పాలేరు నియోజకవర్గంలో ‘అడ్వాన్స్ బలప్రదర్శన’ చేస్తున్న మాజీ మంత్రి, టీఆర్ఎస్ నేత తుమ్మల నాగేశ్వర్ వర్గీయులపై వరుస పోలీస్ కేసులు నమోదువుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి వర్గీయులు, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు అనుచరులు తమ తమ పోస్టులతో తలపడుతున్నారు. అయితే ఈ పోస్టుల వ్యవహారంపై ఫిర్యాదులు అందిందే తడవుగా తమపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నట్లు తుమ్మల వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో తాను పాలేరు నుంచే పోటీ చేస్తానని బహిరంగంగానే ప్రకటించిన తుమ్మల నాగేశ్వర్ రావు నియోజకవర్గంలో పర్యటిస్తూ, వివిధ శుభ కార్యక్రమాలకు హాజరవుతూ భారీ బలప్రదర్శన చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తుమ్మల అనుచరులు అనేక మంది కేసుల బారిన పడుతుండడం గమనార్హం. తాజాగా జరిగిన రెండు ఉదంతాలు ఇదే అంశాన్ని స్పష్టం చేస్తున్నాయి.

నేలకొండపల్లి మండలం చెర్వుమాదారంలో ఓ శుభకార్యానికి హాజరైన తుమ్మలకు టీఆర్ఎస్ కేడర్ వందలాది కార్లు, బైకులతో భారీ ర్యాలీగా స్వాగతం చెప్పారు. ఈ సందర్భంగా తుమ్మల రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ శత్రువులను నమ్మొచ్చుగాని, రాజకీయ ద్రోహులను నమ్మరాదని నిర్వచించారు. ఈ ఘటన అనంతరం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ లో మాజీ కార్పొరేటర్ జంగం భాస్కర్ పై పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్గానికి చెందిన మేకల ఉదయ్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెర్వుమాదారంలో తుమ్మల బలప్రదర్శనకు, రూరల్ పోలీసులకు అందిన ఫిర్యాదుకు లంకె లేకపోవచ్చు. కానీ…

తాజా ఉదంతానికి సోషల్ మీడియా పోస్టు కారణమని పోలీసులు చెబుతున్నారు. మేకల ఉదయ్ పోస్టుపై మాజీ కార్పొరేటర్ జంగం భాస్కర్ ఆగ్రహించి, ఫోన్ చేసి అతన్ని దుర్భాషలాడాడనేది పోలీసుల కథనం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు జంగం భాస్కర్ ను అరెస్ట్ చేసేందుకు వెళ్లగా, తామే అప్పగిస్తామని చెప్పిన తుమ్మల వర్గీయులు భాస్కర్ ను స్టేషన్ కు తీసుకువచ్చారని, ఆ తర్వాత అతన్ని వారే ఎస్కేప్ చేయించి ఆచూకీ చెప్పాలని ఆందోళనకు దిగినట్లు పోలీసు వర్గాల కథనం. కానీ జంగం భాస్కర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, అక్రమంగా కేసు బనాయించారని, అతని ఆచూకీ తెలియనివ్వడం లేదనేది తుమ్మల వర్గీయు ఆరోపణ. ఈ మొత్తం ఎపిసోడ్ లో మాజీ కార్పొరేటర్ జంగం భాస్కర్ పోలీస్ స్టేషన్ ఆవరణ నుంచే చాకచక్యంగా తప్పించుకున్నట్లు పోలీసు వర్గాలే చెబుతున్నాయి.

ఈ పరిణామాల్లోనే జంగం భాస్కర్ కోసం ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగిన తుమ్మల అనుచరగణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాలేరులో తుమ్మల ప్రధాన అనుచరగణంగా ప్రాచుర్యంలో గల శాఖమూరి రమేష్, తమ్మినేని క్రిష్ణయ్య, జొన్నలగడ్డ రవికుమార్, బండి జగదీష్, బానోత్ క్రిష్ణ, మహిపాల్, బానోత్ వీరన్న, తోట వీరభద్రం సహా మొత్తం 40 మందిపై పోలీసులు ఐపీసీ 143, 294-బి, 353, 341 రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటన నుంచి తుమ్మల వర్గీయులు తేరుకోకముందే నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ లో మరో ఫిర్యాదు అందినట్లు వార్తలు వస్తున్నాయి. గువ్వలగూడెం గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నేత, తుమ్మల అనుచరుడు రావెళ్ల శ్రీనివాసరావుపై తమకు అందిన ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు స్పందించినట్లు తెలిసింది. వాట్సప్ ద్వారా అభ్యంతరకర పోస్ట్ పెట్టాడనే అభియోగంపై రావెళ్ల శ్రీనివాసరావును విచారణకోసం స్టేషన్ కు రావాలని వర్తమానం పంపినట్లు సమాచారం.

ఆయా పరిణామాలు తుమ్మల నాగేశ్వర్ రావు అనుచరగణంలో సహజంగానే తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా సాగుతున్న రాజకీయ యుద్ధంలో తమ అనుచరులపై నమోదవుతున్న కేసుల అంశంలో తుమ్మల ఎలా స్పందిస్తారనేది ఉత్కంఠ కలిగిస్తున్న అంశంగా రాజకీయ పరిశీకులు చెబుతున్నారు.

UPDATE:
కాగా ఈ కథనంలో ప్రచురించిన రావెళ్ల శ్రీనివాసరావు ఫొటోపై నేలకొండపల్లి ఎస్ఐ స్రవంతి స్పందించారు. Ts29 వెబ్ సైట్ ఎడిటర్ కు ఆమె ఫోన్ చేసి మాట్లాడారు. రావెళ్ల శ్రీనివాసరావును తాను ఇక్కడ బాధ్యలు స్వీకరించిన తర్వాత ఎప్పుడూ పోలీస్ స్టేషన్ కు పిలిపించలేదని, ప్రచురితమైన ఫొటో ఎప్పటిదో పాతదిగా ఆమె చెప్పారు. అయితే సోషల్ మీడియాలో రావెళ్ల శ్రీనివాసరావు చేసిన పోస్టుకు సంబంధించి ఫిర్యాదు అందినమాట వాస్తవమేనని, కానీ ఆయనపై ఎటువంటి కేసు నమోదు చేయలేదని స్రవంతి చెప్పారు. తన ఆరోగ్యం బాగాలేదని శ్రీనివాసరావు చెప్పడంతో కుదుటపడ్డాకి ఓసారి విచారణకు స్టేషన్ కు రావాలని సమాచారం అందించినట్లు ఎస్ఐ స్రవంతి వివరించారు. ఈ ఉదంతంలో సోషల్ మీడియా ద్వారా అందిన ఓ పాత ఫొటోను ప్రచురించినందుకు చింతిస్తూ, ఆయా ఫొటోను తొలగించనైనది.

Comments are closed.

Exit mobile version