కృష్ణా న‌దిపై కొత్త ఆన‌క‌ట్ట నిర్మాణానికి తెలంగాణా ప్రభుత్వం నడుం బిగించింది. ఇందులో భాగంగానే ఇటీవల క్యాబినెట్ నిర్ణయానికి అనుగుణంగా కృష్ణా న‌దిపై కొత్త ఆన‌క‌ట్ట నిర్మాణానికి స‌ర్వే కోసం తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీచేసింది. ఆన‌క‌ట్ట‌తో పాటు ఇత‌ర ప్రాజెక్టుల నిర్మాణ స‌ర్వే కోసం ఉత్త‌ర్వులు వెలువ‌రించింది. కృష్ణాన‌దిలో తుంగ‌భ‌ద్ర క‌లిసే చోట‌ 35 నుంచి 40 టీఎంసీలు నీటి నిల్వ చేసేలా జోగులాంబ ఆన‌క‌ట్ట నిర్మాణం త‌ల‌పెట్టనుంది. రోజుకు ఒక టీఎంసీ నీటిని త‌ర‌లించేలా నారాయ‌ణ‌పేట జిల్లా కుసుమ‌ర్తి వ‌ద్ద వ‌ర‌ద కాల్వ నిర్మాణం చేప‌ట్టేలా ప్ర‌తిపాద‌న‌లు చేసింది.

అంతేగాక అలంపూర్‌, గ‌ద్వాల్ ప్రాంతాల్లోని 2 ల‌క్షల ఎక‌రాల ఆయ‌క‌ట్టు పారుద‌ల కోసం సుంకేశుల జ‌లాశ‌యం వ‌ద్ద ఎత్తిపోత‌ల నిర్మాణం చేప‌ట్ట‌నున్నారు. క‌ల్వకుర్తి ప్రాజెక్టు కింద జ‌లాశ‌యాల సామ‌ర్థ్యాన్ని 20 టీఎంసీల‌కు పెంచ‌నున్నారు. ఉమ్మడి న‌ల్లగొండ జిల్లాలోని 2 ల‌క్ష‌ల ఎక‌రాల‌కు సాగునీటి కోసం పులిచింత‌ల వ‌ద్ద ఎత్తిపోత‌ల నిర్మాణం, ల‌క్ష ఎక‌రాల మేర అంత‌రం ఉన్న ఆయ‌క‌ట్టుకు నీరందించేలా సాగ‌ర్ టెయిల్ పాండ్ ఎత్తిపోత‌ల ప‌థ‌కం నిర్మాణం చేపట్టనుంది. ఈ మేర‌కు ఆయా ప్రాజెక్టుల స‌మ‌గ్ర స‌ర్వే చేప‌ట్టేందుకు నీటిపారుద‌ల‌శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఉత్తర్వుల ప్రతిని దిగువన చూడవచ్చు.

Comments are closed.

Exit mobile version