గుండె చెరువైంది… అంటుంటాం. గుండె సంగతి దేవుడెరుగు… రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన కలెక్టరేట్ మాత్రం నిజంగానే చెరువైంది. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, జిల్లా కేంద్రంలోనే ఈ సీన్ చోటు చేసుకోవడం గమనార్హం.
సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సుమారు రూ. 72 కోట్లతో నిర్మించిన అధునాతన కలెక్టరేట్ భవనాన్ని దాదాపు 20 రోజుల క్రితం సీఎం కేసీఆర్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. దాదాపు అన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంగా 93 ఎకరాల విశాల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు.
అయితే నిన్న కురిసిన వర్షాలకు సిరిసిల్ల కలెక్టరేట్ కాస్తా చెరువుగా మారడమే అసలు విశేషం. వాస్తవానికి ఈ స్థలాన్ని తొలుత సిరిసిల్ల రైల్వే స్టేషన్ కోసం ప్రతిపాదించారుట. అయితే రైల్వే స్టేషన్ నిర్మిస్తే పరిసరాల్లో గల తమ స్థలాలు భూసేకరణలో పోతున్నాయని స్థానికులు ఆందోళనకు దిగడంతో రైల్వే స్టేషన్ ప్రతిపాదనను విరమించుకున్నారుట.
ఆ తర్వాత అదే స్థలంలో జిల్లా కలెక్టర్ కార్యాలయ సముదాయాన్ని నిర్మించారు. విశేషమేమిటంటే ఈ స్థలం వాస్తవానికి ఓ చెరువేనట. దాని పేరు చంద్రవంక చెరువట. ఈ స్థలంలోనే కలెక్టరేట్ నిర్మించినందువల్లే భారీ వర్షాలకు నీరు వెళ్లే దారి లేక ఎప్పటిలాగే చంద్రవంక చెరువు తన స్థానాన్ని పదిలపర్చుకున్నదట. అదీ అసలు సంగతి.