పక్క, పక్కనే గల ఈ రెండు చిత్రాలను జాగ్రత్తగా గమనించండి. ఉత్తర కొరియా సుప్రీం లీడర్ ‘కిమ్ జోంగ్ ఉన్’ ఫొటోలివి. ఆయన పలు వరుసను నిశితంగా పరిశీలించండి. ఏదో తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదూ? ఇప్పుడు ఈ రెండు ఫొటోలు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆకస్మాత్తుగా అదృశ్యమైన కిమ్ దాదాపు మూడు వారాల అనంతరం ఈనెల 2వ తేదీన ప్రజల ముందుకు వచ్చినట్లు ఉత్తర కొరియా అధికారిక మీడియా సంస్థ ‘కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ (కేసీఎన్ఏ) కొన్ని ఫొటోలను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
ఉత్తర కొరియా రాజధాని సమీపంలోని సన్ చాన్ నగరంలో నిర్మించిన ఓ ఎరువుల కర్మాగారం కార్యక్రమంలో కిమ్ పాల్గొన్నారని కేసీఎన్ఏ నివేదిస్తూ, అందుకు సంబంధించిన ఫోటోలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే ‘కిమ్’తో తాను ఈ వారంలో మాట్లాడే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రకటించారు. కానీ కిమ్ ప్రత్యక్షంపై తాజాగా ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. ఎరువుల ఫ్యాక్టరీ కార్యక్రమంలో పాల్గొన్న కిమ్ ఒరిజినల్ కాదని, అతని పోలికలతో ఉన్న మరో వ్యక్తి (డూప్)గా సోషల్ మీడియాలో పాత ఫొటోలతో నెటిజన్ల పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. గతంలో తాను తీసుకున్న ఫొటోలతో పోల్చి చూస్తే కిమ్ పలు వరుసతో తేడా కనిపిస్తోందని బ్రిటిష్ మాజీ సభ్యురాలు లూయిస్ మెన్చ్ రెండు ఫొటోలను జత చేస్తూ ట్వీట్ చేయడం గమనార్హం. దీంతో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది.
ప్రస్తుతం ఇదే అంశంపై జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు పుంఖాను పుంఖాలుగా వార్తలను ప్రచురిస్తున్నాయి. సద్ధాం హుస్సేన్, హిట్లర్ వంటి నాయకులు జనబాహుళ్యంలోకి వచ్చే సందర్భంగా తమ పోలికలతో గల ‘డూప్’లను మాత్రమే పంపేవారని ప్రతీతి. శత్రు దేశాలు తమను అంతమొందించడానికి ఏదేని పథక రచన చేస్తే ‘ఒరిజినల్ లీడర్ సేఫ్’గా ఉండాలనే లక్ష్యంతో సద్దాం, హిట్లర్ వంటి నాయకులు తరచూ డూపులను రంగంలోకి దించేవారట. ప్రస్తుతం కిమ్ కూడా అదే తరహాలో వ్యవహరించారా? తన ఆరోగ్యంపై రకరకాల వార్తలు వచ్చిన నేపథ్యంలో భిన్న ప్రచారాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కిమ్ ‘డూప్’ వ్యూహం పన్నారా? ఇవీ అంతర్జాతీయంగా తాజా సందేహాలు. ఈ వారంలో ట్రంప్ కిమ్ తో మాట్లాడితే అసలు విషయం వెలుగులోకి రావచ్చనేది కూడా ఓ అంచనా. లేదంటే ఈ డూప్ వార్తల నేపథ్యం మరింతగా కొనసాగే అవకాశం లేకపోలేదు.