కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. కరోనా వ్యాక్సిన్ తయారీలో పలు ఫార్మా కంపెనీలు ఎంతో శ్రమిస్తున్నాయి కూడా. అనేక కంపెనీల వ్యాక్సిన్లు వివిధ దశల ప్రయోగాల్లో ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ప్రముఖ ఫార్మా కంపెనీ ‘ఫైజర్’ ప్రకటించిన కరోనా వ్యాక్సిన్ మన దేశానికి రావడం కష్టమేనా? ఇవీ తాజా సందేహాలు. ఇప్పటి వరకు ప్రకటించిన కరోనా వ్యాక్సినల్లో ‘ఫైజర్’ కంపెనీ వ్యాక్సిన్ అత్యుత్తమైనదిగా వార్తలు రావడం గమనించాల్సిన అంశం.
అంతర్జాతీయ స్థాయిలో కరోనా వ్యాక్సిన్లపై జరుగుతున్న ట్రయల్స్ లో ‘ఫైజర్’ కంపెనీ స్థాయి సక్సెస్ రేట్ ను ఎవరూ సాధించలేదని వెల్లోరు సీఎంసీ మైక్రో బయాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్న సైంటిస్ట్ గగన్ దీప్ కాంగ్ మీడియాకు చెప్పారు. నాలుగో దశ ట్రయల్స్ లో 90 శాతం సక్సెస్ అంటే, అది సాధారణ విషయం కాదని ఆమె పేర్కొన్నారు. ఇంతగా సక్సెస్ రేట్ సాధించిన ‘ఫైజర్’ కంపెనీ వ్యాక్సిన్ ధర డోస్ ధర అమెరికాలో 37 డాలర్లు (సుమారు రూ. 2,752)గా కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. ఇండియాకు వచ్చే సరికి దీని ధర ఇంకాస్త పెరగవచ్చని అంటున్నారు. అయితే ఈ వ్యాక్సిన్ ఇండియాకు వచ్చే అవకాశాలపైనే అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సైంటిస్ట్ గగన్ దీప్ కాంగ్ కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు.
‘ఫైజర్’ వ్యాక్సిన్ ను రైబో న్యూక్లియక్ యాసిడ్ (ఆర్ఎన్ఏ) తో తయారు చేశారట. ఇండియాలో మాత్రం డీ యాక్సియోరైబో న్యూక్లియక్ యాసిడ్ (డీఎన్ఏ) నుంచి తయారు చేసిన వ్యాక్సిన్లకు మాత్రమే అనుమతి ఉందట. అందువల్ల ఆర్ఎన్ఏ తో తయారైన ‘ఫైజర్’ కంపెనీ వ్యాక్సిన్ ఇండియాకు వచ్చే అవకాశమే లేదంటున్నారు. అంతేగాక ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ డోస్ ను నిరంతరం మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చాలని, అటువంటి శీతలీకరణ వ్యవస్థ ఇండియా ల్యాబుల్లోనేకాదు, ఆసుపత్రుల్లో కూడా లేదని జర్మన్ లాజిస్టిక్ సంస్థ డీహెచ్ఎల్ చెబుతోంది. మన దేశమే కాదు దక్షిణ అమెరికా, ఆసియా, ఆఫ్రికా దేశాల్లోనే ‘ఫైజర్’ కంపెనీ తయారు చేసిన కరోనా వ్యాక్సిన్ ను భద్రపరిచే ‘ఫ్రీజర్’ వ్యవస్థ లేదని డీహెచ్ఎల్ కథనం సారాంశం.
‘ఫైజర్’ కంపెనీ రూపొందించిన వ్యాక్సిన్ కోసం భారతీయులు కూడా ఆశలు పెట్టుకున్న పరిస్థితుల్లో ఆర్ఎన్ఏ, డీఎన్ఏ వ్యవస్థలు, మైనస్ 70 డిగ్రీల ఉష్ణోగ్రత వంటి అంశాలు నిరాశనే కలిగిస్తున్నాయని చెప్పక తప్పదు. కానీ ఆర్ఎన్ఏతో వ్యాక్సిన్ తయారు చేయగలిగినపుడు డీఎన్ఏ చేయడం పెద్ద కష్టం కాకపోవచ్చని కూడా సైంటిస్ట్ గగన్ దీప్ కాంగో అంటున్నారు. అందుకు అనుగుణంగా పరిస్థితులు అనుకూలించాలని మనమూ కోరుకుందాం. ‘ఫైజర్’ వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూద్దాం.