త్రిదండి చిన జీయర్ పై ఆదివాసీ నాయకులు భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీకి గురువారం ఫిర్యాదు చేశారు. వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన జీయర్ పై ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలని వారు అభ్యర్థించారు. ఈమేరకు ఆదివాసీ హక్కుల పోరాట సమితి (తుడుందెబ్బ) నాయకులు ఎస్పీ సునీల్ దత్ ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా ఆయా సంస్థ జిల్లా అధ్యక్షుడు సనప కోటేశ్వరరావు మాట్లాడుతూ, చిన్నజీయర్ ఆదివాసీ వనదేవతలను కించపరిచే విధంగా, ఏక వచనంతో మాట్లాడి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. వెంటనే అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ 1989 ప్రకారం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.

ఆసియా ఖండంలోనే అతిపెద్ద ఆదివాసీ జాతర మేడారానికి కొన్ని కోట్ల మంది ప్రజలు, భక్తులు దర్శనానికి వస్తుంటే దాన్ని సహించలేక , అహంకారంతో మదమెక్కి పిచ్చి మాటలు మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. చిన్నజీయర్ వెంటనే సమ్మక్క సారలమ్మ తల్లులు కొలువై ఉన్న మేడారానికి వచ్చి యావత్ సమాజానికి క్షమాపణలు చెప్పాలన్నారు.

జిల్లాలోని ఆదివాసీలందరితోపాటు గూడెం పెద్దలు, దొరలు, పటేళ్లు, గ్రామ గ్రామన చిన్నజీయర్ దిష్టి బొమ్మలను దగ్ధం చేయాలని పిలుపు నిచ్చారు. ఎస్పీకి వినతి పత్రం ఇచ్చినవారిలో తుడుందెబ్బ జిల్లా ఉపాధ్యక్షుడు ఎట్టి శ్రీనివాసరావు, కొత్తగూడెం డివిజేన్ అద్యక్షుడు పాయం లక్ష్మినర్సు, లక్ష్మిదేవిపల్లి మండల అధ్యక్షుడు వర్స నరసింహారావు, కంగాల జగన్, శ్రీకాంత్ తదితరులున్నారు

Comments are closed.

Exit mobile version