టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో సాయుధ నక్సల్ దళం కదలికల వార్తలు కలకలం కలిగిస్తున్నాయి. రాష్ట్రంలో నక్సల్ కార్యకలాపాలు నిర్మూలించినట్లు పోలీసు యంత్రాంగం అనేక సందర్భాల్లో ప్రకటించిన నేపథ్యంలో తాజాగా సాయుధ దళం సంచరిస్తూ సమావేశాలు ఏర్పాటు చేస్తోందని వెలువడుతున్న వార్తలు తీవ్ర సంచలనం కలిగిస్తున్నాయి.

జనశక్తి అగ్రనేత కూర రాజన్న (కేఆర్) వర్గానికి చెందిన జనశక్తి రాష్ట్ర కార్యదర్శి విశ్వనాథ్ తోపాటు దాదాపు 8 మంది సాయుధ నక్సల్స్, 65 మంది సానుభూతిపరులు, మరికొందరు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు తాజా వార్తల సారాంశం. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట మండలాల్లోని బోనాల, పోతిరెడ్డిపల్లి, ధర్మారం, అక్కపల్లి గ్రామాలను కలిపే అటవీ ప్రాంతంలో నక్సల్స్ నాలుగు రోజులపాటు సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి.

ఈనెల 9వ తేదీ నుంచి12వ తేదీ వరకు జరిగిన ఈ కీలక సమావేశంలో సాయధ నక్సల్స్ సహా వరంగల్, నిజామాబాద్, మెదక్, సిరిసిల్ల జిల్లాలకు చెందిన జనశక్తి సానుభూతిపరులు, పూర్వకాలంలో పార్టీలో పనిచేసినవారు పాల్గొన్నట్లు తెలుస్తోంది. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందినవారేగాక, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్, గంభీరావుపేట, కోనారావుపేట, తంగళ్లపల్లి ప్రాంతాలకు చెందిన పార్టీ సానుభూతిపరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.

1990 దశకంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో, ముఖ్యంగా సిరిసిల్ల నియోజకవర్గంలో జనశక్తి పార్టీ తిరుగులేని ఆధిపత్యాన్ని చెలాయించింది. ఓవైపు పోలీసులతో, ఇంకోవైపు అప్పటి పీపుల్స్ వార్, ఇప్పటి మావోయిస్టు పార్టీతో కూడా తలపడింది. జనశక్తి పార్టీకి చెందిన ఎన్వీ క్రిష్ణయ్య 1989లో సిరిసిల్ల నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతర పరిణామాల్లో జనశక్తి పార్టీ ఆనవాళ్లు లేకుండా చేసినట్లు పోలీసులు ప్రకటించారు.

అయితే తాజాగా అదే పార్టీకి చెందిన కీలక నేతలు సహా మంది సాయుధ నక్సల్స్ పాల్గొన్న సమావేశం గురించి తెలుసుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు. నక్సల్స్ సమావేశమైన ప్రాంతాన్ని గుర్తించి పరిశీలించినట్లు తెలిసింది. మొత్తంగా మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లాలో నక్సల్స్ సమావేశపు అంశం తీవ్ర కలకలం కలిగిస్తోంది. సాయుధ నక్సల్స్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారంటే ‘దళం’ ఏర్పాటైందా? అనే కోణం నుంచి పోలీసులు సమాచార సేకరణ చేస్తున్నారు. ఇదే అంశంపై సిరిసిల్ల జిల్లా పోలీసు వర్గాలు మాట్లాడుతూ, నక్సల్స్ కదలికలు ఉన్నట్లు సమాచారం ఉందని, అయితే సాయుధ నక్సల్స్ సంచరిస్తున్నారనేది వాస్తవం కాదని చెప్పాయి.

ఫొటో: ప్రతీకాత్మక చిత్రం

Comments are closed.

Exit mobile version