సేల్స్ టాక్స్ ఆఫీసర్లమంటూ దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఖమ్మం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది.

పోలీసుల కథనం ప్రకారం… ఖమ్మం నగరానికి చెందిన అల్లం సురేష్, షేక్ షరీఫ్, శ్రీను యాదవ్ అనే వ్యక్తులు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ కరుణగిరి సమీపాన మహారాష్ట్రకు చెందిన ఓ లారీని అటకాయించారు. తాము సేల్స్ టాక్స్ ఆఫీసర్లమని, కాగితాలు చూపాలని డిమాండ్ చేశారు. కాగితాలు సరిగ్గా లేవని రూ. 2 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అయితే అనుమానం కలిగిన లారీ డ్రైవర్ వారితో వాగ్వాదానికి దిగగా, ముగ్గురు వ్యక్తులు అతన్ని కొట్టారు. అదే లారీ వెనకాల వస్తున్న మహారాష్ట్రకే చెందిన మరో లారీ డ్రైవర్ పరిస్థితిని గమనించి డయల్ 100కు ఫోన్ చేశారు. పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దోపిడీకి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Comments are closed.

Exit mobile version