తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లు అనవసరంగా ఆడిపోసుకుంటారు గాని, ఆయనకున్న విజన్ ను వీళ్లు సరిగ్గా అర్థం చేసుకున్నట్లు లేదు. ఓ మంత్రిగా, ముఖ్యమంత్రిగా, విపక్ష నేతగా, మాజీ ముఖ్యమంత్రిగా, ఓ జాతీయ పార్టీ అధ్యక్షునిగా ఒకటీ, రెండూ కాదు ఏకంగా 40 ఏళ్ల అపార రాజకీయ అనుభవం గల నేత. విజన్-2020 అనగానే ఠక్కున స్ఫురణకు వచ్చే నామధేయం. ఇటువంటి అనేక క్వాలిఫికేషన్లు ఉన్న నాయకుడు చంద్రబాబు తాజాగా ఏమంటున్నారో తెలుసా? రాజధాని గురించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించిన జీఎన్ రావు ఎవరు? పెద్ద ఎక్స్ పర్టా? ఆయన ఎక్కడి నుంచైనా ఊడిపడ్డారా?గ్రూప్-1 ఆఫీసర్ ను పెట్టుకుని నాటకాలాడతారా? జీఎన్ రావుతో మీరే రిపోర్ట్ రాయించారని అర్థమవుతోంది. నా మీద కోపంతో రాష్ట్రానికి అన్యాయం చేస్తారా? మీకు సిగ్గు లేకపోవచ్చు. ప్రజలకు సిగ్గుంది. రాజకీయ కక్షతో అమరావతిని మారుస్తారా? ఆయ్…? అని చంద్రబాబు తాజాగా ఎడాపెడా విమర్శల వర్షం కురిపించారు.

కానీ అంతకు కొద్ది గంటల ముందే అమరావతిలో రాజధాని విషయంలో మంత్రి వర్గ సమావేశం అనంతరం ఏపీ సమాచార శాఖ మంత్రి పేర్ని నాని ఏమన్నారో ఓసారి పరిశీలిద్దాం. రాజధాని అంశానికి సంబంధించి జీఎన్ రావు, బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ) నివేదికలపై హైపర్ కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రివర్గం నిర్ణయించినట్లు ప్రకటించారు. మంత్రివర్గం సమావేశంలో చర్చించిన అనేక అంశాల గురించి ఆయన వివరించారు. వాటిలో పేర్ని నాని చెప్పిన ఓ ముఖ్యమైన అంశాన్ని జాగ్రత్తగా చదవండి.

శివరామకృష్ణ కమిటీని కాదని అప్పటి మంత్రి నారాయణ కమిటీని గత ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఈ కమిటీ నివేదిక ఆధారంగా రాజధానికి భూ సమీకరణ చేశారని పేర్ని నాని చెప్పారు.  ప్రాథమికంగా 32 వేల ఎకరాలు, మరో 20 వేల ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేయాలని అప్పట్లో నిర్ణయించారని, వాస్తవాలను విస్మరించి గత ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి సంకల్పించిందన్నారు. రూ.లక్షా 9 వేల కోట్ల పెట్టుబడులు అవసరమని భావించి, కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారని, అనుభవజ్ఞులైన గత సీఎం రూ. లక్ష కోట్లు అప్పు తెస్తామని కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే తేగలిగారన్నారు. రూ. లక్ష కోట్లు తేవాలంటే ఎంతకాలం పడుతుందో ప్రజలు అంచనా వేసుకోవాలని మంత్రి కోరారు.

ఓకే కేవలం రూ. 5 వేల కోట్ల అప్పు పుట్టించడానికి అయిదేళ్ల వ్యవధి పడితే లక్ష కోట్ల అప్పునకు ఎంత కాలం పడుతుందన్నదే మంత్రి గారి ప్రశ్న కదా? సింపుల్ రూ. పది వేల కోట్లకు పదేళ్లు, లక్ష కోట్లకు అక్షరాలా వందేళ్ల వ్యవధి పడుతుంది. అందుకే కాబోలు చంద్రబాబు రాజధాని విషయంలో అటు బోయపాటిని, ఇటు రాజమౌళి వంటి ప్రముఖ సినీ దర్శకులను పిలిపించి రాజధాని ఎలా ఉండాలనే అంశంపై మల్లగుల్లాలు పడ్డారు. ఈలోపే ఎన్నికలు వచ్చి ప్రజలు ఆయనను సీఎం సీటు నుంచి దించేసిన పరిస్థితి. వందేళ్ల విజన్ తో రాజధాని అంచనాలను రూపొందించిన చంద్రబాబు ఎన్నో కలలు కని ఉండవచ్చు.. వాటిని నిజం చేసుకుందామని. కానీ ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఆయన కలలు కల్లలుగా మారాయన్నది తెలిసిందే.

సరే.. చంద్రబాబు సంగతి కాసేపు పక్కన పెట్టండి. మంత్రి పేర్ని నాని మరిన్నివిషయాలు సెలవిచ్చారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులకు మరో రూ.లక్ష కోట్లు అవసరం ఉన్నట్లు ప్రకటించారు. ఆస్పత్రుల అభివృద్ధికి రూ.14వేల కోట్లు, పాఠశాలల అభివృద్ధికి రూ.12 వేల కోట్లు, అమ్మ ఒడి పథకానికి రూ.6 వేల కోట్ల చొప్పున చాలా నిధుల అవసరం ఉందని మంత్రి వివరించారు. సంక్షేమం, ప్రజారోగ్యం, అభివృద్ధి పక్కనబెట్టి రాజధాని నిర్మాణం చేసే పరిస్థితి వస్తే హైదరాబాద్, చెన్నయ్, బెంగళూరు వంటి నగరాలతో ఎప్పటికి పోటీ పడగలం? అనే చర్చ మంత్రి వర్గంలో జరిగినట్లు వివరించారు. అంటే ఆ స్థాయి రాజధాని నిర్మాణానికి సరిపడా సొమ్ములు లేవని పరోక్షంగా స్పష్టం చేసినట్లేగా? నిజమే.. డబ్బు లేనప్పుడు డాంబికాలకు పోవలసిన అవసరం లేదు. మరో నాలుగు నెలలైతే ఏపీ ప్రజలు మీకు అధికారాన్ని అప్పగించి అప్పుడే ఓ ఏడాది కూడా ముగుస్తుంది. ఇక మిగిలేది నాలుగేళ్లే. చివరి ఏడాది ఎన్నికల సంవత్సరంగానే భావిస్తారు. అందువల్ల ఆయా లెక్కల ప్రకారం మీకు మిగిలింది మూడేళ్లే. రాజధాని అంశాన్ని అదే పనిగా సా…గదీయకుండా ఏదో ఒకటి తేల్చేయండి సార్. ఎందుకంటే ‘మేమే తేగలిగినంత తెచ్చాం’ ఇంకెవరు అప్పు ఇస్తారని గత ఆర్థిక మంత్రి వ్యాఖ్యానించినట్లు కూడా మీరే సెలవిచ్చారు. ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, రాయలసీమ నీటిపారుదల ప్రాజెక్టులకు  రూ. లక్ష కోట్ల అవసరం ఎలా తీరుతుందో ఏమో? 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 100 ఇయర్స్ విజన్ గల చంద్రబాబునాయుడికే రూ. 5 వేల కోట్ల అప్పునకు అయిదేళ్ల సమయం తీసుకుంది. మరి మీకెంత సమయం పడుతుందో ఏమో? ఏవండోయ్…నాని గారూ…అంతేగా..!

Comments are closed.

Exit mobile version