కేసీఆర్ జీతం నెలకు 4,10,000/-
సంవత్సరానికి 49,20,000/-
కేటీఆర్ జీతం నెలకు 3,10,000/-
సంవత్సరానికి 37,20,000/-
హారీష్ రావు జీతం నెలకు 3,10,000/-
సంవత్సరానికి 37,20,000/-
కవిత జీతం నెలకు 2,75,000/-
సంవత్సరానికి 33,00,000/-
కల్వకుంట్ల కుటుంబం మొత్తం తీసుకుంటున్న నెల జీతం 13,05,000/-
కల్వకుంట్ల కుటుంబం మొత్తం సంవత్సరానికి తీసుకుంటున్న జీతం 1,56,60,000/-
ఇది మిగతా అలవెన్సులు కాకుండా తీసుకుంటున్న జీతాలు..
తెలంగాణ శాసనసభ మండలి సభ్యుల జీతాలు పెంపు.
???????
?ఎమ్మెల్యేల ఎమ్మెల్సీల జీతాలు 95,000 నుండి 2,50,000.
?ఇంటి అద్దె 25000 నుండి 50,000.
?రైల్వే చార్జీలు 1,00,000,
?పేపర్ ఖర్చులు 1,00,000.
?మాజీ ఎమ్మెల్యే పెన్షన్ 25,000 నుండి 50,000.
?ఎమ్మెల్యే కారు లోన్ 10,00,000 నుండి 25,00,000 కు పెంపు.
పీఆర్సీ నివేదిక లీక్, ఉద్యోగ సంఘాలతో త్రిసభ్య కమిటీ సభ్యుల చర్చల అనంతరం సోషల్ మీడియాలో సంచరిస్తున్న పోస్ట్ ఇది. ఈ పోస్ట్ లోని అంశాలను కాసేపు పక్కనబెడితే… అసలు పీఆర్సీ వ్యవహారంలో ఉద్యోగులు ఆశించిందేమిటి? ప్రభుత్వం భావించిదేమిటి? ఇదీ తాజా ప్రశ్న. పీఆర్సీ నివేదిక తప్పుల తడకగా అభివర్ణిస్తూ కూడా ఉద్యోగ వర్గాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపాదిత ఫిట్ మెంట్ కు, బడ్జెట్ అంచనాల్లో వ్యత్యాసపు లెక్కలను ఉద్యోగ వర్గాలు వేలెత్తి చూపుతుండడమే ఇందుకు నిదర్శనం. నిన్న రెండోరోజు జరిగిన చర్చల్లోనూ పీఆర్సీ ఫిట్ మెంట్ శాతంపై ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు పెదవి విరిచాయి. మరీ ఎక్కువ ఫిట్ మెంట్ ఆశించవద్దని కూడా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ పేర్కొనడం గమనార్హం.
పీఆర్సీ కమిటీ చేసిన సిఫారసులపై ప్రభుత్వ అనుకూల ఉద్యోగ సంఘాల నేతలు కూడా పెదవి విరుస్తున్నారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందనే ప్రచారం కూడా జరుగుతుండడం విశేషం. గడచిన 30 నెలలుగా పీఆర్సీ వ్యవహారాన్ని తేల్చకుండా, నాన్చి, నాన్చి చివరికి నివేదికను లీక్ చేయడాన్నే ఉద్యోగ వర్గాలు సంశయిస్తున్నాయి. సీల్డ్ కవర్ లో ఉండాల్సిన నివేదిక చర్చలకు ముందే లీక్ కావడమేంటని ప్రశ్నిస్తున్నాయి. ఫిట్ మెంట్ 7.5 శాతంగా పేర్కొన్న నివేదిక లీక్ కావడం వెనుక ఉద్యోగుల ‘మూడ్’ను అంచనా వేసే వ్యూహంగా అభివర్ణిస్తున్నారు.
ఈ నేపథ్యంలో పీఆర్సీ అంశంలో ఎక్కువ ఉపోద్ఘాతంలోకి వెళ్లకుండా అసలు విషయంలోకి వెడితే… ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ హయాంలోనూ ఇంత దారుణమైన పీఆర్సీ నివేదికను చూడలేదని ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. చివరికి చంద్రబాబునాయుడి ప్రభుత్వ హయాంలో కూడా దాదాపు 27 శాతం ఫిట్ మెంట్ ఇచ్చారని గుర్తు చేస్తున్నాయి. తాజాగా పక్కనే, పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సైతం 27 శాతం మధ్యంతర భ్రుతి (ఐఆర్) ప్రకటించిందని, గడచిన రెండేళ్లుగా అక్కడి ఉద్యోగులు దీన్నిఆస్వాదిస్తున్నారని కూడా ఉద్యోగ వర్గాలు ఉటంకిస్తున్నాయి.
అదేవిధంగా త్రిసభ్య కమిటీతో చర్చల అనంతరం కొందరు సంఘ నేతల ప్రకటనపైనా ఉద్యోగవర్గాలు సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి. సీఎం కేసీఆర్ పై తమకు నమ్మకముందని, కమిటి నివేదిక ఫైనల్ కాదని, ముఖ్యమంత్రి తాము ఆశించిన నిర్ణయాన్ని తీసుకుంటారని పలువురు సంఘ నేతలు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇదేగనుక వాస్తవమైతే పీఆర్సీపై నియమించిన కమిటీతో సంఘ నేతల చర్చలు దేనికని ఉద్యోగ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు పీఆర్సీ నివేదికలోని ఓ ముఖ్యాంశం కూడా ప్రాచుర్యంలోకి రావడం గమనార్హం. ప్రతి పీఆర్సీ సందర్భంగా కూడా ఉద్యోగుల పనితీరు, ప్రవర్తనపైనా నివేదికలో ప్రస్తావన ఉంటుంది. ఈసారి కూడా అదే ప్రస్తావనకు సంబంధించిన అంశాలు లీక్ కావడం గమనార్హం. ఉద్యోగులు సామాన్యులతో దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ప్రజలంటే గౌరవం లేదని, పనిలో సమర్థత లేదనే సారాంశంతో గల పీఆర్సీ నివేదికలోని అంశాలు ప్రాచుర్యంలోకి రావడంపైనా ఉద్యోగ వర్గాలు సందేహిస్తున్నాయి.
వాస్తవానికి పీఆర్సీ అమలు అంశం ఉద్యోగుల, ప్రభుత్వం మధ్య సాఫీగా జరగాల్సిన ఓ ప్రక్రియ. అయిదేళ్లకోసారి సహజంగా జరగాల్సిన ఈ ప్రక్రియ ప్రస్తుతం ప్రజల్లో చర్చనీయాంశంగా మారడమే ఆసక్తకికర పరిణామం. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై పోరాటానికి ప్రజా మద్ధతు లభించడం కూడా సందేహాస్పదమే. ఇందుకు కారణాలు అనేకం. ప్రస్తుతం ఉద్యోగుల ఆందోళనకు ప్రజామద్ధతు లేకపోవడం కూడా ఇందులో భాగమే. పీఆర్సీ వ్యవహారం ప్రజల్లోకి వెళ్లిన నేపథ్యంలో, వారి జీత, భత్యాలపై, పనితీరుపై సహజంగానే చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉద్యోగులు ఆశిస్తున్న ప్రకారం ఫిట్ మెంట్ 45 శాతం దాటాలి. ఇదే జరిగితే మూల వేతనం రూ. 35 వేల నుంచి గరిష్టంగా రూ. 2.50 లక్షలకు చేరుకుంటుందనేది కాదనలేని వాస్తవం. కరోనా పరిణామాల అనంతరం దినసరి రూ. 500 కూలీ పని సైతం గగనంగా మారిన ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగులు ఆశిస్తున్న ఆయా ఫిట్ మెంట్, తద్వారా పెరిగే భారీ వేతనాలపై ప్రజల్లో భారీ చర్చ జరుగుతుంది.
మరోవైపు పదవీ విరమణ వయస్సు పెంపు అంశం. నిరుద్యోగ భ్రుతి, ఉద్యోగాల భర్తీపై సీఎం కేసీఆర్ త్వరలోనే కీలక ప్రకటన చేస్తారని మంత్రి కేటీఆర్ నిన్న ప్రకటించి ఉండవచ్చు. కానీ ఏళ్ల తరబడి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల మాటేమిటి? పదవీ విరమణ వయస్సు పెంచితే నిరుద్యోగులు ఇక భ్రుతితో సరిపెట్టుకోవలసిందేనా? రిటైర్మెంట్ వయస్సు పెంపు ప్రతిపాదనపై అప్పుడే వ్యతిరేకత కూడా వ్యక్తమవుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల వేతన సవరణ, రిటైర్మెంట్ వయస్సు పెంపు అంశాలు తెలంగాణా ప్రజల్లో, ముఖ్యంగా నిరుద్యోగుల్లో హాట్ టాపిక్. ఉద్యోగుల నిరసన, నిరుద్యోగుల ఆందోళనా దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఇంకోవైపు చర్చలు, సీఎం నిర్ణయం కోసం ఉద్యోగ సంఘాల ఎదురుచూపులు. మొత్తంగా ఉద్యోగుల పీఆర్సీ, వేతనాలు, రిటైర్మెంట్ వయస్సు పెంపు అంశాలు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరగాలనే ప్రభుత్వ భావించిందా? ఈ చర్చ ఇలాగే జరగాలని కూడా ప్రభుత్వ వర్గాలు కోరుకున్నాయా? ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కానే కాదా? చివరికి మధ్యంతర భ్రుతిని మాత్రమే ప్రభుత్వం ప్రకటిస్తుందా? ఇవీ ఉద్యోగ వర్గాల్లో నెలకొన్న తాజా సందేహాలు.