ఔను…కలెక్టర్ నారాయణరెడ్డి ‘పని రాక్షసుడు.’ ఎంతగా అంటే అర్థరాత్రి, అపరాత్రి, తెల్లవారు జామున అనే కాల వ్యవధి ఏమీ ఉండదు. ఎప్పుడైనా, ఎక్కడికైనా సెక్యూరిటీ లేకుండా వెళ్లి ప్రభుత్వ సిబ్బంది ఎలా పని చేస్తున్నారో స్వయంగా చూడనిదే ఆయనకు సంతృప్తి కలగదు. పనిలో పనిగా వినూత్న ఆలోచనలు కూడా చేస్తుంటారు. ప్లాస్టిక్ భూతాన్ని ప్రజలు అసహ్యించుకోవడానికి ప్లాస్టిక్ కాళకేయుడిని రూపొందించి ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లి గుడి వద్ద ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే కదా? మేడారం జాతరకు వచ్చే కోటిన్నరకు పైగా మంది సమ్మక్క-సారలమ్మ తల్లుల భక్తులు ఈ కాళకేయుని రూపాన్ని అసహ్యించుకున్న పద్ధతిలోనే ప్లాస్టిక్ ను ప్రజలు ఏవగించుకోవాలన్నది ఆయన అభిమతం. అంతేకాదు తెలంగాణా ప్రభుత్వం ఇటీవల పల్లెల పరిశుభ్రత కోసం అమలు చేసిన 30 రోజుల ప్రణాళికను ఈ ఐఏఎస్ అధికారి అందరికన్నాముందు అమలు చేశారు. ‘ములుగు-వెలుగు’ పేరుతో ఆయన ప్రతి పల్లెను శుభ్రం చేయించారు. సర్పంచ్ లను, గ్రామ కార్యదర్శులను బాధ్యులను చేశారు. నేరుగా చెప్పాలంటే.. పల్లెల పారిశుధ్యం కోసం ప్రభుత్వం అమలు చేసిన 30 రోజుల పల్లెప్రగతి కార్యక్రమానికి కలెక్టర్ నారాయణరెడ్డి నిర్వహించిన ‘ములుగు-వెలుగు’ ప్రేరణ అంటే అతిశయోక్తి కాదు.

కలెక్టర్ నారాయణరెడ్డి ఏర్పాటు చేయించిన ప్లాస్టిక్ కాలకేయుడు (ఫైల్ ఫొటో)

అంతేకాదు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే పేరుతో రెవెన్యూ అధికారులు నిర్వహిస్తున్న గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని పల్లె స్థాయిలో అమలు చేసిన ఘనత కూడా నారాయణరెడ్డిదే. గ్రామ కార్యదర్శిని కో-ఆర్డినేటర్ గా నియమించి ప్రతి పల్లెలో ఆయన ‘ప్రజావాణి’ కార్యక్రమాన్ని ములుగు జిల్లాలో నిర్వహించారు. ఈ తరహాలో పనిచేస్తున్న అధికారుల వల్ల ప్రభుత్వానికి మంచి మైలేజీ వస్తుంది కదా? అందుకే కాబోలు నిజామాబాద్ జిల్లా మంత్రి ప్రశాంత్ రెడ్డితోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత నారాయణరెడ్డిని తమ జిల్లాకు బదిలీ చేయించుకున్నట్లు ప్రచారం ఉంది. మేడారం జాతర ఏర్పాట్లలో బిజీగా ఉన్న ములుగు కలెక్టర్ నారాయణరెడ్డిని కేవలం తొమ్మది నెలల పదవీ కాల వ్యవధిలోనే ఆకస్మికంగా బదిలీ చేసి నిజామాబాద్ కు ఎందుకు తీసుకువెళ్లారంటే…

ఇదిగో ఆయన ఇలా పనిరాక్షసుని అవతారం ఎత్తుతారు కాబట్టే. ఇంతకీ ఆయన ఏం చేశారో తెలుసా? ఎటువంటి సెక్యూరిటీ లేకుండా సైకల్ పై నిజామాబాద్ నగర వీధుల్లో సవారీ చేసి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. తాను బస చేస్తున్న ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్ నుంచి బయలుదేరి, ఎవరికీ కనీస సమాచారం లేకుండా ఎన్టీఆర్ చౌరస్తా, బస్ స్టాండ్ మీదుగా ఆసుపత్రికి వెళ్లి ఆకస్మిక తనిఖీ చేశారు. ఉదయం పూట విధుల్లో ఉండాల్సిన డాక్టర్లు, సిబ్బంది డుమ్మా కొట్టినట్లు కలెక్టర్ నారాయణరెడ్డి ఆకస్మిక తనిఖీలో వెల్లడైంది. దీంతో వారికి మెమోలు జారీ చేయాలని సంబంధిత వైద్య, ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ నారాయణరెడ్డి సైకిల్ పై వెళ్లి ఆసుపత్రి తీరు తెన్నులను పరిశీలించి, తనిఖీ చేసిన దృశ్యాలను దిగువన స్లైడ్ షో లో చూడండి.

1 / 11

Comments are closed.

Exit mobile version