ఏలూరులో ప్రబలిన అంతుచిక్కని వ్యాధిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏలూరు బాధితుల అస్వస్థతకు ‘సీసం’ కారణంగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రకటించారు. ఢిల్లీ ఎయిమ్స్ పరీక్షల్లో ఈ విషయం తేలిందని ఆయన వెల్లడించారు. బ్యాటరీల్లో ఉండే లోహం తాగునీరు, పాల ద్వారా బాధితుల శీరీరాల్లోకి వెళ్లి ఉండొచ్చని ఆయన పేర్కొన్నారు. ఇదే దశలో మరో వాదనా వినిపిస్తోంది. ఏలూరు ఘటన 1978లో గోరఖ్ పూర్ లో ప్రబలిన వ్యాధిగా ‘ఇఫ్టూ’ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు. తన వాదనకు గల కారణాలను కూడా ఆయన అదే పోస్ట్ లో వివరించారు. అయితే జీవీఎల్ నరసింహారావు చేసిన ప్రకటనను ‘ఇఫ్టూ’ ప్రసాద్ దృష్టికి తీసుకువెళ్లగా, తానూ ఆయన చేసిన ప్రకటన గురించి ఈ ఉదయమే విన్నానని, ఆ తర్వాత తనకు పరిచయం గల ‘ఎయిమ్స్’ వైద్యులతో సంప్రదించానని చెప్పారు. అరటిపళ్ల గెలలపై వాలిన కొన్ని క్రిముల వల్ల కూడా ఈ వ్యాధి ప్రబలే అవకాశమున్నట్లు ఎయిమ్స్ వైద్యవర్గాలు చెప్పాయని ప్రసాద్ అన్నారు. ఈ అంశంపై శాస్త్రీయ నిర్ధారణతో ఎయిమ్స్ వైద్యులు వెల్లడించాల్సి ఉందన్నారు. ఇంతకీ ఏలూరు అంతుచిక్కని వ్యాధిపై ‘ఇఫ్టూ’ ప్రసాద్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ను ఉన్నది ఉన్నట్లుగా దిగువన మీరూ చదవవచ్చు.
గత మూడు రోజులుగా ఏలూరులో సుమారు 400 మందికి వ్యాపించి కల్లోలపరుస్తున్న అంతుపట్టని వ్యాధి గూర్చి తెలిసిందే. స్థానిక వైద్య పరీక్షలలో ఏదీ లేదని తేలినట్లు రిపోర్టులు వస్తున్నాయి. ఆరోగ్య శాఖా మంత్రి నుండి ముఖ్యమంత్రి వరకూ పర్యటనలలో కూడా ఏదీ తేల్చి ప్రజలకు చెప్పలేని సందిగ్ధ స్థితి కొనసాగుతూ ఉంది. ఈ తరహా వ్యాధి లక్షణాలు ఇంతవరకూ ఎక్కడా చూడలేదన్న రిపోర్టులు సంబంధిత శాఖల అధికార వర్గాల నుండి వెలువడటం కూడా తెలిసిందే. ఐతే దీనికి సంబంధించిన ఒక ఫ్లాష్ న్యూస్ ఇప్పుడే అందింది.
ఢిల్లీలోని ALL INDIA INSTITUTE OF MIDICAL SCIENCES (AIIMS) తో సంబంధంగల వైద్య వర్గాల నుండి అందిన తాజా వార్తా సమాచారాన్ని షేర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాము.
ఇదే వ్యాధి యూపీలోని గోరఖ్ పూర్ లో మొట్ట మొదటి సారిగా 1978 లో వెలుగులోకి వచ్చింది. ఆనాడు కూడా అదో “అంతుపట్టని వ్యాధి”గా వైద్య వర్గాలను చాలా కాలంపాటు ఆందోళనకు గురి చేసింది. అది యూపీ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ తేల్చలేక పోయింది. చివరకు ఢిల్లీలోని AIIMS దృష్టికి వచ్చింది. వైద్య పరిశోధనలలో వ్యాధి కారకం దోమకాటుగా తేలింది. నేటికీ ఆ వ్యాధి యూపీ, బీహార్ లలో కొన్ని జిల్లాలలో అప్పుడప్పుడు సోకుతూనే వుంది.
మేము భారత కార్మిక సంఘాల సమాఖ్య (IFTU) లో పని చేస్తున్నాము. మా IFTU అఖిల భారత అధ్యక్షురాలు డాక్టర్ అపర్ణ గారు తన విద్యార్థి జీవితంలో AIIMS లో వైద్య విద్య పూర్తి చేశారు. మా IFTU ఆలిండియా ఉపాధ్యక్షులు డాక్టర్ VK పటోలే గారు, కోశాధికారి డాక్టర్ అనిమేశ్ దాస్ గారు కూడా తమ వైద్య విద్యను గతంలో AIIMS లో పూర్తి చేశారు. వీరందరూ 2006 జనవరిలో ఏలూరులో జరిగిన IFTU ఆలిండియా మహాసభకు మా IFTU నాయకులుగా హాజరైన వారే. డాక్టర్ patole గారు 1991 ఏప్రిల్ లో ఏలూరులో జరిగిన నాటి ఏపీ నాల్గవ IFTU రాష్ట్ర మహాసభలకు కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతే కాకుండా గతంలో ఏలూరు జ్యూట్ మిల్లు కార్మిక పోరాటాల సందర్భాలలో హాజరైన నేపథ్యం వుంది.
ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్స్ & న్యూస్ పేపర్స్ ద్వారా ఏలూరులోని తాజా వ్యాధి వార్తల్ని పైన పేర్కొన్న డాక్టర్స్ తెలుసుకొని, ఏలూరుతో మా అనుబంధం తెలిసి మమ్మల్ని సంప్రదించారు. ఏలూరు కార్మిక ఉద్యమంలో గతంలో పని చేసిన నాతోనూ, పోలారితోనూ, ఇప్పుడు పని చేస్తున్న U. వెంకటేశ్వరరావు (UV)తోనూ వారు ఇప్పుడు గత అర్ధరాత్రి కాంటాక్ట్ చేశారు. ఇది అంతుపట్టని వ్యాధి కాదనీ, ఒక రకం దోమకాటు ద్వారా ఇది సోకుతుందనీ తెలిపారు. ఇది ఒకరి నుండి మరొకరికి వ్యాపించే అంటువ్యాధి కాదని కూడా చెప్పారు. ఐతే ఒకరకం దోమ కాటు వల్ల కొన్ని ప్రత్యేక సీజన్లలో వ్యాపిస్తుందని కూడా తెలిపారు. దీనికి గల తీవ్రతని దృష్టిలో ఉంచుకొని అర్ధరాత్రి చర్చించారు.
దీనిపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఢిల్లీలోని ఏఐఐఎంఎస్ (AIIMS) వైద్య వర్గాల నుండి లేదా యూపీ, బీహార్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖల నుండి సంబంధిత దోమకాటు, దానికి చికిత్స ప్రక్రియల గూర్చి అత్యవసర నివేదికలు తెప్పించుకొని తక్షణమే యుద్ధ ప్రాతిపదికపై నియంత్రణ చర్యల్ని చేపట్టాల్సి వుంది. అది నేటికీ “అంతుపట్టని వ్యాధి” గా ఏపీ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ భావిస్తున్న నేపథ్యంలో అది అంతు చిక్కని వ్యాధి కాదనే ప్రాథమిక విషయాన్ని స్పష్టం చేస్తున్నాం. వ్యాధికి కారణం తెలియని స్థితి ఇప్పటికీ కొనసాగుతుండటం వల్ల మేం ఈ ఫ్లాష్ న్యూస్ ని సోషల్ మీడియా ద్వారా వెంటనే బహిరంగంగా వెల్లడి చేస్తున్నాం.
✍ ఇఫ్టూ ప్రసాద్ (పిపి)
IFTU AP రాష్ట్ర అధ్యక్షులు.