తెలంగాణాకు చెందిన ప్రమఖ న్యాయవాది, ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ ఉపాధ్యక్షుడు స్వామి రమేష్ కుమార్ కు అరుదైన గౌరవం దక్కింది. ఖమ్మం నగరానికి చెందిన ఆయన వరల్డ్ బాడీ బిల్డింగ్ ఫిజిక్ అండ్ స్పోర్ట్స్ ఫెడరేషన్, ఏషియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ డిసిప్లినరీ కమిటీల్లో సభ్యునిగా నియమితులయ్యారు. ఈమేరకు ఆయా సంస్థల అధ్యక్షుడు దతుక్ పాల్ చువా నియామకపు పత్రాన్ని జారీ చేశారు.

స్వామి రమేష్ కుమార్ 1974 నుంచి బాడీ బిల్డింగ్ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని, 1985లో జాంబిలో జరిగిన ఇంటర్నేషనల్ కాంపిటీషన్ లో తాను రమేష్ కుమార్ ను కలుసుకున్నట్లు చెప్పారు ఇండోనేషియా, జపాన్, టోక్యోల్లో జరిగిన ప్రపంచ ఛాంపియన్ షిప్ వంటి అనేక పోటీల్లో స్వామి రమేష్ కుమార్ పోషించిన భూమికను దతుక్ పాల్ చువా ఈ సందర్భంగా కొనియాడారు.

బాడీ బిల్డింగ్ అభివృద్ధికి స్వామి రమేష్ కుమార్ చేసిన సేవలకు గౌరవంగా ఆయనకు ఈ పదవి దక్కినట్లు పలువురు భావిస్తున్నారు. బాడీ బిల్డింగ్ రంగంలో పలువురు ప్రపంచ వ్యాప్తంగా రాణించడానికి స్వామి రమేష్ కుమార్ ఎంతో కృషి చేశారు. బాడీ బిల్డింగ్ పై ఆసక్తి గల అనేక మంది పేద యువకులకు తానే ‘స్పాన్సర్’గా వ్యవహరించి ప్రోత్సహించారు.

స్వామి రమేష్ కుమార్ ఇచ్చిన ప్రోత్సాహం వల్ల పలువురు బాడీ బిల్డర్లు ప్రభుత్వ ఉద్యోగాల్లో నియామకమయ్యారంటే అతిశయోక్తి కాదు. కాగా సౌత్ ఇండియా స్థాయిలో ఈ పదవిలో నియామకమైన తొలి గౌరవాన్ని కూడా స్వామి రమేష్ కుమార్ తన సొంతం చేసుకోవడం విశేషం. బాడీ బిల్డింగ్ ను ప్రోత్సహించడమే తపనగా స్వామి రమేష్ కుమార్ తన జీవిత కాలాన్ని వెచ్చించారని పలువురు ఈ సందర్భంగా కొనియాడుతున్నారు.

స్వామి రమేష్ కుమార్ నియాకమకంపై మాజీ ఎంపీ రామసహాయం సురేందర్ రెడ్డి, ఆయన తనయుడు రఘురాంరెడ్డి, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే యూనస్ సుల్తాన్, మాజీ మంత్రి కనుమూరి బాపిరాజు, ప్రముఖ వ్యాపారవేత్త రేఖల భాస్కర్, ప్రముఖ న్యాయవాదులు కొల్లి సత్యనారాయణ, కాటమనని రమేష్, దండా సుధాకర్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.

Comments are closed.

Exit mobile version