ కొరియాలో మళ్లీ కరోనా కోరలు చాస్తోంది.
రోజుకు వందకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన రెండు రోజుల వ్యవధిలోనే 600లకు పైగా కేసులు నమోదయ్యాయి. నిన్న అనగా శనివారం దేశ వ్యాప్తంగా 332 కేసులు వెలుగు చూశాయి. ఇదిగో ఈ తాజా పరిణామాలు దక్షిణ కొరియా పాలకుల్లో తీవ్ర కలవరం పుట్టిస్తున్నాయి.
కరోనా కట్టడికి మరోసారి లాక్ డౌన్ ఆంక్షలకు దక్షిణ కొరియా సిద్ధపడుతున్నట్లు జాతీయ వార్తా సంస్థలు నివేదిస్తున్నాయి. గణనీయంగా… అంటే రోజుకు 300+ స్థాయిలో కరోనా కేసులు పెరుగుతున్న భయానక పరిస్థితుల్లో కరోనాను అదుపు చేసేందుకు షట్ డౌన్ తప్పదని భావిస్తున్నారు.
ప్రస్తుతం గ్రేటర్ సియోల్ వరకు మాత్రమే గల కరోనా ఆంక్షలను దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిందేనని ఆ దేశ ప్రధాని చంగ్ సె గ్యూన్ మీడియాతో చెప్పారు. గ్రేటర్ సియోల్ లో ఇప్పటికే చర్చిలు మూసేశారు. నైట్ క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, కంప్యూటర్ గేమింట్ కేఫ్ లకు తాళాలు వేశారు. బేస్ బాల్, సాకర్ మ్యాచ్ లు జరిగే స్టేడియాల్లోకి అభిమానులను అడుగు మోపనీయడం లేదు.
స్థానికంగా, మన తెలంగాణాలో ఇంతకన్నా ఎక్కువగా కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తుంటే ఎక్కడో గల దక్షిణ కొరియా సంగతి ఇప్పుడెందుకు… అని విసుక్కోకండి. ఇక్కడ చెప్పే విషయం కూడా అదే మరి!
దక్షిణ కొరియా జనాభా 2018 లెక్కల ప్రకారం 5.16 కోట్లు. ఇంత జనాభా గల ఓ దేశంలో దినసరి 300+ కరోనా కేసులకే భయపడి షట్ డౌన్ దిశగా ఆలోచిస్తే…? కేవలం ఓ 14.00 లక్షల జనాభా గల తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో నిన్న, మొన్న కలిపి 681 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా లెక్కల ప్రకారం తెలంగాణా రాష్ట్ర జనాభా 3.93 కోట్లు. రాష్ట్ర వ్యాప్తంగా నమోదవుతున్న కరోనా కేసుల లెక్కల గురించి తెలిసిందే.
ఈ ప్రాతిపదికన రాష్ట్ర వ్యాప్తంగానేగాక, ఖమ్మం వంటి జిల్లాల్లో నమోదవుతున్న పాజిటివ్ కేసులు ప్రామాణికంగా ప్రస్తుతం కరోనా తీవ్రతను ఎలా అంచనా వేయొచ్చు? దాని నియంత్రణకు ఎంత కఠిన నిబంధనలను అమలు చేయాల్సి ఉంది? కానీ మనకు ధైర్యం ఎక్కువ కదా!
కొందరు మన నాయకుల అభిలాష, విశ్లేషణ ప్రకారం కరోనాతోనే మనం సహజీవనం చేస్తున్నాం. ధైర్యమే శ్వాసగా జీవిస్తున్నాం. వైరస్ బారిన పడినవారు అనేక మంది ధైర్యం లేక భయంతోనే ఎక్కువగా ఛస్తున్నారు. మనకెందుకు ఆంక్షలు… మరోసారి లాక్ డౌన్లు… షట్ డౌన్లు? కరోనాతో కలిసి బతకాలి… బతుకుతున్నాం కూడా… అంతే!