ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నఫళంగా హైదరాబాద్ ఎందుకు వస్తున్నారు? భారత్ బయోటెక్ కంపెనీ అభివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ పురోగతిని తెలుసుకోవడానికి వస్తున్నారు. ఇక్కడ కరోనా వ్యాక్సిన్ డెవలప్ చేస్తున్న అంశం ఈనాటి కొత్త విషయమేమీ కాదు. కానీ ఇందుకు సంబంధించి అర్జంటుగా ప్రధాని పర్యటన ఖరారు కావడమే రాజకీయవర్గాల్లో ఆసక్తికర చర్చకు దారి తీసింది. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుతున్న పరిస్థితుల్లో, తెలంగాణా సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచార సభ జరగనున్న సమయంలోనే ప్రధాని పర్యటన ఖరారు కావడం రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీసింది. జీహెచ్ఎంసీలో ఏకపక్ష విస్తృత ప్రచారానికి చెక్ పెట్టేందుకే ప్రధాని పర్యటన ఖరారైందనే వాదన వినిపిస్తోంది. తన పర్యటన ద్వారా ప్రధాని నేరుగా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండానే ఎన్నికలను ప్రభావితం చేసే ప్రయత్నంగా పరిశీలకులు అభివర్ణిస్తున్నారు.

అధికారిక సమాచారం ప్రకారం… 28న శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రధాని హకీంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ఆ తర్వాత 3.50 గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి సాయంత్రం 4.10 గంటలకు భారత్‌ బయోటెక్ ప్రాంగణానికి చేరుకుంటారు. ఇక్కడ జరుగుతున్న కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తిని పరిశీలిస్తారు. వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు. దాదాపు గంట సేపు ప్రధాని మోదీ ఇక్కడే గడుపుతారు. అనంతరం 5.15 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుని, 5.45 గంటలకు బయలుదేరి రాత్రి 7.45 గంటలకు ఢిల్లీకి బయల్దేరుతారు. ఇదీ ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్.

శనివారం సరిగ్గా నాలుగు గంటలకు సీఎం కేసీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచార సభలో పాల్గొనాల్సి ఉన్న సమయంలోనే ప్రధాని పర్యటన ఖరారు కావడం గమనార్హం. ప్రొటోకాల్ ప్రకారం సీఎం, గవర్నర్ సహా పలువురు ఉన్నతాధికారులు కూడా ప్రధాని వెంట ఉండాల్సి ఉంటుంది. సాధారణంగానైతే ఎక్కడైనా ప్రధాని పర్యటన కనీసం రెండు వారాల ముందే ఖరారవుతుంది. కానీ హైదరాబాద్ పర్యటన రెండు రోజుల ముందే ఖరారు కావడం విశేషం. ప్రధాని హైదరాబాద్ వస్తుండడం, అందునా కరోనా వాక్సిన్ డెవలప్ అంశంపై పరిశీలనకు వస్తుండడం గమనార్హం. దరిమిలా మీడియా దృష్టితోపాటు ప్రజల దృష్టి కూడా రేపు ఉదయం నుండి రాత్రిదాకా ప్రధాని పర్యటన చుట్టే తిరుగుతుందని పరిశీలకులు భావిస్తున్నారు. దీంతో సహజంగానే సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారసభ పై జరిగే చర్చకు, మీడియా ఇచ్చే ప్రాధాన్యతనకు కాస్త అడ్డుకట్టపడే పరిస్థితి ఉందంటున్నారు.

ఓవైపు కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటుండగా, ఇంకోవైపు ప్రధాని మోదీ పర్యటన కూడా తమకు పరోక్ష ప్రచారంగా ఆ పార్టీ వర్గాలు భావిస్తూ సంబరపడుతున్నాయి. మొత్తంగా గ్రేటర్ ఎన్నికల ప్రచార సరళి బీజేపీ-టీఆర్ఎస్ పార్టీల మధ్యే తిరుగుతుండడం గమనించాల్సిన అంశంగా పరిశీలకులు పేర్కొంటున్నారు.

Comments are closed.

Exit mobile version