ఉద్యోగాలు, జ్యోతిష్యం పేరుతో నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేసిన ఓ ఘరానా మోసగాడి కేసు ఖమ్మం జిల్లాలో ప్రకంపనలు కలిగిస్తోంది. ఈకేసులో ఖమ్మం వన్ టౌన్ పోలీసులు అప్పట్లో సరైన రీతిలో స్పందించలేదా? అదే జరిగితే అందుకు మోకాలొడ్డిన ‘పింక్’ మీడియా జర్నలిస్ట్ ఎవరు? మోసపోయిన మహిళకు న్యాయం చేయాల్సిన ఓ అధికారి తీరు కూడా వివాదాస్పదమైందా? అందువల్లే అకస్మాత్తుగా ఆయనపై ఉన్నతాధికారులు శాఖాపరమైన చర్య తీసుకున్నారా? ఇవీ ఇప్పుడు తలెత్తుతున్న సందేహాలు.
విషయంలోకి వెడితే… విజయవాడ నగరంలోని భవానీపురానికి చెందిన కె. అచ్చిరెడ్డి అనే వ్యక్తిని నల్లగొండ పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. నిరుద్యోగులను, మహిళలను వంచించిన ఘటనలో పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం… నల్లగొండ పట్టణానికి చెందిన సామినేని సాయి అనే వ్యక్తిని మోసగించిన కేసులో అచ్చిరెడ్డి అరెస్టయ్యాడు. నిందితుడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ మహిళకు సాఫ్ట్ వేర్ కంపెనీలో షేర్లు ఇస్తానని నమ్మించి రూ. 50 లక్షల మేరకు మోసం చేశాడు. రైల్వేలో ఉద్యోగం ఇప్పిస్తానని మరో మహిళను, టీవీ యాంకర్ గా చేస్తానని ఇంకో మహిళను అచ్చిరెడ్డి మోసగించాడని పోలీసులు ప్రకటించారు. ఖమ్మం, విజయవాడ, నల్లగొండ జిల్లాల్లో నిందితుడు అచ్చిరెడ్డిపై ఈ తరహా మోసం కేసులు 12 వరకు నమోదైనట్లు కూడా ప్రకటించారు.
అయితే నల్లగొండ పోలీసులు అరెస్ట్ చేసిన అచ్చిరెడ్డి మోసపు ఘటన ఇప్పుడు ఖమ్మం జిల్లాలోనూ భారీ ప్రకంపన కలిగిస్తోంది. తనను పెద్ద ఎత్తున మోసగించిన ఘటనలో ఖమ్మం వన్ టౌన్ పోలీసులను బాధిత మహిళ గతంలోనే ఆశ్రయించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఛీటింగ్ కేసులో ‘పింక్’ మీడియాకు చెందిన జర్నలిస్ట్ ఒకరు జోక్యం చేసుకుని మహిళకు న్యాయం జరగకుండా అడ్డుకున్నారనే ప్రచారం తాజాగా జరుగుతోంది. తాను పోలీసులతో మాట్లాడి న్యాయం చేస్తానని సదరు జర్నలిస్ట్ మహిళను నమ్మించినట్లు జరుగుతున్న ప్రచారంలో ఓ భాగం. ఈమేరకు ‘పింక్’ మీడియా జర్నలిస్ట్ ఘటనను తనకు అనుకూలంగా మల్చుకుని, విజయవాడకు వెళ్లి నిందితుడైన అచ్చిరెడ్డితో సంప్రదింపులు చేశాడని, ఖమ్మం మీడియా దృష్టికి మోసపు అంశం వచ్చిందని నిందితునితో బేరసారాలకు దిగి, భారీ ఎత్తున ఆర్థికంగా లబ్ధి పొందాడనే ప్రచారం గతంలోనే జరగడం గమనార్హం.
ఈ నేపథ్యంలో వంచనకు గురైన మహిళకు సరైన న్యాయం జరగలేదనే వాదన వినిపిస్తుండగా, నిందితున్ని అరెస్ట్ చేయడంలో ఖమ్మం వన్ టౌన్ పోలీసులు ఎందుకు చొరవ చూపలేకపోయారనే సందేహాలు కూడా తాజాగా వ్యక్తమవుతున్నాయి. గతంలో వన్ టౌన్ లో పనిచేసిన ఓ అధికారిని పోలీసు ఉన్నతాధికారులు అకస్మాత్తుగా స్థానభ్రంశానికి గురి చేయడం ఈ సందర్భంగా గమనార్హం. ఆయా అధికారిపై శాఖాపరంగా ఉన్నతాధికారులు ఉన్నట్టుండి చర్యలు తీసుకోవడానికి, వంచనకు గురైన మహిళ ఘటనకు ఏదేని సంబంధం ఉందా? ఈ కేసులో ‘పింక్’ మీడియాకు చెందిన ఓ జర్నలిస్ట్ నిర్వహించిన వివాదాస్పద పాత్ర ఏమిటి? అనే ప్రశ్నలపైనా భిన్న ప్రచారం జరుగుతోంది. మొత్తంగా అచ్చిరెడ్డి అరెస్ట్ వ్యవహారం ‘పింక్’ మీడియాకు చెందిన ఓ జర్నలిస్ట్ మెడకు చుట్టుకోనుందనేది తాజాగా జరుగుతున్న ప్రచారం.