హెడ్డింగ్ వరకు మాండలికపు పదాలు ఓకే. మరీ కథనం మొత్తం ఇదే మాండలికమంటే చదవడానికి కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. అందుకే విషయం మొత్తం పత్రికా భాషలోనే, అంటే.. వ్యవహారిక భాషలోనే మాట్లాడుకుందాం. వ్యవహారిక భాషే పత్రికా భాషగా మారి దశాబ్ధాలు దాటింది లెండి.

వెనకటికి మా ఊళ్లో ఓ పటేల్ సాబ్ ఉండేవాడు. తెలంగాణాలో… ముఖ్యంగా ఉత్తర తెలంగాణాలో రెడ్లను పటేండ్లుగా వ్యవహరిస్తుంటారు. మన మానుకోట ఎమ్మెల్యే శంకర్ నాయక్ భాషలో కాదుగాని, బాగా బలిసిన అంటే అర్థికంగానేగాక అన్ని రంగాల్లో పుష్టి గల పటేండ్లను కొన్ని ప్రాంతాల్లో ‘దొర’లు అని కూడా పిలుస్తుంటారు. మరీ సిక్స్ ప్యాక్ తరహాలో ఆస్థి, పాస్తులుంటే ‘దేశ్ ముఖ్’ అని కూడా అంటుంటారు. అంటే పటేల్ పేరు చివరన ‘రెడ్డి’ పోయి ‘రావు’ వస్తుందన్నమాట. బాగా బలిసి ఉండడం, సిక్స్ ప్యాక్ వంటి క్వాలిఫికేషన్లు లేకుంటే కొందరు రెడ్లు ‘అయ్య’లు కూడా అవుతుంటారు లెండి. రెడ్లలోని కొన్ని వర్గాలు మాత్రమే ఇందుకు ఒడిగడతాయి. మరీ అంత డెప్త్ కు వెడితే బాగోదు కాబట్టి, రెడ్లు అయ్యలు అయ్యే విషయాన్ని ఇక్కడి వరకే ముగిద్దాం. రెడ్లనే కాదు తెలంగాణాలోని ఇతర కులాలకు చెందినవారిని కూడా అనేక మందిని దొరలుగానే పిలుస్తుంటారు. వీరిలో భూస్వాములైన వెలమలు, కరణాలు వంటి వారు కూడా ఉంటారు.

సరే అసలు విషయం దొరల గురించి కాదు… పటేండ్ల గురించే. మా ఊళ్లోఓ పెద్ద పటేల్ ఉండేవాడు. మొదట్లో అతనికి ఓ రెండెకరాల భూమి మాత్రమే ఉండేది. ‘ఈ ఊరు మనదిరా..ఆ వాడ మనదిరా’ పాటను కాస్తా రామోజీరావు వంటి పత్రికా పెద్దాయన ‘ఈనేల మనదిరా..ఆ నింగి మనదిరా’ అంటూ అసలు పాట స్వరూపాన్నే మార్చేసిన తీరును దాదాపు మూడు దశాబ్ధాల కిందటే ’పీపుల్స్ ఎన్కౌంటర్’ అనే సినిమాలో చూశాం కదా? మా ఊరి పటేల్ ప్రస్థానం కూడా ఆ తరహాలోనే సాగిందన్న మాట.  తన రెండెకరాల కమతాన్ని ‘ఊరు మనదిరా, వాడ మనదిరా‘ గీతం తరహాలో ఆలపించి రెండెకరాల కమతాన్ని వందెకరాలకు పైగా పెంచి తన సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఇప్పుడు ఆ పటేల్ మాటకు ఎదురే లేదు. ప్రస్తుతం తాను ఏదంటే అదే సాగుతోంది.

ఈ పెద్ద పటేల్ ఇంటిలో ఓ చిన్న పటేల్ కూడా ఉంటారు కదా?  ఆయనకు వారసుడన్నమాట. ఈ చిన్న పటేల్ అనే పదాన్ని ఆయన బాల్యంలో ఉన్నపుడే పెద్ద పటేల్ ఊరందరికీ అలవాటు చేశాడు. ‘అరే ఎల్లయ్యా, పుల్లయ్యా..మన శిన్న పటేల్ ఏం జేస్తున్నడురా? బాగున్నడు గదా శిన్నపటేల్?’ అంటూ పెద్ద పటేల్ ఊరి జనాన్ని పేరు పేరునా పలకరిస్తూ తన వారసుని గురించి ఆరా తీసేవారన్నమాట. పెద్ద పటేల్ మాటకు గ్రామంలో ఎవరైనా ఎదురు చెప్పే పరిస్థితి ఉంటుందా? అందుకే గ్రామ ప్రజలు కూడా చిన్న పటేల్ భవిష్యత్తును ముందే అంచనావేసి కీర్తించేవారు. అలాగని చిన్న పటేల్ కూడా తక్కువేం కాదు సుమీ. పెద్ద పటేల్ కు తీసిపోని విధంగా సకల విద్యలను అభ్యసించాడు. పెద్ద పటేల్ కు ఏమాత్రం తగ్గని విధంగా అన్ని రంగాల్లోనూ ఆరి తేరాడు. తన తర్వాత చిన్న పటేల్ ను సామ్రాజ్యాధినేతగా ప్రకటించడానికి సర్వం సిద్ధమవుతున్నదాఖలాలు కూడా కనిపిస్తున్నాయి. ఇదిగో ఈ సమయంలోనే మా ఊళ్లోనే గల మరో పటేల్ సాబ్ ప్రజలకు తెలిసిన విషయాన్నే తాజాగా, ఆసక్తికరంగా సెలవిస్తున్నారు. ఏ విధంగా అంటే…

‘పెద్ద పటేల్ తర్వాత ‘హయాం’ చిన్న పటేల్ దే. ఎప్పటికైనా ఇది జరగాల్సిందే. జరిగి తీరుతుంది కూడా… ఆయనకు అన్ని అర్హతలు ఉన్నాయి’ అని సదరు పటేల్ సాబ్ భజన అందుకున్నారు. ఎలాగూ పెద్ద పటేల్ తర్వాత చిన్న పటేల్ రాజ్యమేలుతారని ప్రజలందరికీ తెలిసిందే కదా? మరి అందరికన్నా ముందు ఈ పటేల్ సాబ్ వంటి వారు ఎందుకు ఆ విషయాన్ని కొత్తగా దండోరా తరహాలో సెలవిస్తున్నట్లు? ‘జెర సోచాయించుర్రి’ మరి..అచ్చ తెలంగాణా మాండలికంలో.

Comments are closed.

Exit mobile version