ఫొటోలో మీరు చూస్తున్న పురుగులు మన వద్ద కనిపించే ‘నల్లి’లా ఉన్నాయ్ కదూ? ‘టిక్’గా పిలిచే ఈ పురుగులే ఇప్పుడు చైనాను మరింతగా భయపెడుతున్నాయి. ఎందుకంటే ‘కరోనా వైరస్’ను ప్రపంచానికి పరిచయం చేసిన చైనాలో ఈ పురుగు ద్వారానే మరో కొత్త వైరస్ పుట్టడమే ఇందుకు ప్రధాన కారణం. దీన్ని నావెల్ బునియాగా వ్యవహరిస్తున్నారు. ఈ వైరస్ బారినపడి ఇప్పటికే ఏడుగురు తమ ప్రాణాలు కోల్పోగా, మరో 60 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా వైరస్ కన్నా డేంజర్ స్థాయిలో ఇది ప్రజలకు సోకుతోందని చైనా అధికారి పత్రిక గ్లోబల్ టైమ్స్ వార్తా కథనాన్ని ప్రచురించింది.
చైనాలోని తూర్పు జియాంగ్స్ ప్రావిన్స్ రాజధానిలో 37 మందికి ఈ వైరస్ సోకిందట. ఆ తర్వాత తూర్పు చైనాలోనే అన్హోయ్ ప్రావిన్స్ లో మరో 23 మంది ఈ వైరస్ బారిన పడినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి. ఇందులో ఏడుగురు ఇప్పటికే తమ ప్రాణాలను కోల్పోయారు. వాస్తవానికి తొలుత జియాంగ్స్ ప్రావిన్స్ లోని నాన్జింగ్ లో ఓ మహళకు వైరస్ సోకి తీవ్రమైన జ్వరం, దగ్గుతో ఆసుపత్రిలో చేరగా, ఆమెలో తెల్లరక్త కణాలు గణనీయంగా తగ్గిపోయినట్లు డాక్టర్లు గుర్తించారు. అయితే నెలరోజుల చికిత్స తర్వాత ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్చి అయ్యారు.
నావెల్ బునియా వైరస్ బునియా వైరస్ కేటగిరీకి చెందినదేనని, 2011లోనే చైనా దీన్ని కనుగొన్నట్లు వార్తా సంస్థల కథనం. నల్లి మాదిరిగా ఉండే ‘టిక్’ అనే పురుగు ద్వారా ఈ వైరస్ మనుషులకు సోకుతోందట. అనంతరం మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తోందట. రక్తం, కళ్లె నుంచి కూడా వైరస్ వ్యాప్తి చెందుతోందని ఝియాంగ్ యూనివర్సిటీ వైద్యులు చెబుతున్నారు. అయితే టిక్ పురుగు కుడితేనే ఈ వైరస్ మనిషికి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. ఇంటర్నేషనల్ జర్నీపై ఆంక్షల కారణంగా చైనా నుంచి సులభంగా ఈ వైరస్ వ్యాప్తి చెందకపోవచ్చని కూడా అంచనా వేస్తున్నారు.