లోక్ సభలో టీఆర్ఎస్ సభా పక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు నామ నాగేశ్వర్ రావు శుక్రవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరు కావలసి ఉంది. ఈనెల 25వ తేదీన హాజరు కావాలని నామ నాగేశ్వర్ రావుకు ఈడీ గత నెల 16వ తేదీన సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాంచీ ఎక్స్ ప్రెస్ వే ప్రాజెక్టుకు సంబంధించిన బ్యాంకు రుణాలను దారి మళ్లించారనే అభియోగాలపై ఎంపీ నామతో పాటు కేసుతో సంబంధం గల నిందితులందరికీ ఈడీ సమన్లు జారీ చేసింది.

ఎంపీ నామ నాగేశ్వర్ రావు ప్రస్తుతం ఢిల్లీలో ఉన్నారు. పార్లమెంట్ స్థాయీ సంఘాల సమావేశాల్లో పాల్గొనేందుకు ఆయన దేశ రాజధానికి వెళ్లారు. అయితే ఈడీ విచారణకు నామ నాగేశ్వర్ రావు స్వయంగా శుక్రవారం హాజరవుతారా? లేక హాజరయ్యేందుకు మరింత వ్యవధి కోరుతూ అభ్యర్థిస్తారా? అనే ప్రశ్నలపై స్పష్టత లేదు. కాగా మధుకాన్ సంస్థలకు తాను వ్యవస్థాపకుడిని మాత్రమేనని, ప్రజా జీవితంలో అడుగిడిన తర్వాత సంస్థ రెగ్యులర్ కార్యకలాపాల నుంచి వైదొలగినట్లు నామ నాగేశ్వర్ రావు ఈనెల 19వ తేదీన మీడియా సమావేశంలో ప్రకటించారు. సంస్థలో ఏ హోదాలోనూ తాను ప్రస్తుతం లేనని స్పష్టం చేశారు.

Comments are closed.

Exit mobile version