తమ చిన్నారి మృతికి ఇంజక్షన్ వికటించడమే కారణమని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు ఓ ప్రయివేట్ ఆసుపత్రిపై దాడికి దిగారు. ఖమ్మం నగరంలోని ప్రధాన రహదారిలో గల ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. చిన్నారి కుటుంబీకులు, బంధువులు భారీ ఎత్తున ఆసుపత్రికి తరలిరావడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.

వివరాల్లోకి వెడితే… ఖమ్మం నగరంలోని సహకారనగర్ ప్రాంతానికి చెందిన మూడేళ్ల బాలికకు ఈ తెల్లవారుజామున ఫిట్స్ మాదిరిగా రావడంతో ఆమెను వైరా రోడ్ లో గల ఓ ప్రయివేట్ ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆసుపత్రి వైద్యులు చిన్నారికి ఇంజక్షన్ వేశారు. కొద్ది నిమిషాల్లోనే బాలిక పరిస్థితి విషమించడంతో ఆమెను ఖమ్మంలోని ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. కానీ ఈలోగానే చిన్నారి తుదిశ్వాస విడిచిందని బాధిత కుటుంబీకులు చెబతున్నారు.

తమ చిన్నారి మరణానికి ఆసుపత్రి నిర్వాహకులు, డాక్టర్లే కారణమంటూ బాలిక కుటుంబీకులు, బంధువులు ఆసుపత్రిపై దాడికి దిగారు. బాధిత కుటుంబానికి చెందిన సంబంధీకులు పెద్ద ఎత్తున ఆసుపత్రికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. బాధిత కుటుంబీకులకు, ఆసుపత్రి నిర్వాహకులకు మధ్య చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలను దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version