తెలంగాణా రాజకీయాల్లో ఇది తాజా పరిణామం. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తాజా అడుగులు చర్చనీయాంశంగా మారాయి. పొంగులేటి సహా ఏడుగురు నాయకులు, వ్యక్తులు ప్రస్తుతం రాష్ట్రంలో లేరు. సోమవారం సాయంత్రం వరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించిన పొంగులేటి ఉన్నఫళంగా ఇతర రాష్ట్రాల్లో పర్యటించడానికి గల కారణాలేమిటి? ఇదీ తాజా చర్చ.
నిన్న సాయంత్రం వరకు కూడా ఖమ్మం జిల్లా కేంద్రంలో పర్యటించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి అకస్మాత్తుగా ఇతర రాష్ట్రాల పర్యటనకు ఎందుకు వెళ్లినట్లు? రాజకీయ పరిశీలకుల్లో తొలుస్తున్న ప్రశ్న. నిన్న కల్లూరులో సత్తుపల్లి నియోజకవర్గ ఆత్మీయ సమ్మేళనం నిర్వహణ సన్నాహక సమావేశం అనంతరం ఖమ్మం నగరంలో పర్యటించిన పొంగులేటి ప్రస్తుతం ఎక్కడ ఉన్నారు? వివిధ వార్తా కథనాల ప్రకారం ఆయన ఢిల్లీకి వెడుతున్నారా? తమిళనాడులోని అరుణాచలంలో గిరిప్రదక్షిణ అనంతరం పొంగులేటి ఢిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వంలోని ఓ ముఖ్య నేతను కలవబోతున్నారా?
ఇంతకీ పొంగులేటి ఢిల్లీకి ఎందుకు వెడుతున్నట్లు? రాజకీయంగా ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నట్లు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుయాయుల్లో, అనుచరుల్లో ఇవే ప్రశ్నలపై భిన్న చర్చ జరుగుతోంది. పొంగులేటి వెంట భద్రాద్రి జిల్లా జెడ్పీ చైర్మెన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య సహా ఆరుగురు వ్యక్తులు ఉన్నారు. అయితే ఈ ఆరుగురిని వెంటేసుకుని ఇతర రాష్ట్రాల్లో పర్యటిస్తూ పొంగులేటి చేస్తున్న తాజా రాజకీయం ఏమిటనేది అంతుబట్టడం లేదని ఆయన అభిమానులే చర్చించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం పొంగులేటి, ఆయన వెంట ఉన్న ముఖ్యనేతలు కొందరు ఎక్కడ ఉన్నారనేది అసలు చర్చ. నిజానికి పొంగులేటి దైవదర్శనం కోసం తమిళనాడులోని అరుణాచలం వెళ్లారని ఆయన అనుచరగణం చెబుతోంది. కేవలం దైవదర్శనం, అరుణాచలస్వామి గిరిప్రదక్షిణ మినహా మరే ఇతర కార్యక్రమం లేదని చెబుతున్నారు. అంతేగాక ఇతర రాష్ట్రాల్లో తన కంపెనీలకు గల కాంట్రాక్టు పనులను పర్యవేక్షించేందుకు పొంగులేటి వెళ్లారని, ఆయన వెంట కొందరు నాయకులు కేవలం సైట్ సీయింగ్ కోసమే వెళ్లారని చెబుతున్నారు.
మరోవైపు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా నాయకులు, ఇతర వ్యక్తులు మొత్తం ఏడుగురు అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. తొలుత పాండిచ్చేరి, అక్కడి నుంచి అరుణాచల్ ప్రదేశ్ వెళ్లినట్లు ప్రచారపు సారాంశం. ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, ఆ పార్టీ ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ కె. రమేష్, సత్తుపల్లి బీజేపీ నేత నంబూరి రామలింగేశ్వరరావు సహా ఐదుగురు బీజేపీ ముఖ్య నేతలు కూడా అరుణాచల్ ప్రదేశ్ లోనే ఉన్నారు. అయితే తమ నాయకులు అస్సాంలోని ‘కామాఖ్య’ మాత శక్తిపీఠాన్ని దర్శించుకునేందుకు మాత్రమే వెళ్లారని స్థానిక బీజేపీ నాయకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ కు ఎందుకు వెళ్లినట్లు? ఖమ్మం జిల్లా బీజేపీ నేతలు ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ లో మకాం వేయడం యాదృచ్చికమేనా? మరే ఇతరత్రా రాజకీయ ప్రాధాన్యత ఉందా? ఇంతకీ పొంగులేటి అరుణాచల్ ప్రదేశ్ కు వెళ్లారా? తమిళనాడులోని అరుణాచలం క్షేత్ర దర్శనానికి వెళ్లారా? ఇవీ తాజా ప్రశ్నలు. మొత్తంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రతి కదలిక ప్రస్తుతం తెలంగాణా రాజకీయాల్లో హాట్ టాపిక్.