Facebook Twitter YouTube
    Monday, May 29
    Facebook Twitter YouTube
    ts29ts29
    • Home
    • Editor’s Pick
    • General News
    • Crime News
    • Political News
    • Opinion
    • National News
    • International News
    ts29ts29
    Home»General News»అహో.. లేక్‌ తాహో..!

    అహో.. లేక్‌ తాహో..!

    March 6, 20235 Mins Read
    WhatsApp Facebook Twitter Telegram
    ts29 lake3


    ’గాడ్‌ఫాదర్‌’ గుర్తుందిగా.. మొన్నొచ్చిన మన చిరంజీవిది కాదు. పాతది. ఇంగ్లీషు సినిమా. చాలా క్రైం, థ్రిల్లర్లకు మూలం. అందులో హీరో మైఖేల్‌ను చంపడానికి జరిగే సీన్‌ని ఎక్కడ తీశారో తెలుసా..
    ప్రపంచ వెండితెరను ఏలిన నటి ఎలిజబెత్‌ టేలర్‌. ఆమె, మోంట్‌ గోమేరి క్లిఫ్ట్‌ నటించిన ట్రాజిడీ ఎపిక్‌ ’ఎ ప్లేస్‌ ఇన్‌ ది సన్‌’ కోసం సెట్స్‌ వేసిందెక్కడనుకున్నారు?
    432 ఎపిసోడ్స్‌గా వచ్చిన తొలి అమెరికన్‌ సీరియల్‌ ’బొనాంజా’ మొదలు మొన్న మొన్న వచ్చిన ’లాస్ట్‌ వీకెండ్‌’ సినిమా వరకు తీసింది అక్కడే…
    అదే..‡నార్త్‌ లేక్‌ తాహో.

    మనకి హిమాలయాలు ఎలాగో ఉత్తర అమెరికా వాళ్లకి లేక్‌ తాహో అలాగా.. ఇంగ్లీషు పేరు వాషో. వాడుకలో తాహో.. పర్యాటకంలో ప్రధానం, ఖజానాకు కీలకం. అమెరికాకున్న అతి పెద్ద ఐదు మంచినీటి సరస్సుల్లో ఇదొకటి. 72 మైళ్ల వెడల్పు 22 మైళ్ల పొడవు, 63 ఉపనదులు, ఒకే ఒక అవుట్‌ లెట్‌ ఉండే లేక్‌ తాహో మూడింట రెండొంతులు కాలిఫోర్నియాలో ఓవంతు నెవెడా రాష్ట్రంలో ఉంటుంది. లోతైన సరసుల్లో రెండోది. తాహో లోతు 1,645 అడుగులైతే మొదటిదైన ఒరెగాన్‌లోని క్రేటర్‌ లేక్‌ లోతు 1,949 అడుగులు. ప్రపంచంలోని 16 లోతైన సరస్సుల్లో తాహో ఐదోది. 20 లక్షల ఏళ్ల నాటి మంచు యుగాల్లోనే ఏర్పడిందట. క్రిస్టల్‌ క్లియర్‌ అంటామే అలాంటిదీ సరస్సు. తొంగిచూసి 64 అడుగుల లోతులో ఉంగరాన్నీ కనిపెట్టొచ్చు. అంతటి స్పష్టత. ఏవైపు చూసినా మనసు మైమరిపించే సుందర మనోహర దృశ్యాలు. కోడెతాచుల్లాంటి పర్వతాలు, మంచుతో మిలమిల్లాడే కొండలు, గుట్టలు, సెలఏర్లు, మన సరుగుడు మాదిరి సూదుల్లా ఆకాశం వైపు చూసే ఫర్‌ చెట్లు, మంచు ముసుగేసిన ఇళ్లు ముచ్చటగొలుపుతుంటాయి. భూమికి 6,225 అడుగుల ఎత్తుండే తాహో బేసిన్‌లోనే 10,891 అడుగుల ఎత్తున్న ఫ్రీల్‌ పీక్‌ ఉంది. సరస్సు పరీవాహక ప్రాంతంపై పట్టు జాతీయ అటవీ శాఖదే. అనుమతి లేకుండా మొక్క పీకినా, నరికినా చచ్చామే! ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టే ముందే అక్కడ ఏమేమీ చేయకూడదో నోటీసు బోర్డులు పెట్టి ఉంటాయి. మన తిరుమలలో మాదిరే ఇక్కడ ప్లాస్టిక్‌పై నిషేధం ఉంది. 365 రోజుల్లో కనీసం 250 రోజులు మబ్బులు కమ్మే ఉంటాయి. ఏ నిమిషంలో వాతావరణం ఎలా ఉంటుందో చెప్పలేం. ఓ పక్క ఎండ మరోపక్క చురుక్కుమనే చలి… అందువల్ల వాతావరణ హెచ్చరికల్ని తరచూ వింటుండాలి. 1997 హ్యాపీ న్యూయర్‌ వేళ ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి గడ్డకట్టుకుపోయిన మంచు కరిగించి రెనో, పరిసర ప్రాంతాలను ముంచెత్తింది.

    అక్కడికి ఎలా వెళ్లాలంటే…?
    తాహో సరస్సుకు ఎక్కువ మంది కార్లలోనే వెళతారు. రైళ్లు, విమానాలు ఉన్నా రెండు మూడు చోట్ల మారాల్సి ఉంటుంది. ట్రకీలోని అమ్‌ట్రాక్‌ స్టేషన్‌ వరకు ప్యాసింజర్‌ రైళ్లు నడుస్తాయి. రెనో మీదుగా తాహో ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ (ఆర్‌ఎన్‌ఓ)కు విమాన సర్వీసు ఉంది. ఎక్కువ మందికి అందుబాటులో ఉన్నది మాత్రం సౌత్‌ తాహో ఏరియా ట్రాన్సిట్‌ అథారిటీ. 24 గంటలూ కార్లు, బస్సులు నడుపుతుంది.

    మా ప్రయాణం ఎలా సాగిందంటే…?
    మేము రోడ్డు మార్గాన శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి లేక్‌ తాహోకు బయలుదేరాం. మంచు కురిసినా టైర్లు జారకుండా చైన్లు, గొడుగులు, చలి కోట్లు, బూట్లతో పొద్దున్నే 5 గంటలకు కార్లో కూర్చున్నాం. మేమున్న చోటు నుంచి హైవే మీదికి చేరిటప్పటికే వాన మొదలైంది. కారు స్పీడ్‌ తగ్గింది. కాలిఫోర్నియా రాష్ట్ర రాజధాని శాక్రమెంటో సిటీకి చేరేటప్పటికే గంటన్నర.. కాఫీలు, టిఫిన్లకు ఇంకో అరగంట. అక్కడి నుంచి లేక్‌ తాహో చేరడానికి రెండు గంటలు. వీకెండ్‌ కావడంతో రద్దీ. మొత్తం మీద ఉదయం 9, 9.30 గంటల ప్రాంతంలో కాలిఫోర్నియా వైపుండే లేక్‌ తాహో చేరాం. ఈ సిటీ జనాభా 23వేలకు మించదు. ఎక్కువ మంది నేటివ్‌ అమెరికన్లే. ఓవైపు ఎండ కాస్తున్నట్టే ఉంది గాని చేతులు చలికోటు జేబుల్లో పెట్టుకోక తప్పడం లేదు. అప్పుడే మంచు కురిసి ఆగిందేమో నదీ తీరమంతా తడితడిగా దిగబడుతోంది. ఆ చిత్తడిలోనే తెగ తిరిగి గొండాల రైడ్‌ (మన రోప్‌ వే టైపు) వైపు వచ్చాం. మంచులో కాసేపు ఆడి సెయిల్‌ బోటు వైపు బయలుదేరాం. ఇంతలో వాతావరణ శాఖ హెచ్చరిక.. సాయంత్రం 4, 5 గంటల మధ్య మంచు తుపాను ఉందంటూ.. రాత్రికి అక్కడుండే ఏర్పాటుతో రాలేదు. చూడాల్సినవి ఎక్కువ, సమయం తక్కువ. సెయిలింగ్‌ బోట్‌ వైపు పెద్ద క్యూ.. ఇక లాభం లేదనుకుని ముందుకొచ్చి గొండాల ఎక్కి మన హిమాలయాల్ని ఎక్కినంత సంతోషపడ్డాం. దిగుతూనే స్టార్‌బక్స్‌లో కాఫీ తీసుకుని కార్లో నెవెడా వైపు బయలు దేరాం. క్యాసినోలు, చలిమంటలు, చేతుల్లో బీర్లు, స్పోర్ట్స్‌ బార్లు, కార్లు కిటకిటలాడుతున్నాయి. నేరుగా సీక్రెట్‌ బీచ్, శాండ్‌హార్బర్‌ వైపు పోయాం. 50 డాలర్లు పెట్టి జట్కాబండెక్కి గంటపాటు షికార్‌ చేశాం. అక్కడున్న మ్యూజియం సహా మూడు నాలుగు చారిత్రక ప్రాంతాలు చూసి స్పూనర్‌ బ్యాక్‌ కంట్రీ మీదుగా మార్కెట్‌ ప్లేస్‌కి వచ్చాం. ’నార్త్‌ తాహో ఈట్స్‌’లో పిజ్జా బాగా ఫేమసట. లైన్లో అరగంట సేపు నిల్చున్నా ఫలితం లేకపోయింది. దీంతో వేరేవేవో కొనుక్కుని తింటూ ట్రీ హౌస్‌ చేరాం. అక్కడో గంట గడిపాం. ఫోటోలు, సెల్ఫీలు మామూలే. చిన్నగా సన్నటి తుంపర.. చేసేది లేక ఓ కోక్‌ కొనుక్కుని కారెక్కాం.. మంచులో జారిపోయే రోడ్డు దాటే పాటికి సాయంత్రం 5.50 అయింది. హమ్మయ్యా అంటూ ఘాట్‌ రోడ్‌ నుంచి బయటికొస్తుండగా మంచు ముంచెత్తడం మొదలైంది. కనీసం రెండు రోజులుంటే తప్ప చూడలేమనిపించింది. చల్లబడ్డ కాఫీనే కార్లో రుచి చూస్తూ, చూసిన వాటిని నెమరేసుకోవడం మొదలెట్టా..

    ఏడాది పొడవునా ఆటా, పాటా…
    లేక్‌ తాహోలో ఏడాది పొడవునా ఏదో ఒక ఆట, పాట ఉంటుంది. రెండు రాష్ట్రాల్లో కలిపి 24 బీచ్‌లు, 11 స్కీ రిసార్టులు, వందలాది కాలిబాటలు, కొన్ని వందల ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తున్న 12 పట్టణాలు ఫేమస్‌. చలికాలమైతే శీతాకాలపు ఆటలుంటాయి. ఎండాకాలమైతే క్యాంపింగ్‌లు, జంపింగ్‌లు, ఆరుబయట విందులు, వినోదాలు. బీచ్‌ పార్టీలు, ఇసుకలో పరుగులు, సొంతపడవుల్లో షికార్లు (కియాకింగ్‌), బార్బిక్కూలకు పెట్టింది పేరు. ఖాళీ ఉంటాయో లేదోనని మంచి రిసార్టుల్ని ఏడాది ముందే బుక్‌ చేసుకుంటుంటారు. తాహో సరస్సుపై సూర్యోదయాన్ని చూడడానికి పర్యాటకులు ఇష్టపడుతుంటారు. తేలిపోతున్న మంచు తెరల్లో పొద్దుపొడుపును చూసేందుకే రాత్రిళ్లు లేక్‌ తాహోలో గడుపుతారు. కాలిఫోర్నియాలో క్యాసినోలకు అనుమతి లేదు గనుక ఓ అడుగు అటేస్తే నెవెడాలో లేక్‌సైడ్‌ క్యాసినోలు, రిసార్ట్‌లు, బూజింగ్, లూజింగ్‌నూ అందిస్తుంది. హైవేలకు రెండు వైపులా 364 రోజులూ హోటళ్లు ఉంటాయి. ఎక్కువ మంచు పడి జామ్‌ అయితే తప్ప దార్లు ఎప్పుడూ రయ్‌రయ్‌ మంటూనే ఉంటాయి.

    చారిత్రక ప్రదేశాలు…
    తాహో సరస్సు బోలెడన్ని చారిత్రక ప్రాంతాల నిలయం. 19, 20వ శతాబ్దాల నాటి కట్టడాలనేకం ఉన్నాయి. చరిత్ర ప్రసిద్ధిగాంచిన జార్జ్‌ విట్టెల్‌ జూనియర్‌ నిర్మించిన థండర్‌బర్డ్‌ లాడ్జ్‌ ఇక్కడే ఉంది. ఎమరాల్డ్‌ బేలోని వైకింగ్‌షోల్మ్‌ స్థావరం, 38 గదులున్న ఐలాండ్‌æహౌస్, స్టేట్‌ పార్క్‌గా మారిన– వెల్స్‌ ఫార్గో బ్యాంక్‌ మాజీ ప్రెసిడెంట్‌ వేసవి విడిది, వుడ్‌ఫోర్డ్స్‌ స్టేషన్, ఫౌంటెన్‌ ప్లేస్‌ స్టేషన్‌ లాంటివనేకం ఉన్నాయి. వీటిని చూసేందుకు ప్యాకేజీలూ ఉన్నాయి.
    తాహోలో ఫాలెన్‌ లీఫ్‌ లేక్, సియెర్రా నెవాడా, ఎమరాల్డ్‌ బే, క్యాస్కేడ్‌ లేక్, సీక్రేట్‌ బీచ్, శాండ్‌బీచ్‌ వంటివి తప్పనిసరిగా చూడాల్సినవే. లేక్‌ తాహో చుట్టూ గోల్ఫ్‌ రిసార్టులు, స్కీయింగ్‌ రిసార్టులు, స్కీ స్లోప్స్, గొండాల రైడ్, సెయిల్‌ బోట్లు, మోటార్‌ సైక్లింగ్, జెపైర్‌ కోవ్, కేవ్‌ రాక్, కింగ్స్‌ బీచ్, డోనర్‌ లేక్, హైకింగ్, గాంబ్లింగ్, క్యాసినోలు (నెవెడా వైపు), బోటింగ్‌ హౌసులు సరేసరి..

    ts29 amaraiah
    లేక్ తాహో వద్ద వ్యాస రచయిత, సీనియర్ జర్నలిస్ట్ అమరయ్య దంపతులు

    అంత మంచున్నా ఎందుకు గడ్డకట్టదో!
    అంత మంచులోనూ తాహో సరస్సు గడ్డకట్టకపోవడం విశేషంగా అనిపించింది. దీని భౌతిక స్వ రూపమే అలాంటిదట. సరస్సు లోతు, భూగర్భ స్వరూపాల దృష్ట్యా నీళ్లు గడ్డకట్టవట. కానీ భూకంపాలు, సునామీలు వచ్చే అవకాశాలు ఎక్కువట. మంచు కురవడానికి కాలాలతో సంబంధం లేదు. సగటు వార్షిక హిమ పాతం 55 అంగుళాలు. సరస్సు సమీపంలో దాదాపు 26 అంగుళాలు. నవంబరు, ఏప్రిల్‌ మధ్య చాలా ఎక్కువ మంచు కురుస్తుంది. మంచు తుపాన్లూ వస్తుంటాయి. బాగా ఎంజాయి చేయడానికి అనువైన నెల ఆగస్టు అనువైన నెలట. వాతావరణం మామూలుగా ఉంటుందట. ఇలా ఎన్నో ప్రత్యేకతలున్న లేక్‌ తాహోకీ అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం తప్పలేదు.
    మనకున్నట్టే నదీ జలాల గొడవలూ ఉన్నాయి. మన మాదిరే కాలిఫోర్నియా, నెవేడా రాష్ట్రాలు సుప్రీంకోర్టుకెళ్లాయి. శతాబ్దాలుగా నడుస్తోంది.

    ఇలా మనం డెవలప్‌ చేయలేమా?
    మనకీ బోలెడన్ని మంచు కొండలు, పర్వతాలున్నాయి. ఎంతో అబ్బురపరిచే హిమాలయాలున్నాయి. అయితే అవేవీ సామాన్యులకు అందుబాటులో ఉండవు. పోవడానికి దారీ తెన్నూ ఉండదు. ఒకవేళ వెళ్లినా ఎక్కువ సేపు గడిపేందుకు ఏమీ ఉండదు. ఎక్కడేముందో సమాచారముండదు. బద్రీనాద్‌ మొదలు భద్రాచలం వరకు ఇదే తీరు. కనీస వసతులతో పాటు పవిత్ర క్షేత్రాల చుట్టూ ఏదోక వ్యాపకాన్ని ఏర్పాటు చేయందే యువతకు హిమాలయాల గొప్పతనం ఎలా తెలుస్తుందీ, ‘ఇండియా వచ్చి వెన్నెల్లో కాసేపు చెట్లను ముద్దాడేది?’ ఎలా తెలుస్తుందీ..!

    అమరయ్య ఆకుల
    సీనియర్‌ జర్నలిస్ట్‌
    +919347921291

    akula amaraiah article lake tahoe USA popular lake
    Previous Article‘పొంగులేటి’ శపథం
    Next Article ఖాళీ ‘జాగా’ కనిపిస్తే మనోళ్లు ఏం చేస్తారు..? అమెరికాలో అయితే అట్లుంటది మరి!

    Related Posts

    ఖాళీ ‘జాగా’ కనిపిస్తే మనోళ్లు ఏం చేస్తారు..? అమెరికాలో అయితే అట్లుంటది మరి!

    March 6, 2023

    Comments are closed.

    https://www.youtube.com/watch?v=Xvn_15BR5TY
    https://www.youtube.com/watch?v=5BiOy1tW780
    Facebook Twitter YouTube
    • Privacy Policy
    • Disclaimer
    • About Us
    © 2023 ts29.in

    Type above and press Enter to search. Press Esc to cancel.