భూముల అమ్మకానికి తెలంగాణా ప్రభుత్వం సంసిద్ధమైంది. ఈమేరకు ప్రభుత్వ భూముల అమ్మకానికి మార్గదర్శకాలు ఖరారు చేసింది. వివిధ శాఖల వద్ద ఖాళీగా ఉన్న భూముల అమ్మకం కోసం మార్గదర్శకాలను రూపొందిస్తూ, ఈ-వేలం ద్వారా పారదర్శకంగా భూముల విక్రయం నిర్వహించాలని నిర్ణయించింది. ఇటువంటి భూములకు న్యాయపరమైన చిక్కులు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. విక్రయించే భూములను మల్టీపర్పస్ జోన్‌గా ప్రకటించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అవసరమైన అన్ని రకాల అనుమతులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. భూముల అమ్మకం కోసం వివిధ కమిటీలను కూడా ఏర్పాటు చేసింది. చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. విక్రయ సందర్భంగా న్యాయపరమైన చిక్కులు లేకుండా చూసేందుకు ల్యాండ్స్‌ కమిటీని, అనుమతుల కోసం అప్రూవల్ కమిటీని, భూముల అమ్మకం పర్యవేక్షణ కోసం ఆక్షన్ కమిటీని ఏర్పాటు చేశారు. భూమి ధరను నిర్ణయించి ఈ-వేలం ప్రక్రియ నిర్వహించేందుకు నోడల్ శాఖను ఏర్పాటు చేశారు.

నిధుల సమీకరణలో భాగంగా భూముల అమ్మకానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైన సంగతి తెలిసిందే. ప్రభుత్వం, గృహనిర్మాణ సంస్థ వద్ద గల భూములను, ఇళ్లను విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకోవాలని గత మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. తాజాగా గత మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ భూముల అమ్మకం అంశంపై చర్చ జరిగినట్లు వార్తలు వచ్చాయి. అమ్మకం ప్రక్రియ ప్రారంభమైందా? అని ముఖ్యమంత్రి కేసీఆర్​ ఆరా తీసినట్లు, వీలైనంత త్వరగా భూముల అమ్మకం ప్రక్రియను ప్రారంభించాలని అధికారులను సీఎం ఆదేశించినట్లు ఆయా వార్తల సారాంశం. మొత్తంగా ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా రూ. 20 వేల కోట్లు, కనీసం రూ.10 వేల కోట్లు సమీకరించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే భూముల విక్రయానికి ప్రభుత్వ మార్గదర్శకాలను విడుదల చేయడం గమనార్హం.

Comments are closed.

Exit mobile version