సూర్యుడు ఎలా ఉంటాడు. భగ భగ మండుతూ ఉంటాడు. ఎండా కాలంలో నిప్పులు చిమ్ముతూ మరీ విశ్వవ్యాప్తంగా వెలుగులు ప్రసరింపజేస్తుంటాడు. కానీ.. ఈ ఫొటోను నిశితంగా పరిశీలించండి. పల్లీ పట్టి (వేరు శనగ పట్టి) మాదిరిగా కనిపిస్తున్న ఈ చిత్రంలోని దృశ్యం సూర్యుడంటే నమ్మశక్యం కాకపోవచ్చు. కానీ హవాయిలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ ఈ చిత్రాన్ని తాజాగా విడుదల చేసింది.
నాలుగు మీటర్ల సౌర, భూ ఆధారిత టెలీస్కోప్ ద్వారా తీసిన ఈ చిత్రాన్ని ‘ఫస్ట్ లైట్’ గా వ్యవహరిస్తుండడం విశేషం. ఆయా టెలీస్కోప్ నుంచి వచ్చిన తొలి చిత్రాలు సూర్యుని ఉపరితలపు దృశ్యాన్ని అత్యంత దగ్గరగా చూసినపుడు ఇలా సాక్షాత్కరించడమే ప్రత్యేకతగా సైన్స్ రిపోర్టర్ జామీ కార్టర్ తన తాజా వార్తా కథనంలో పేర్కొన్నారు. వచ్చే జూలై 1వ తేదీ నుంచి ఈ టెలీస్కోప్ అధికారికంగా తన పనిని ప్రారంభిస్తుందని, అప్పుడు సౌర, విజ్ఞాన శాస్త్రంలో సరికొత్త శకానికి సంకేతాన్ని ఇస్తుందని భావిస్తున్నారు.