సిరిసిల్ల… పేరు వినగానే నేతన్నలు గుర్తుకు వచ్చే నియోజకవర్గ కేంద్రం. ప్రస్తుతం జిల్లా కేంద్రం కూడా. తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, దేశ వ్యాప్త చర్చకు అవకాశం కల్పించాయనే వాదన వినిపిస్తున్నది. వాస్తవానికి సిరిసిల్ల ఓటరుకు కేటీఆర్ తక్కువ చేసింది కూడా ఏమీ లేదు. నియోజకవర్గ కేంద్రానికి వందల కోట్ల నిధులు వరదలా పారించి చేసిన అభివృద్ధి పనులు సైతం మున్సిపల్ ఎన్నికల ఫలితాలకు గీటురాయిగా నిలవకపోవడమే విశేషం.
గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తన సమీప ప్రత్యర్థిపై 89,009 ఓట్ల ఆధిక్యతతో కేటీఆర్ అద్భుత విజయాన్ని సాధించారు. సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోనే 35 నుంచి 40 వేల ఓట్లు కేటీఆర్ కు అసెంబ్లీ ఎన్నికల్లో లభించాయి. నియోజకవర్గం మొత్తంగా 2,25,839 మంది ఓటర్లు ఉండగా, పోలైన ఓట్లతో 89 వేలకు పైగా ఆధిక్యత లభించడమంటే ఆషామాషీ వ్యవహారం కాకపోవచ్చు. ఓ నాయకుడిపై ఎంతో అభిమానం ఉంటే తప్ప ఇది సాధ్యం కాకపోవచ్చు.
కానీ అసెంబ్లీ ఎన్నికలు ముగిసి మహా అయితే ఏడాది కాలం మాత్రమే పూర్తయింది. ఇంత స్వల్ప వ్యవధిలోనే జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల ఓటరు ఇచ్చిన వైరుధ్య తీర్పు రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. సిరిసిల్ల మున్సిపాలిటీలో మొత్తం 67,162 ఓట్లు ఉండగా, ఇందులో 54,926 ఓట్లు పోలయ్యాయి. కానీ టీఆర్ఎస్ అభ్యర్థులకు లభించిన ఓట్లు 24,729 మాత్రమే. మిగతా ఓట్లను కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్లు, ఇతరులు పంచుకున్నారు. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు లభించిన ఓట్లకన్నా, రెబల్స్ గా బరిలోకి దిగిన ఇండిపెండెంట్లు చీల్చిన ఓట్ల సంఖ్యే ప్రస్తుతం అధికార పార్టీ నేతలను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. పోలైన ఓట్లతో 30 వేలకుపైగా ఓట్లు అధికార పార్టీకి వ్యతిరేకంగా పడడం ప్రమాదకర పరిణామంగా రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అధికార పార్టీ అభ్యర్థులను ఎదిరించి 12 మంది ఇండిపెండెంట్లు ఇక్కడ విజయం సాధించడం గమనార్హం.
సరే ఈ విషయంలో అధికార, విపక్ష పార్టీల వాద, ప్రతివాదనలు ఎలా ఉన్నప్పటికీ అసలు సిరిసిల్లలో ఏం జరిగిందనే అంశంపైనే భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి సిరిసిల్ల మున్సిపాల్టీలోని మొత్తం 39 వార్డులను ఏకగ్రీవంగా గెలిపించి చరిత్ర సృష్టించాలనే లక్ష్యంతో రాజకీయంగా పావులు కదిపినట్లు ప్రచారం జరుగుతోంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో నాలుగు వార్డుల్లో మాత్రమే ఏకగ్రీవం టార్గెట్ సాధ్యమైందంటున్నారు. మిగతా 35 వార్డులకు అనివార్యంగా ఎన్నికలు జరిగాయట. ఇందులో 18 టీఆర్ఎస్, 12 ఇండిపెండెంట్లు (రెబల్స్), ముగ్గురు బీజేపీ, ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. అయితే గంపగుత్తగా ఏకగ్రీవం కోసం చేసిన ప్రయత్నాలే అధికార పార్టీకి బెడిసికొట్టినట్లు సమాచారం. ఈ విషయంలో ‘ఫోర్ మెన్ కమిటీ’ పేరుతో గల నాయకులు కొందరు వ్యవహరించిన తీరుపైనా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.
ఏకగ్రీవం అనే విషయంలో కొందరు ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో తమ అభిప్రాయాలను రాతపూర్వకంగా బహిర్గతం చేయడం ఇందుకు బలం చేకూరుస్తోంది. అసలు ఏకగ్రీవంగా ప్రకటించిన వార్డులకు తిరిగి ఎన్నికలు జరిపించాలని కలెక్టర్ కార్యాలయం ముందు మహిళలు ధర్నా చేసిన ఘటనలు సైతం ఈ సందర్భంగా ప్రస్తావనకు వస్తున్నాయి. ఫలితంగానే కేటీఆర్ కోటలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు విపక్ష నేతల విమర్శలకు ఊతం కల్పించాయనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే రెబల్స్ గా విజయం సాధించిన 12 మంది కౌన్సిలర్లు తాము పార్టీలో చేరుతామంటూ రాజధానికి వెళ్లగా, వారి ముఖం కూడా చూసేందుకు కేటీఆర్ ఇష్టపడలేదని సమాచారం. దీంతో సిరిసిల్లకు చెందిన స్థానిక నేతలే వారికి పార్టీ కండువాలు కప్పారని తెలుస్తోంది. మొత్తంగా కాబోయే ముఖ్యమంత్రిగా ప్రాచుర్యంలోకి వచ్చిన కేటీఆర్ తన సొంత నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాలపై వాస్తవాలను విశ్లేషించాల్సిన అవసరముందని పార్టీ కేడర్ అభిప్రాయపడుతోంది. లేదంటే మున్ముందు ప్రమాద ఘంటికల చప్పుడు మరింత తీవ్రతరమైనా ఆశ్చర్యం లేదంటున్నారు. అదీ సంగతి.