ఔను… చైనా నుంచి తమ దేశంలోకి వచ్చే వ్యక్తులపై ‘కనిపిస్తే కాల్చివేత’ ఉత్తర్వులను ఉత్తర కొరియా ప్రభుత్వం జారీ చేసింది. ఈమేరకు ప్రభుత్వం తమకు ఆయా అధికారాన్ని ఇచ్చిందని కొరియాలో అమెరికా బలగాలకు కమాండర్ గా వ్యవహరిస్తున్న రాబర్ట్ అబ్రహాం వెల్లడించినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయి. ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం తీసుకున్న ఈ తీవ్ర చర్యలు ప్రపంచ వ్యాప్తంగా సంచలన కలగిస్తున్నాయి. చైనా నుంచి ఉత్తర కొరియాలోకి వచ్చే వ్యక్తులపై ‘షూట్-టు-కిల్’ ఆర్డర్ జారీ చేసినట్లు రాబర్ట్ అబ్రహాం స్వయంగా వెల్లడించడం గమనార్హం.
కరోనా వైరస్ కట్టడిలో భాగంగానే ఉత్తర కొరియా ప్రభుత్వం ఈ ఉత్తర్వు జారీ చేసినట్లు తెలుస్తోంది. చైనా సరిహద్దులను గత జనవరిలోనే ఉత్తర కొరియా మూసేసింది. భద్రతను కూడా పెంచారు. అంతేగాక ప్రత్యేక కార్యకలాపాల భద్రతా దళాలను సరిహద్దుల్లో మోహరింపజేసి, వారికి చైనా నుంచి వచ్చేవారు ‘కనిపిస్తే కాల్చివేత’ అధికారాలను ఇచ్చిందని రాబర్ట్ అబ్రహాం ఓ సమావేశంలో పేర్కొన్నారు. చైనా-ఉత్తర కొరియా సరిహద్దుల్లో కిలోమీటర్ పరిధిలో గల వ్యక్తులు అక్కడ ఉండడానికి కారణాలతో సంబంధం లేకుండానే వారిని చంపే అధికారాన్ని కిమ్ ప్రభుత్వం ఆయా భద్రతా బలగాలకు సంక్రమింపజేసినట్లు తాజా వార్తల సారాంశం.