తెలంగాణా ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలను పెంచబోతున్నదా? ఆర్టీసీపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో గురువారం సమీక్ష నిర్వహించిన సందర్భంగా ప్రస్తావనకు వచ్చిన అంశాలు ఇదే సంశయాన్ని కలిగిస్తున్నాయి. భారీగా పెరిగిన డీజిల్ ధరలు, కరోనా వల్ల విధించిన లాక్ డౌన్, గతంలో పేరుకుపోయిన బకాయిలు తదితర కారణాల వల్ల ఆర్టీసీ నష్టాలు కొనసాగుతున్నాయని అధికారులు ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఈ సందర్భంగా నివేదించడం గమనార్హం. ఆర్టీసీ ఉద్యోగులకు వేతనాలు పెంచితే ఆర్థిక భారం మరింత పెరుగుతుందని వివరించారు. ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయం అందించడం, బస్సు చార్జీలు పెంచడం లాంటి చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీపై ఆర్థిక భారం తగ్గే అవకాశం లేదని వారు విన్నవించారు.
‘క్రితం సారి బస్సు చార్జీలు పెంచినప్పుడు లీటర్ డీజిల్ ధర 67 రూపాయలు ఉండేది. కానీ చాలా స్వల్ప వ్యవధిలోనే ధర లీటర్ కు 15 రూపాయలు పెరిగింది. ఇది ఆర్టీసీపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్థిక భారం మోపింది. కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలోనూ ఆర్టీసీ నష్టాలను చవిచూసింది. ఇప్పటికే పేరుకుపోయిన బకాయిల భారం ఉంది. ఈ పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు పెంచాల్సి ఉంది. ఒకవేళ జీతాలు పెంచితే ఆర్టీసీపై పెనుభారం తప్పదు. అది భరించే స్థితిలో ఆర్టీసీ లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఆర్టీసీకి సహాయం అందించాలి. బస్సు చార్జీలు పెంచాలి. ఈ రెండు చర్యలు తీసుకుంటే తప్ప ఆర్టీసీ గట్టెక్కే పరిస్థితి ఉండదు’’ అని అధికారులు సిఎంకు వివరించారు.
ఈ సమీక్షా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సిఎస్ సోమేశ్ కుమార్, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, ఫైనాన్స్ అడ్వయిజర్ రమేశ్, కార్గో స్పెషల్ ఆఫీసర్ కృష్ణకాంత్, ఈడీ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.