ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి శపథం చేశారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ ను గద్దె దించడం, ఖమ్మం జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎంపీలను, ఎమ్మెల్యేలను ఓడించడమే తమ లక్ష్యంగా ప్రకటించారు. ఈ లక్ష్యాన్ని తమ కుటుంబ సభ్యులైన ప్రజల ఆశీర్వాదంతో చేరుకుంటాననే ధీమాను ఆయన వ్యక్తం చేశారు. పాలేరు నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం తిరుమలాయపాలెం మండల కేంద్రంలో ఆదివారం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి పొంగులేటి ప్రసంగించారు.
తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పొంగులేటి ఈ సందర్భంగా అన్నారు. రాష్ట్రం సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకు పోయిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి మనిషి పై 1,35,000 అప్పు ఉందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో భారీ ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న అధికార పార్టీ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు ఎప్పుడు కడుగుతారో చెప్పాలని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభల్లోనూ అసెంబ్లీ సాక్షిగా చేసిన వాగ్దానాలు అమలు కాలేదన్నారు. కేసీఆర్, కేటీఆర్ లను నమ్మి టిఆర్ఎస్ లో చేరాననని, ఆ తర్వాత వారి చేష్టలు తనను ఇబ్బందులకు గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే దానికి సమాధానం చెబుతారని, కేసీఆర్ మాయ మాటలు ప్రజలు నమ్మరన్నారు. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో అధికార పార్టీని మట్టి కరిపించడమే శీనన్న టీం లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇంతవరకు ఐదు లక్షల మందికి రుణమాఫీ చేశారని ఇంకా 31 లక్షల మంది చేయాల్సి ఉందని అన్నారు. ఇంకా ఎన్నికలకు ఏడు నెలల సమయం ఉందని ఎప్పుడు రుణమాఫీ చేస్తారని ఆయన ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో మద్దినేని బేబీ స్వర్ణకుమారి, మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, రామ సహాయం నరేష్ రెడ్డి, చావా శివరామకృష్ణ, డాక్టర్ కోట రాంబాబు, విజయ బాయి, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, నెల్లూరి భద్రయ్య, బజ్జూరి వెంకట్ రెడ్డి, కొడాలి గోవిందరావు, చెరువు స్వర్ణ, అజ్మీరా అశోక్, మద్ది కిషోర్ రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, రవీంద్రబాబు, జీవన్ రెడ్డి, శివ సాగర్, దుబ్బాకుల వెంకటేశ్వర్లు, ఎన్ వి శేషు, కొప్పుల చంద్రశేఖర్, కార్పొరేటర్ దొడ్డా నగేష్, పీఎస్ఆర్ యువజన విభాగం అధ్యక్షుడు మొగిలిశెట్టి నరేష్, యువనేత గోపి తదితరులు పాల్గొన్నారు.