ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ న్యాయవాది, ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ స్వామి రమేష్ కుమార్ కుటుంబం మరోసారి తన ఔదార్యాన్ని చాటుకుంది. న్యాయమూర్తుల, న్యాయవాదుల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా జిల్లా కోర్టు సముదాయాల ప్రాంగణంలో జిమ్ ను స్వామి రమేష్ కుటుంబం ఏర్పాటు చేసింది. దాదాపు రూ. 8.00 లక్షల విలువైన మిషనరీని ఈ జిమ్ ఏర్పాటుకు స్వామి రమేష్ కుటుంబం ఉచితంగా అందజేసింది. స్వామి రమేష్ తండ్రి స్వామి గురునాథం ఈ జిమ్ ను ఏర్పాటు చేస్తుండడం విశేషం. ఈనెల 20వ తేదీన జిమ్ ప్రారంభానికి సర్వం సిద్దం చేశారు.

స్వామి రమేష్ కుమార్

జిమ్ ఏర్పాటు అంశంపై ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ మాట్లాడుతూ, జిల్లా కోర్టు సముదాయపు ప్రాంగణంలో జిమ్ ఏర్పాటు కోసం తాను పదిహేనేళ్లుగా ప్రయత్నించి ఇప్పటికి సఫలమైనట్లు చెప్పారు. నిత్యం వేలాది కేసుల పరిష్కారంలో అటు న్యాయమూర్తులు, ఇటు న్యాయవాదులు ఫైళ్లతో కుస్తీ పడుతూ శారీరకంగానేగాక, మానసికంగానూ అలసిపోతుంటారని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో న్యాయమూర్తుల, న్యాయవాదుల ఆరోగ్య రక్షణే ప్రధాన లక్ష్యంగా జిమ్ ఏర్పాటుకు షెల్టర్ కోసం పదిహేనేళ్లుగా పోరాటం చేశానని చెప్పారు.

ఎట్టకేలకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర ప్రసాద్, జిల్లాలో బాధ్యతలు నిర్వహిస్తున్న ఇతర న్యాయమూర్తుల సహకారంతో జిమ్ ఏర్పాటుకు షెల్టర్ సాధించినట్లు స్వామి రమేష్ కుమార్ సంతోషంతో చెప్పారు. దినసరి ఓ పదిహేను నిమిషాల సేపు న్యాయాధికారులు, న్యాయవాదులు ఈ జిమ్ లో వ్యాయామం చేస్తే తన లక్ష్యానికి సార్థకత చేకూరినట్లేనని స్వామి రమేష్ కుమార్ పేర్కొన్నారు. పదే పదే రూపం మార్చుకుంటున్న కరోనా వంటి పరిణామాల్లో న్యాయమూర్తులు, న్యాయవాదులు ఓ పావు గంట సేపు జిమ్ లో శ్రమిస్తే ఇమ్యూనిటీ పెరగడంతోపాటు శరీర దారుఢ్యం కలుగుతుందన్నారు.

ఖమ్మం జిల్లా కోర్టులో స్వామి రమేష్ కుటుంబం ఏర్పాటు చేసిన జిమ్

జిమ్ ఏర్పాట్లన్నీ పూర్తి కావచ్చాయని, ఆదివారం హైకోర్టు న్యాయమూర్తుల, జిల్లా న్యాయమూర్తుల చేతుల మీదుగా దీన్ని ప్రారంభిస్తున్నట్లు స్వామి రమేష్ కుమార్ వివరించారు. జిమ్ ఏర్పాటుకు షెల్టర్ కల్పించే విషయంలో సహకరించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్ రెడ్డికి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చంద్రశేఖర్ ప్రసాద్ కు స్వామి రమేష్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Comments are closed.

Exit mobile version