చిత్రాన్ని నిశితంగా పరిశీలించండి.. ఈ మ్యాప్ లో రెడ్, పింక్, యెల్లో గీతలు కనిపిస్తున్నాయి కదా..? ఏమిటీ గీతలు అనుకుంటున్నారా? కాస్త ఆగండి..
ఇప్పుడు ఈ చిత్రాన్ని కూడా చూడండి. ఇందులో ఎరుపు, పసుపు రంగుల్లో మాత్రమే గీతలు కనిపిస్తున్నాయి కదూ? ఇటువంటి రకరకాల రంగుల గీతల్లో గల గూగుల్ ఎర్త్ మ్యాపులు హన్మకొండ జిల్లాలోని పలు గ్రామాల ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. తమ పరిస్థితి ఏమిటో తెలియక హసన్ పర్తి, ధర్మసాగర్, కాజీపేట తదితర మండలాలకు చెందిన సుమారు పది గ్రామాల ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే..?
రైల్వే శాఖ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినా భారీ ప్రచారంలోకి వచ్చిన ఓ వార్త మాత్రం పది గ్రామాల ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. సికింద్రాబాద్ నుంచి నాగ్ పూర్ వైపు వెళ్లాల్సిన గూడ్స్ రైళ్ల కోసం రైల్వే శాఖ సరికొత్త రైల్వే లైన్ నిర్మాణాన్ని ప్రతిపాదించినట్లు ఆయా వార్తల సారాంశం. దీని ప్రకారం.. సికింద్రాబాద్ నుంచి నాగ్ పూర్ మీదుగా న్యూఢిల్లీ వైపు వెళ్లాల్సిన గూడ్స్ రూళ్ల తాకిడి కాజీపేట జంక్షన్ నుంచి తప్పించేందుకు సరికొత్త బైపాస్ రైల్వే లైన్ నిర్మాణం కోసం సర్వే జరుగుతున్నదట. నష్కల్ నుంచి ఎల్లాపూర్ వరకు సుమారు 25 కి.మీ. పొడవునా బైపాస్ లైన్ నిర్మించనున్నారట. నష్కల్ నుంచి పెద్ద పెండ్యాల రింగ్ రోడ్, రాంపూర్, ధర్మసాగర్, టేకులగూడెం, ఉనికిచెర్ల, దేవన్నపేట, ఎల్లమ్మటెంపుల్ పక్క నుంచి మునిపల్లె కల్లు మండువ, జయగిరి రైల్వే గేట్ మీదుగా ఎల్లాపూర్ వరకు సర్వే పూర్తయిందట.
సరే.. తన అవసరాలకు తగిన విధంగా రైల్వే శాఖ పలు రైల్వే లైన్లను కొత్తగా నిర్మించడం సహజమే. కానీ గత కొన్ని నెలలుగా పది గ్రామాల ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ వార్తల్లోకి వచ్చిన కొత్త బైపాస్ లైన్ రోజుకో రూట్ లో అలైన్ మెంట్ మారుతూ సర్వే రిపోర్టులుగా గూగుల్ ఎర్త్ మ్యాపులు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. తొలుత రింగు రోడ్డుకు సమాంతరంగా రైల్వే బైపాస్ లైన్ వెడుతుందని, ఆ తర్వాత టేకులగూడెం నుంచి వెడుతుందని, తాజాగా ధర్మసాగర్ రిజర్వాయర్ సమీపం నుంచి వెడుతుందని మ్యాపులు చక్కర్లు కొడుతుండడమే అసలు విశేషం. దీంతో ఆయా ప్రాంతాల్లోని 25 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల్లో భూముల ధరలు ఒక్కసారిగా పాతాళంలోకి పడిపోయాయి. కొద్ది నెలల క్రితం వరకు ఎకరం నాలుగైదు కోట్లు పలికిన వ్యవసాయ భూములను ప్రస్తుతం అడిగేవారే లేరంటున్నారు. ఇక కమర్షియల్ ప్లాట్లవైపు కన్నెత్తి చూసేవారే కరువయ్యారట.
దాదాపు 70 ఏళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే డెవలప్ మెంటుకు నోచుకుంటున్న గ్రామాల పరిస్థితి అనధికార మ్యాపుల వల్ల అయోమయంలో పడింది. తమ గ్రామాల మీదుగా రైల్వే బైపాస్ లైన్ నిర్మాణానికి అంగీకరించేది లేదని అప్పుడే వివిధ గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. టోటల్ ఈ ఎపిసోడ్ లో ఆసక్తికర అంశమేమిటంటే రైల్వే బైపాస్ లైన్ కు సంబంధించిన ప్రతిపాదనలు ఏవీ తమ దృష్టికి రాలేదని హన్మకొండ రెవెన్యూ అధికార వర్గాలు చెబుతున్నాయి. సర్వే నిర్వహిస్తున్నట్లు ప్రచారంలో గల ఓ సంస్థ ముఖ్య ప్రతినిధిని ఇదే అంశంపై ప్రశ్నించగా, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సర్వే మ్యాపులతో తమకు ఎటువంటి సంబంధం లేదని చెప్పారు. అసలు ఈ మ్యాపులు ఎక్కడి నుంచి వస్తున్నాయో, ఎవరు విడుదల చేస్తున్నారో తమకు బోధపడడం లేదన్నారు. తాము గతంలో ఓ సర్వే నిర్వహించిన మాట వాస్తవమేనని, కానీ ఆ తర్వాత ఎటువంటి సర్వే నిర్వహించలేదని ఆయన చెప్పారు.
ఈ పరిణామాల్లోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న గూగుల్ ఎర్త్ మ్యాపులు పది గ్రామాల ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. సందట్లో సడేమియాగా రియల్ ఎస్టేట్ బ్రోకర్లు ధరలు పడిపోయాయని, ఆయా గ్రామాల్లోని భూములకు మున్ముందు ధర పలకడం గగనమేనని ప్రచారం చేస్తున్నారట. విషయం అర్థమైనట్లే కదా? గూగుల్ ఎర్త్ మ్యాపులు ఎక్కడి నుంచి సృష్టిస్తున్నారో? సోషల్ మీడియాలో ఎవరు విడుదల చేస్తున్నారో? ఎందుకు తిరుగుతున్నాయో.? అదీ అసలు సంగతి. అంతా రియల్ బ్రోకర్ల మాయాజాలం అన్నమాట.